
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ నుంచి అవార్డు అందుకుంటున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, మోతుకుపల్లి గ్రామ సర్పంచ్ బైండ్ల అమృతమ్మ
జాతీయ అవార్డులతో మెరిసిన తెలంగాణ గ్రామ పంచాయతీలు
దేశానికి ఆదర్శంగా మోత్కుపల్లి, ఫసల్‌వాడీ గ్రామాలకు జాతీయ గుర్తింపు
గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ గ్రామ పంచాయతీలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డుల్లో వికారాబాద్ జిల్లా మోత్కుపల్లి, సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడీ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి తెలంగాణకు మరోసారి గర్వకారణంగా నిలిచాయి.
తెలంగాణ రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డులను అందించింది.మోతుకుపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ పంచాయతీ అవార్డులలో 3వ ర్యాంకు సాధించి జాతీయ గుర్తింపు పొందింది. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం లోని మోత్కుపల్లి గ్రామ పంచాయతీ కి గ్రామ పంచాయతీలో పారదర్శకంగా పరిపాలన నిర్వహించడం, పౌరులకు డిజిటల్ సేవలు అందించడం, గ్రామ సభలో ప్రజల భాగస్వామ్యం తో అభివృధి ప్రణాళిక తయారు చేయడం,గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల సుపరిపాలన విభాగంలో జాతీయ స్థాయి అవార్డు లభించింది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డ్ ని ఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, మోతుకుపల్లి గ్రామ సర్పంచ్ బైండ్ల అమృతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమం లో వికారాబాద్ జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, కోట్ పల్లి మండల ఎంపీడీఓ, ఎంపీవో పాల్గొన్నారు. మహిళలకు అనుకూల విధానాలను అమలు చేయడంలో సంగారెడ్డి జిల్లా ఫసల్ వాడీ గ్రామపంచాయతీ ముందుంది. జాతీయ స్థాయిలో 3వ స్థానం పొందిన ఫసల్ వాడీ గ్రామ పంచాయతీకి కేంద్ర మంత్రి అవార్డుతో పాటు నగదు బహుమతిని అందజేశారు.
పారదర్శక పరిపాలన, డిజిటల్ సేవలు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, మహిళా సాధికారత వంటి అంశాల్లో ఈ రెండు గ్రామ పంచాయతీలు చూపిన పనితీరు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ గ్రామాలు కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయని ఈ జాతీయ అవార్డులు మరోసారి నిరూపించాయి.
Next Story

