తెలంగాణకు కరువు ముప్పు.. రేవంత్ కీలక హెచ్చరిక
x

తెలంగాణకు కరువు ముప్పు.. రేవంత్ కీలక హెచ్చరిక

తెలంగాణలో ఎల్‌నినో, కరువు ముప్పుపై సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక. నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటలు, ఉపాధి హామీపై ప్రభుత్వం కీలక చర్యలు.


తెలంగాణకు రానున్న రోజుల్లో తీవ్ర కరువు వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవడావడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాగునీరు, సాగునీటి కొరతతో పాటు విద్యుత్‌ సరఫరాపైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని పిలుపునిచ్చారు. మరోవైపు, కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

శుక్రవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలతో కరువు పరిస్థితులు, విద్యుత్‌ వినియోగం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగే అవకాశం ఉందని సీఎం తెలిపారు. రానున్న నెలల్లో ఎండల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందన్నారు.

కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు. మహారాష్ట్ర వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనూ నీటి కొరత ఉందని గుర్తుచేశారు. తెలంగాణలోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరువుపై రాజకీయ దుష్ప్రచారాన్ని నమ్మకుండా ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.

358 మండలాల్లో కరువు పరిస్థితులు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమైంది. కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన సహాయం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 358 మండలాల్లో ప్రాథమికంగా కరువు పరిస్థితులను గుర్తించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు.

324 మండలాల్లో భూగర్భ జలాల మట్టం ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. మొత్తం 33 జిల్లాల్లో 18 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, మిగిలిన 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వివరించారు. రాష్ట్ర రిజర్వాయర్లలో 470 టీఎంసీలకు గాను ప్రస్తుతం 170 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. సింగూరు జలాశయంలో నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

కరువు మండలాలను శాస్త్రీయంగా గుర్తించి, నిబంధనల ప్రకారం ప్రకటించాలని సబ్‌ కమిటీ సూచించింది. అక్టోబర్‌ 31లోగా అర్హత కలిగిన మండలాల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించే అంశంపైనా నిర్ణయం తీసుకుంది.

తాగునీటికి ప్రాధాన్యం.. వరి సాగుకు దూరంగా

రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉండటంతో రానున్న పంటల సీజన్‌లో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని మంత్రులు తెలిపారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని వ్యవసాయ, నీటిపారుదల శాఖలను ఆదేశించారు.

గ్రామస్థాయిలో రైతులకు సాంకేతిక సలహాలు, సాగు ప్రణాళికలు అందించాలని సూచించారు. భూగర్భ జలాల మట్టం, వర్షపాతం, వేసవి తీవ్రతకు సంబంధించిన వివరాలను ప్రతి వారం ప్రజలకు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రభుత్వ పథకాలు, నీటి సంరక్షణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు.

విద్యుత్‌ పొదుపుపై ప్రత్యేక దృష్టి

ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 20 వేల మెగావాట్లకు మించిందని సీఎం తెలిపారు. రానున్న నెలల్లో విద్యుత్‌ అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున పొదుపు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పగటిపూట అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగాన్ని తగ్గించాలని చెప్పారు. సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహించాలని సూచించారు.

అధిక ధర చెల్లించినా అవసరమైన విద్యుత్‌ అందుబాటులో లేకపోవచ్చని హెచ్చరించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన నిధులు అందుబాటులో ఉండేలా ఆర్థిక శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు.

ఉపాధి హామీపై గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యం

కరువు పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జాబ్‌ కార్డులు లేని అర్హులైన గిరిజన కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ ఆదేశాలు జారీ చేశారు.

జాబ్‌ కార్డుల్లో 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేశారు. వీబీ–జీ రామ్ జీ పథకం కింద అర్హులైన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వలసలను తగ్గించి, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని కాపాడటం ఈ చర్యల లక్ష్యమని అధికారులు తెలిపారు.

పశువుల సంరక్షణకు చర్యలు

కరువు కారణంగా చెరువుల్లో నీరు తగ్గిపోవడంతో చేపల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పెద్ద రిజర్వాయర్లలో చేపలను వదిలేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో పశువులకు తాగునీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని సూచించారు. పశుసంపదను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి సీతక్క సూచనల మేరకు గిరిజన ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు కరువు సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు రూ.7,000 కోట్లతో కరువు పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే అత్యవసర నిధుల కింద రూ.కోటి చొప్పున విడుదల చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

గ్రామాల్లో పర్యటించనున్న ప్రజాప్రతినిధులు

కరువు పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సంక్రాంతి తర్వాత నుంచి మే నెలాఖరు వరకు గ్రామాలు, వ్యవసాయ భూముల్లో పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు. ప్రజాప్రతినిధుల పర్యటనలను పర్యవేక్షించేందుకు మానిటరింగ్‌ యాప్‌ వినియోగించనున్నట్లు చెప్పారు.

గ్రామాల్లో మట్టి పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి, ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. తాగునీటి సరఫరా, వ్యవసాయం, విద్యుత్‌, గ్రామీణ ఉపాధి, పశుసంపద సంరక్షణపై అన్ని శాఖలు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. కరువు ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సహాయాన్ని సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read More
Next Story