
తెలంగాణ స్కూళ్ళల్లో సెమిస్టర్ విధానం ?
డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఉన్నట్లే స్కూలు పరీక్షల్లో కూడా సెమిస్టర్ విధానాన్ని అమలుచేసే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నది
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కూలు విద్యకు సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని పరిశీలిస్తోంది. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఉన్నట్లే స్కూలు పరీక్షల్లో కూడా సెమిస్టర్ విధానాన్ని అమలుచేసే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నది. స్కూలుస్ధాయిలో అంటే మరీ ఒకటవ తరగతి అనికాదు తొమ్మిదో తరగతితో మొదలుపెట్టి ఇంటర్మీడియట్ వరకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహించటం వల్ల విద్యార్ధులకు ఉపయోగంగా ఉంటుందనే విషయాన్ని ఆలోచిస్తున్నది. పరీక్షలకు సంబంధించి పిల్లలపై ఒత్తిడి తగ్గించటమే లక్ష్యంగా ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రభుత్వ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే విషయమై ‘తెలంగాణ విద్యా విధానం కమిటీ’ సభ్యులు కసరత్తు చేస్తున్నారు. సెమిస్టర్ విధాన్ని అమలుచేయాలని కమిటీ సభ్యులు స్ధూలంగా నిర్ణయం తీసుకున్నా అమలు విధానంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి విధానం ఏమిటంటే ఏడాదికి ఒకసారి మాత్రమే పరీక్షలు నిర్వహించటం. వార్షిక పరీక్షలకు చదువుకోవాల్సిన విద్యార్ధులు ఏడాదిలో చదివిన పాఠాలు మొత్తాన్ని బట్టీ పట్టి పరీక్షలు రాయాలి లేదా చదువుకున్నది గుర్తుపెట్టుకుని పరీక్షలు రాయాల్సుంటంది. దీనివల్ల పిల్లలు మానసికంగా అలసిపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది.
పిల్లలపై మానసిక ఒత్తిళ్ళు తగ్గించాలంటే వార్షిక పరీక్షలు కాకుండా ప్రతి ఆరుమాసాలకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే చదవు విషయంలో ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచించింది. సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాసేటపుడు సిలబస్ కూడా వేర్వేరుగా ఉంటుంది. మొదటి ఆరుమాసాల తర్వాత సెమిస్టర్ పరీక్షలు అయిపోయిన తర్వాత పిల్లలు ఇక మళ్ళీ చదివేసిన సిలబస్ ను చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది. సెమిస్టర్ విధానం వల్ల టీచర్ల సైతం హడావుడిగా సిలబస్ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా ప్లాన్డ్ గా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి సెమిస్టర్ లో పిల్లలు సాధించిన మార్కులను బట్టి రెండో సెమిస్టర్ లో చదువుపై దృష్టిపెట్టవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది.
ఏ కారణం వల్లయినా స్కూల్ స్ధాయిలో సెమిస్టర్ విధానం అమలు చేయలేకపోయినా ఇంటర్మీడియట్ విద్యలో సెమిస్టర్ విధానాన్ని అమలుచేయటం ఖాయమనే అనిపిస్తోంది. పుస్తకాలను బట్టీపెట్టి పరీక్షలు రాసే విధానాన్ని కాకుండా ప్రాక్టికల్స్ కు పెద్ద పీట వేయాలని ప్రభుత్వ ఆలోచిస్తోంది. దీనివల్ల విద్యార్ధులకు అనుభవపూర్వకమైన విజ్ఞానాన్ని అందించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

