తెలంగాణలో బంద్ దిశగా హోటళ్లు
x

తెలంగాణలో బంద్ దిశగా హోటళ్లు

కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్లపై పెట్రోలియం కంపెనీలు నియంత్రణ విధించటంతో బంద్ యోచన


పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ ప్రభావం, హర్మూజ్ సంధిలో రాకపోకలపై ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన కొరత ప్రభావం హైదరాబాద్ హోటల్ పరిశ్రమపై పడింది. గ్యాస్ కొరతతో అవి తమ కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని హోటళ్లు బంద్ దిశగా అగుడులు వేస్తున్నాయి. కొన్నిహోటళ్లు మెన్యూ ను కుదించాయి. పెద్ద హోటళ్లు మెన్యూను కుదిస్తే చిన్న హోటళ్లు వ్యాపారం బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది.

ఇప్పటికే బెంగళూరు, చెన్నై నగరాల్లో హోటళ్లు ఇదే విధంగా బంద్ దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. కేంద్రం కమర్షియల్ గ్యాస్ వినియోగంపై నియంత్రణ పెట్టి గృహ అవసరాలకు ప్రాధాన్యం కల్పించింది. దీనితో గ్యాస్ ఏజెన్సీ లు కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరా నిలిపివేశాయి. ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్‌ సిలిండర్లు సరఫరా చేయాలని పెట్రోలియం కంపెనీలు ఆదేశాలు జారీచేశాయి. అలాగే ఈ-కేవైసీ చేయించని వినియోగదారులకు సరఫరా నిలిపివేయనున్నారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని సివిల్ సప్లయ్ అధికారులు చెప్తున్నా గ్యాస్ సిలిండర్ ల వాడకంపై నియంత్రణ మొదలైంది.

మంగళూరు, వైజాగ్ నుండి పైప్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతుండటంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో గ్యాస్ కొరత కొంత తక్కువగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గ్యాస్ సిలిండర్ తీసుకున్న వినియోగదారులు తిరిగి బుకింగ్ చేసుకోవటానికి 30 రోజుల గడువును కేంద్రం విధించింది. గృహ వినియోగదారులు గ్యాస్ ను జాగ్రత్తగా వాడుకుంటూ ఇండక్షన్ స్టౌ లాంటివి విరివిగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గ్యాస్ సరఫరాపై డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎల్పీజీ కొరత వచ్చే అవకాశం లేదన్నారు. అయితే ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే కేంద్రం ఈ నిబంధనలు పెట్టిందని ఆయన అన్నారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల సరఫరా దాదాపు ఆగిపోయినా అత్యవసర సర్వీసులయిన ఆస్పత్రులు, హాస్టళ్లకు నిలవలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే హోటల్స్ అసోసియేషన్ పరిస్థితుపై సమీక్షించింది. గ్యాస్ సరఫరాపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇది తమ వ్యాపారాలను పూర్తిగా దెబ్బ తీస్తుందని పేర్కొంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లోని సందీప్తి గ్యాస్ ఏజెన్సీ లో పార్టనర్ అయిన పి. సి. నాయుడు కొత్త గ్యాస్ కనెక్షన్ లు ఇప్పటికీ జారీచేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే రెండవ సిలిండర్ ను మాత్రం తదుపరి ఆదేశాల వరకు ఇవ్వడం లేదని చెప్పారు. “పాత కస్టమర్ లకు బుకింగ్ చేసిన 24 గంటల్లో సిలిండర్ ఇస్తున్నాం. అయితే తదుపరి బుకింగ్ మాత్రం 30 రోజుల నియంత్రణ అమలు చేస్తున్నాము. సప్లయ్ మెరుగు పడితే మళ్ళీ రెండవ సిలిండర్ జారీ చేస్తాం,” అని చెప్పారు.

