తెలంగాణలో ఆటో, క్యాబ్, స్విగ్గీ నిరవధిక సమ్మె
x

తెలంగాణలో ఆటో, క్యాబ్, స్విగ్గీ నిరవధిక సమ్మె

16 కార్మిక సంఘాల పిలుపుతో తెలంగాణలో గిగ్ వర్కర్లు నిరవధిక సమ్మె ప్రారంభించారు. కనీస చార్జీలు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు ప్రధాన డిమాండ్లు.


తెలంగాణలో నిరవధిక సమ్మెకు గిగ్ వర్కర్ రెడీ అయ్యారు. శనివారం నుంచి సమ్మె ప్రారంభించనున్నట్లు యూనియన్ నేతలు వెల్లడించారు. దీంతో శనివారం నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ, జొమాటో, జెప్టో సహా యాప్ ఆధారిత సేవలు నిలవనున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో 16 సంఘాలు కలిసి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. తెలంగాణలో గిగ్, ప్లాట్‌ఫారం కార్మికులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర డెలివరీ సేవల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు.

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారం వర్కర్స్ యూనియన్ పిలుపుతో మొత్తం 16 వాహన, కార్మిక సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ, ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం రాలేదని పేర్కొన్నారు. యాప్ ఆధారిత కార్మికులందరికీ కనీస బేస్ ఫేర్‌తో పాటు ప్రతి కిలోమీటర్, ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలు నిర్ణయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పెరిగిన ఇంధన ధరలు, ఈ20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గడంతో ఆదాయం తగ్గిందని తెలిపారు. అలాగే, తెలంగాణ ప్లాట్‌ఫారం బేస్డ్ గిగ్ వర్కర్స్ చట్టం-2026 ప్రకారం వెంటనే రూల్స్‌ను నోటిఫై చేసి, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కనీస చార్జీలను కూడా ఆ నిబంధనల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ప్రకారం కనీస చార్జీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని యూనియన్ కోరుతోంది.

ప్రస్తుతం ప్లాట్‌ఫారం కంపెనీలు తమ ఇష్టానుసారం చార్జీలు నిర్ణయిస్తున్న విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అలాగే, వ్యక్తిగత వినియోగానికి మాత్రమే ఉద్దేశించిన వైట్ నంబర్ ప్లేట్ వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది కేవలం ఆదాయం కోసం చేసే పోరాటం కాదని, లక్షలాది గిగ్ కార్మికుల జీవనోపాధి, గౌరవం, సామాజిక భద్రత కోసం చేపట్టిన ఉద్యమమని యూనియన్ తెలిపింది. ఇదే డిమాండ్లతో జూలై 22న నిర్వహించిన ఫ్లాష్ సమ్మెలో 3.9 లక్షల మందికి పైగా కార్మికులు పాల్గొన్నారని యూనియన్ వెల్లడించింది. ఈసారి కూడా పలు కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి.

Read More
Next Story