
హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయ్
ఇంధన నిల్వలు ఫుల్: నిల్వ చేసుకోవద్దు… సరఫరా సజావుగా ఉందని అధికారుల భరోసా
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అపోహలకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా జరుగుతోందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ , డీజిల్ లను 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్లు డీజిల్ కు డిమాండ్ ఉండేదని ఆయన తెలిపారు. కానీ 27 వ తేదీన 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు.
పెట్రోలు, డీజిల్ సరఫరాను క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ను నిల్వచేసుకోవద్దని వినియోగదారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సూచించారు.
ఇంధన సరఫరా పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. అపోహలకు లోనై అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని వినియోగదారులకు సూచించారు. సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నందున ప్రజలు నిర్భయంగా ఉండాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
పెట్రోల్ బంకుల ముందు వాహనచోదకుల బారులు
ఒక వైపు తెలంగాణలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదని ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ చెబుతున్నా, మరో వైపు పెట్రోల్ బంకుల వద్ద వాహనచోెదకుల బారులు కనిపిస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు కనిపించాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని సోషల్ మీడియాతోపాటు టీవీల్లో చూసిన జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు.
Next Story