మంత్రికి హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి:

తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర సివిల్ సప్లయిస్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కి గ్యాస్ సిలిండర్ ల సరఫరా పై విధించిన నియంత్రణలను ఎత్తి వేయాలని ఒక ఉత్తరం లో కోరింది. తమ సేవల పై టూరిస్ట్ లే కాక హాస్పిటాలిటీ, సర్విస్ రంగంలో పనిచేసే అనేక మంది ఆధారపడి ఉన్నారని, వేల మంది కార్మికులు, ఉద్యోగస్థులు, విద్యార్థులు, వలస కార్మికులు సరసమైన ధరల్లో దొరికే ఆహారం కోసం తమ సేవలపై ఆధారపడ్డారని గుర్తు చేశారు. వీళ్ళే కాకుండా ఈ సంస్థలలో పనిచేసే వాళ్ళు సైతం ఆహార అవసరాలు తీరక ఇబ్బందుల పాలవుతారని పేర్కొన్నారు. గ్యాస్ కొరత తీర్చక పోతే ఈ సంస్థలు మూతపడి పని చేసే వారు అందరూ నిరుద్యోగులు అయ్యి ఆహార సరఫరా నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రంజాన్ వేడుకల మీద ప్రభావం

ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తూ ఉంది. సాధారణంగా రంజాన్ వేడుకల సమయంలో హోటళ్లలో రద్దీ బాగా పెరుగుతుంది.పాపులర్ రంజాన్ వంటకం అయిన హలీంతో పాటు అనేక రకాల మాంసాహార వంటకాలు రంజాన్ పండుగ సమయంలో సర్వు చేస్తారు. అయితే, ఈ సమయంలో కమర్షియల్ సిలిండర్లను తగ్గింపు రంజాన్ బిజినెస్ మీద ప్రభావం చూపిస్తున్నదని బహార్ హాటల్ యజమాని అలీ అస్గర్ బోలూకి మీడియాకు చెప్పారు. ఆయన పది సిలిండర్లు బుక్ చేస్తే కేదలం అయిదుమాత్రమే పరఫరా చేశారు. ఇవి అయిపోయాక తదుపరి ఎన్ని సిలిండర్లు అందిస్తారో స్పష్టత లేదని ఆయన చెప్పారు. "సిలిండర్ల కొరతతో పాటు ధర కూడా బాగా పెరిగింది. కమర్సియల్ సిలిండర్ ధర మామూలుగా రు. 4300 ఉంటే ఇపుడు ఇది రు. 5500 పెరిగింది. ఆధర ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అయినా సరే, సిలిండర్లు సరఫరా జరిగేలాగా కనిపించడం లేదు," అని బొలూకి చెప్పారు.

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలకు పెద్ద దెబ్బ

మహేందర్ కొలనిపాక దిల్ షుక్ నగర్ లో స్ట్రీట్ ఫుడ్ బండి నడుపుతాడు. ఉదయం దోసెలు, ఇడ్లీలతో బ్రేక్ ఫాస్టు అందిస్తాడు. సాయంకాలం బజ్జీల వ్యాపారం చేస్తాడు. ఇపుడు ఆయన సిలిండర్ దొరకడం కష్టం అయింది. సాధారణంగా మార్కెట్ ధర కంటే ఆయన ఎక్కువ డబ్బు ఇచ్చి సిలిండర్ తీసుకుంటాడు. ఇపుడు గ్యాస్ లీడర్ ఒక సిలిండర్ మాత్రం ఇచ్చి జాగ్రత్తగా వాడుకో , మళ్తీ వస్తుందో రాదో అని చెప్పాడు. " ఫలితంగా నేను కొన్ని ఐటెమ్స్ తగ్గించాను. దమ్ చాయ్ తీసేసి ఒకేసారి ఫ్లాస్క్ లో టీ ివేసి ఇస్తున్నాను. సాయంకాలం బజ్జీలను తగ్గించేశాను,"అని మహేందర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు. మహేందర్ రోజుకు రెండు వేల రుపాయల దాకా సంపాదిస్తాడు. ఇపుడు ఆయన వ్యాపారం తగ్గడం మొదయయింది. యుద్ధం కొనసాగి గ్యాస్ కొరత ఏర్పడితే, డబ్బు, ప్రాబలయ్యం లేని తమ లాంటి వ్యాపారాలన్నీ మూతపడతాయని ఆయన ఆందోళన చెందుతున్నాడు. హైదరాబాదులో గ్యాస్ కష్టాల వల్ల స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం బంద్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్ అయి పోయిన బండ్లు వ్యాపారం ఆపేశాయి. టిఫిన్ ధరలు చూడా పెంచుతున్నారు. ఒక్కొక్క టిఫిన్ కు ఐదురుపాయల దాకా పెంచేశారు.



Read More
Next Story