
108కు స్మార్ట్ ట్రాకింగ్! రోగి రాకముందే డాక్టర్ రెడీ!
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట... అంటే 'గోల్డెన్ అవర్'. ఈ సమయంలో సరైన చికిత్స అందితే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. ఈ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. 108 అంబులెన్సులకు అత్యాధునిక రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీటీవీ ఆధారిత పర్యవేక్షణను తీసుకురానుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 755 అంబులెన్సులు, 6,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి ఏడాది సగటున 7,000 నుంచి 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. గోల్డెన్ అవర్‌లో చికిత్స ఆలస్యం కావడం కూడా ఒక ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. అందుకే అంబులెన్స్ నుంచి ఆసుపత్రి వరకు మొత్తం వ్యవస్థను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న GPS ట్రాకింగ్ వ్యవస్థను మరింత ఆధునికంగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రియల్‌టైమ్ డాష్‌బోర్డ్, ఆసుపత్రులతో ప్రత్యక్ష అనుసంధానం, ETA (Estimated Time of Arrival) ఆధారిత అలర్ట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
దీంతో అంబులెన్స్ ఎక్కడ ఉంది, ఏ మార్గంలో వస్తోంది, ఆసుపత్రికి ఇంకా ఎంత సమయంలో చేరుకుంటుంది అనే వివరాలు కంట్రోల్ రూమ్‌తో పాటు సంబంధిత ఆసుపత్రికి కూడా ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఆర్టీసీ బస్సులను ట్రాక్ చేసే విధంగానే 108 అంబులెన్సుల ప్రయాణాన్ని కూడా రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకునేలోపే రోగి పరిస్థితిపై వైద్యులకు సమాచారం అందుతుంది. దీంతో అవసరమైన వైద్య బృందం, ఐసీయూ, అత్యవసర చికిత్సకు కావాల్సిన పరికరాలు ముందుగానే సిద్ధం చేయవచ్చు.ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూల వరకు సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వైద్య సిబ్బంది స్పందన, రోగులకు అందుతున్న సేవలపై నిరంతర నిఘా ఉండటంతో సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కొత్త వ్యవస్థతో గోల్డెన్ అవర్‌లోనే చికిత్స ప్రారంభించే అవకాశాలు పెరుగుతాయి. అంబులెన్స్-ఆసుపత్రి మధ్య సమన్వయం వేగవంతం అవుతుంది. అత్యవసర చికిత్సలో ఆలస్యం తగ్గుతుంది. వైద్య సేవల్లో పారదర్శకత, బాధ్యత పెరుగుతుంది. మొత్తంగా 108 అంబులెన్స్ సేవలను కేవలం రవాణా సేవగా కాకుండా, రియల్‌టైమ్ స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌గా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

