ఈహెచ్ఎస్ పథకం అమలులో ముందడుగు పడటం లేదంటున్న ఉద్యోగ సంఘాలు
x

ఈహెచ్ఎస్ పథకం అమలులో ముందడుగు పడటం లేదంటున్న ఉద్యోగ సంఘాలు

ఐదు డీఎలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తో పాటు కాలేజీలకు బాకయీలు పెట్టి ప్రైవేట్ ఉద్యోగులను దూరం చేసుకుంటున్న ప్రభుత్వం


రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఈహెచ్ఎస్ పథకం అమలులో ముందడుగు పడటం లేదని తెలంగాణ పెన్షనర్స్ జె.ఎ.సి ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా మే 17 వ తారీఖున జరిగే పెన్షనర్ల నిరసన ప్రదర్శనలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగులు, పెన్షనర్లు తమకు అందుబాటులో ఉండే తహసీల్దార్ కార్యాలయం, ఆర్.డి.ఓ. కార్యాలయం లేదా కలెక్టరేట్ లలో మిగతా ఉద్యోగులతోపాటు లంచ్ అవర్ లో నిరసనల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతంలోని బేసిక్ పేలో 1.5 శాతం తీసుకుని దానికి సరిసమానంగా తన వాటా కూడా చేర్చి ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని ముందుకు వచ్చింది. ఉద్యోగుల నుంచి సేకరించిన మొత్తం ఏడాదికి రు. 528 కోట్లకు ప్రభుత్వం తన వాటాగా మరో రు. 528 కోట్లను చేర్చి అమలు చేస్తామని పథకాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం పేర్కొంది.

తెలంగాణ పెన్షనర్స్ జె.ఎ.సి. ఛైర్మన్ కే. లక్ష్మయ్య ఫెడరల్ తో మాట్లాడుతూ ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకం అమలుకు జీవో జారీచేయలేదు. “విధివిధానాలు రూపొందించటానికి జరగాల్సిన సమావేశాలు జరగటం లేదు. అందులో ఒక వ్యక్తి అనారోగ్యం తో ఆసుపత్రిలో అడ్మిట్ అయితే టెస్టులు చేస్తే ఆ ఖర్చు ఎవరు భరించాలి. ఓపి పేషెంట్ అయితే టెస్టులకు ఎవరు ఖర్చు చేయాలి లాంటివి నిర్ణయించాల్సి ఉంది. అడిగితే మేము అదే పనిలో ఉన్నాము అంటూ సమాధానం దాట వేస్తున్నారు,” అని ఆయన అన్నారు.

“ఉద్యోగులు ఎన్నో ఆశలతో కొత్త పథకం కోసం ఎదురుచూస్తున్నారు. శివ శంకర్ కమిటీ పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించమని ఆహ్వానం రావడమే ఆలస్యం అని అధికారులు అంటున్నారు. ఐదు డీఎలు పెండింగ్ లో ఉన్నాయి. పాత ఈహెచ్ఎస్ పథకం అమలులో పూర్తి స్థాయి రీయంబర్స్మెంట్ రావటం లేదు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపధ్యంలోనే 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు రావలసిన బకాయీలు అందుకోకుండానే చనిపోయారని రిటైర్డ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ కే. లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. “2024 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇంత వరకు రాలేదు. జబ్బులకు సరయిన ట్రీట్మెంట్ తీసుకోలేక చనిపోయిన వాళ్ళు, అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఇళ్ళు వదిలి వెళ్ళిన వాళ్ళు వీరిలో ఉన్నారు. కనిపించకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు మమ్మల్ని కలిశారు. 2024-25 లో రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ లకు చెల్లించాల్సిన డబ్బు వంటి బకాయిలే రు. 1,500 కోట్ల వరకు ఉంటాయి. పథక ప్రారంభానికి ముందే ప్రతి ఉద్యోగి అంగీకారాన్ని తీసుకోమని ప్రభుత్వానికి చెప్తున్నాము,” అని పథకం అమలు పై అన్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రభుత్వ చిత్తశుద్ధి పైన కూడా సందేహాలు వ్యక్తం అవుతాయని ఆయన చెప్పారు.

మార్చ్ 2024 తర్వాత నుండి రిటైరైన పెన్షనర్లందరికి చెల్లించాల్సిన “పెన్షనరీ బెనిఫిట్స్” ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పి.ఆర్.సి. కమిటీ రిపోర్టును గతంలో చేసిన హామీ మేరకు సరైన ఫిట్మెంట్తో 01-07-2023 నుండి అమలు చేయాలని అడుగుతున్నారు.

ఏ రాష్ట్రంలో లేనివిధంగా 5 ఐదు డి.ఆర్. (కరువు భత్యం) బకాయిలు ఉండటం పై వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెన్షనర్ల చిన్న చిన్న సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఉద్యోగులు, నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు వర్గాలను దూరం చూసుకుంటోందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక ఉద్యోగ సంఘ నాయకుడు తెలిపారు. మే 22 నుండి ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను ఆపలేకపోతే ఉద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి బయట పడుతుందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా చర్చించాలని ఆయన సూచించారు.

ప్రైవేట్ కాలేజీల బకాయీలు పది వేలకోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయీలు చెల్లించకపోవటంతో వారు దూరం అవుతున్నారు. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్న ఉద్యోగులు దూరం కావటం మంచి సంకేతం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read More
Next Story