
తెలంగాణలో ‘ఫీల్ ది జైల్’ షురూ..
తెలంగాణలో ఫీల్ ది జైల్ పేరిట సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. జైలు జీవితం ఎలా ఉంటుంది? జైలులో ఆహారం, వ్యవహారం ఎలా ఉంటుంది? శిక్షలు ఎలా ఉంటాయి? అన్న విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉన్నవారికి ఇది మంచి అవకాశం. రోజుకు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది ఒక రోజు పాటు జైలు జీవితాన్ని అనుభవించవచ్చు. ఈ ప్రోగ్రాంను హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో మంగళవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. దీంతో పాటు జైలు మ్యూజియంను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖ తీసుకొస్తున్న సంస్కరణలను అభినందించారు.
‘‘జైళ్లలో పోలీసులు చేపట్టిన సంస్కరణలు బాగున్నాయి. ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నా. ఉత్తరప్రదేశ్ మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇటువంటి కొన్ని సంస్కరణలను చేపట్టడం జరిగిది. జైలు శిక్ష అంటే తప్పు చేసిన వారిని శిక్షించడం కాదు. వారిలో పరివర్తన తీసుకురావడం. అందుకు కావాల్సిన వాతావరణాన్ని జైళ్లలో ఏర్పాటు చేశాయి. ఖైదీలను పూర్తిగా బంధించి ఉంచాల్సిన అవసరం లేదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచాలి. అప్పుడే వారిలో మార్పు వస్తుంది’’ అని గవర్నర్ చెప్పుకొచ్చారు.
రూ.500 జైలు విశేషాలివే..
ఒక్కరోజు జైలు జీవితం అని పేరుకుమాత్రమే. ఒకసారి 500 రూపాయలు చెల్లించి జైలులోకి వెళితే మిగిలిన ఖైదీల్లాగేనే ట్రీట్ చేస్తారు. తెల్లవారుజామునే నిద్రలేవటం, జైలు మాన్యువల్ ప్రకారం అందించే పప్పు, అన్నం, చారు లాంటి సాదాసీదా భోజనం మాత్రమే తినాలి. అధికారులు చెప్పే తోటపనులు, వంటపనులు, బాత్రూములను శుభ్రంచేయటం లాంటి పనులూ తప్పవు. పడుకోవటానికి మంచాలు, పరుపులుండవు నేలపై ఒక దుప్పటిపరుచుకుని దిండు పెట్టుకుని పడుకోవాల్సుంటుంది. ఇక బాత్ రూమ్ అంటారా మిగిలిన ఖైదీలు ఉపయోగించే బాత్ రూమ్ లనే అద్దె వ్యక్తులు కూడా ఉపయోగించుకోవాల్సుంటుంది. జైళ్ళ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయి ? అధికారులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు ? జైళ్ళల్లో ఖైదీల దినచర్య ఎలాగుంటుంది ? అన్న విషయాలపై మామూలు జనాలను చైతన్య పరిచేందుకు మాత్రమే జైళ్ళశాఖ ఉన్నతాధికారులు ఇలా రు. 500కి ఒక్కరోజు జైలు జీవితం అనే కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

