Telangana High court
x

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ గ్రూప్ 1 కేసు తీర్పు వాయిదా

ఫిబ్రవరి 5 న 562 మంది అభ్యర్థుల భవిత్యవం తేల్చనున్న హైకోర్టు


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ తీర్పు వాయిదా పడింది. కమిషన్ తో పాటు మరికొందరు విద్యార్థులు వేసిన పిటిషన్లను గురువారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణను పూర్తి చేసింది అయితే, తీర్పు కాపీ సిద్ధం కాలేదని చెబుతూ విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

2024 అక్టోబర్ మూడో వారం లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని, ఇందులో చాలా అవకతవకలు జరిగాయని, దీని మీద న్యాయ విచారణ జరిపించాలని పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీని మీద హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిగింది. 2025 మార్చి 10 వ తేదీన కమిషన్ విడుదలచేసిన తుది మార్కుల జాబితా ను అనుసరించి మార్చి 30న ప్రకటించిన ర్యాంకింగ్ జాబితాను ఏకసభ్యధర్మాసనం కొట్టి వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేసి ఫలితాలు తాజాగా ప్రకటించాలని ఈ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, ఇలా వీలు కాని పక్షంలో మెయిన్స్ తిరిగి నిర్వహించాలని కూడా ధర్మాసనం చెప్పింది.

అయితే, ఏక సభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో మొదటి ర్యాంకింగ్ తో ఎంపికయిన అనేక మంది అభ్యర్థులు కూడా పిటిషన్ వేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున విచారణ హాజరయిన అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి పరీక్షలు మొత్తం చాలా కట్టదిట్టంగా నిర్వహించారని, అవకతవలకు ఆస్కారం లేదని కోర్టుకు నివేదించారు." నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలను నిర్వహించారు. అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత మూల్యాంకనం చేయించాము. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమినరీ, మెయిన్స్ కు హాల్ టికెట్లను వేర్వేరుగా జారీ చేశాము. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందని ఎలాంటి ఆరోపణలకు పిటిషనర్లు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపడం లేదు, " అని సుదర్శన్ రెడ్డి అన్నారు.

పరీక్షల్లో అర్హత సాధించలేనివారు కోర్టును ఆశ్రయించారని , మార్చి ౩౦ న వెలువడిన ఫలితాల అధారంగా నియామక పత్రాలు స్వీకరించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్ రెడ్డి కోర్టులో పేర్కొన్నారు. రెండు హాల్ టికెట్ల విధానాన్ని ప్రశ్నించాడాన్ని పేర్కొంటూ రెండు హాల్ టికెట్ల విధానాన్ని పరీక్షలకు ముందే వెల్లడించిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అప్పుడు అభ్యంతరం చెప్పకుండా, ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయడం చెల్లదని ప్రకాశ్ రెడ్డి అన్నారు.
అనేక మలుపులు తిరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్‌ అధారంగా ఇప్పటికే నియామకాలు పూర్తి అయ్యాయి. 562 మందికి సర్కార్‌ నియామక పత్రాలు కూడా కమిషన్ అందజేసింది. డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 5 న ఇవ్వనున్న తీర్పు మీద నియామక పత్రాలు అందుకున్న 562 మంది భవితవ్యం అధారపడి ఉంది.

Read More
Next Story