Danam Nagender
x

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. కీలక తీర్పిచ్చిన హైకోర్టు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసి కీలక తీర్పు ఇచ్చింది.


ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును విచారించిన హైకోర్టు దానంపై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ తుది తీర్పును శుక్రవారం మధ్యాహ్నం వెలువరించింది. ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ కేసులో స్పీకర్ ఆదేశాలపై స్టే విధించిన హై కోర్టు.. ఫిరాయింపునకు పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్లు వేశారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ పిటిషన్లను తిరస్కరించారు. దానం నాగేందర్ చట్టబద్ధంగా పార్టీ మారలేదని, అసెంబ్లీ రికార్డుల్లో ఆయన బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నారని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 16న రావాల్సిన తీర్పును సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

దానం నాగేందర్ తరఫున మాత్రం తాను బీఆర్ఎస్ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేయలేదని వాదించారు. కాంగ్రెస్ నేతలను కలవడం లేదా ఆ పార్టీ కండువా కప్పుకోవడం మాత్రమే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్లు కాదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆయన కాంగ్రెస్‌లో చేరడం, ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుకు స్పష్టమైన ఆధారాలని వాదించారు. ఈ వాదనల నేపథ్యంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. తాజా తీర్పుతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడింది.


బీఆర్ఎస్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు కేసులు నమోదు చేసింది. కాగా ఇంతకాలానికి వారిలో ఒకరిపై కోర్టు అనర్హత వేటు వేసింది. అయితే ఇంకా తొమ్మిది మంది కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరి వారి కేసులో ఎలాంటి తీర్పులు వస్తాయో చూడాలి.

Read More
Next Story