విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్
x
Aadhar Card and Memo (AI Image)

విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్

బోధన ఫీజులు, ఉపకార వేతనాలు కావాలని అనుకునే విద్యార్ధుల పేర్లు మెమో-ఆధార్ కార్డు-బ్యాంకు ఖాతాలో పేరు ఇంటిపేరు ఒకటే విధంగా ఉండాలని


తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏమిటంటే బోధన ఫీజులు, ఉపకార వేతనాలు కావాలని అనుకునే విద్యార్ధుల పేర్లు మెమో-ఆధార్ కార్డు-బ్యాంకు ఖాతాలో పేరు ఇంటిపేరు ఒకటే విధంగా ఉండాలని. మెమోలో పేరు, ఇంటిపేరు, ఆధార్ కార్డులో పేరు, ఇంటిపేరులో తేడాలుంటే మాత్రం ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్ మెంటు సదరు విద్యార్ధికి అందదు. ప్రతి ఏడాది ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉపకార వేతనాల కోసం సుమారు 12 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకుంటారు. వీరికి పై రెండు పద్దతుల్లో ప్రభుత్వం సుమారు రు. 2400 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పటివరకు ఆధార్ కార్డు ఆధారంగా ధృవీకరించుకుని ప్రభుత్వం విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉపకార వేతనాలను మంజూరుచేసేది.

అయితే జాతీయ ఉపకార వేతనాల విధానాన్ని తెలంగాణలో కూడా అమలుచేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. రాష్ట్రంలో ఎస్సీ విద్యార్ధులకు చెల్లిస్తున్నట్లుగానే ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్ధులకు వాళ్ళ వ్యక్తిగత బ్యాకు ఖాతాల్లోనే డబ్బులు జమచేయాలని తాజాగా నిర్ణయించింది. అందుకనే మెమోలో ఇంటిపేరు, పూర్తి పేరు ఆధార్ కార్డులోని ఇంటిపేరు, పూర్తి పేరుతో సరిపోవాలనే నిబంధనను తీసుకొచ్చింది. ఎక్కడ తేడా వచ్చినా ఫీజు రీంఎబర్స్ మెంట్, ఉపకార వేతనం విద్యార్ధికి అందదు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ లోగా ఏవైనా తేడాలుంటే అర్జంటుగా సర్దుబాటు చేసుకోవాలని కూడా విద్యార్దులకు ప్రభుత్వం చెప్పింది. విద్యా సంవత్సరం మొదలవ్వగానే అర్హులైన విద్యార్ధులు ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకుంటారు. అందుకనే విద్యా సంవత్సరం ప్రారంభయ్యేలోగానే ఆధార్ కార్డు, మెమోలో ఒకటే పేరు, ఇంటిపేరు ఉండేలా చూసుకోమని చెప్పింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆధార్ కార్డులో పేరుకు మెమోలో పేరుకు చాలామందికి తేడా ఉంటుంది. ఎందుకంటే కొందరు విద్యార్ధుల పేర్లు ఇంటిపేరుతో కలుపుకుని చాలా పొడవుగా ఉంటాయి. టీసీల్లో, మార్క్స్ మెమోల్లో రాసేటపుడు లేదా కంప్యూటర్లో టైప్ చేసేటపుడు ఇంటిపేరు, విద్యార్ధి పేరు కలిపి టైప్ చేసేస్తారు. ఎందుకంటే కంప్యూటర్ టైపింగులో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి. అదే ఆధార్ కార్డులో అంతపెద్ద పేరు రావాలంటే స్పేస్ ఉండదు. అందుకని ఇన్షియల్స్ కలిపి పేరు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు టీసీల్లో, మెమోల్లో నూకల వెంకట సత్య సాయి రామకృష్ణ అనే పేరును పూర్తిగా రాయటం వీలవుతుంది. ఇక్కడ ఎన్ అన్నది ఇన్షియల్ అయితే మిగిలింది సదరు విద్యార్ధి పేరు. అదే ఆధార్ కార్డులో ఇంటిపేరుతో కలిపి అంతపెద్ద పేరు రాయటం సాధ్యంకాదు. అందుకని సింపుల్ గా ఎన్ వీఎస్ఎస్ రామకృష్ణ అని వచ్చేస్తుంది.

టీసీ లేదా మెమోలో ఉన్నట్లు ఇంటిపేరుతో కలిపి పూర్తి పేరు ఆధార్ కార్డులో కూడా ఉండాల్సిందే అని ప్రభుత్వం అంటే సాధ్యంకాదు. రెండింటిలో ఇంటిపేరు, పూర్తిపేరు వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉపకార వేతనాలు ఆపేస్తే సదరు విద్యార్ధి నష్టపోవటం ఖాయం. టీసీ లేదా మెమోలో ఇంటిపేరు, పూర్తి పేరును మార్చి ఇన్షియల్స్ తో పేరును మార్పించుకోవాలంటే విద్యార్ధి నానా అవస్తలు పడాల్సిందే. నోటరీ అఫిడవిట్ చేయించి కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటే కాని టీసీ, మెమోల్లో ఆధార్ కార్డులో ఉన్నట్లు పేరు మార్చటం సాధ్యంకాదు. ఇదంతా తొందరగా అయ్యే పనికాదు.

దరఖాస్తులు ఆన్ లైన్లోనే అప్ లోడ్ చేయాలి కాబట్టి మెమోలో ఇంటిపేరు, పూర్తి పేరు-ఆధార్ లో ఇంటిపేరు, పూర్తి పేరు ఒకటిగా ఉంటేనే దరఖాస్తు అక్కడినుండి ముందుకు వెళుతుంది. తేడా ఉంటే దరఖాస్తు ఆన్ లైన్లో ముందుకువెళ్ళదు, దరఖాస్తు చేయటం సాధ్యంకాదు. ఒక అంచనా ప్రకారం ఇంటిపేరు, పూర్తి పేరులో తేడాలున్న విద్యార్ధుల సంఖ్య సుమారు 2.5 లక్షలుంటుంది. మరి ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉపకార వేతనాలు అందుకోవాలంటే ఇపుడీ విద్యార్ధులు ఏమి చేస్తారో చూడాల్సిందే. పైగా విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా అన్నింటినీ సరిచేసుకోమని ప్రభుత్వం చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇపుడు స్కూళ్ళకు సెలవులు. చాలా స్కూళ్ళలో స్టాఫ్ సెలవుల్లో ఉంటారు. మరిపుడు విద్యార్ధులు ఏమి చేయాలి చెప్మా....

Read More
Next Story