భారీగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్ర ఉపాధి కూలీలు
x

భారీగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్ర ఉపాధి కూలీలు

జాతీయ స్థాయిలో కార్మికుల నమోదు 3.6 శాతం పెరగ్గా రాష్ట్రంలో ఆ సంఖ్య 1.6 శాతం తగ్గింది


తెలంగాణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం క్రింద ఉపాధి కల్పనలో క్రితం ఏడుతో పోలిస్తే 40.6 శాతం తగ్గుదల నమోదయ్యింది. దీనితో ఉపాధి హామీ కూలీలకు అందే ఆదాయం తగ్గుముఖం పట్టింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ) కు పరిణామం చెందుతున్న తరుణంలో వెలువడిన నివేదిక ఈ పథకం అమలుపై సందేహాలను మరింత పెంచుతోంది. కేంద్రం పనిదినాలను 100 నుంచి 125 కు పెంచామని చెబుతున్నా రాష్ట్రాలకు రావలసిన బకాయీలు, ఉపాధి కల్పన కేంద్ర విచక్షణపై ఆధారపడటం వలన ఉపాధి మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి ప్రధాన కారణం నరేగా చట్టం క్రింద ఉపాధి కూలీలు పని కోరితే కల్పించటం ప్రభుత్వ భాద్యత అలా కోరటం వారి హక్కుగా అది గుర్తించింది. వీబీజీ రామ్‌ జీ ఇంకా పూర్తిగా అమలులోకి రాకపోవడంతో ప్రస్తుతం ఉపాధి హామీ చట్టమే అమలులో కొనసాగుతోంది.

క్షీణించిన ఉపాధి:

తెలంగాణకు సంబంధించిన ఉపాధి పనుల గణాంకాలను లిబెక్ ఇండియా విడుదల చేసింది. ఈ నివేదిక 2024-25 తో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కల్పన 1222.11 లక్షల నుండి 726.08 లక్షలకు తగ్గాయి. ఇది జాతీయ స్థాయిలో తగ్గుదల (20.6 శాతం) కంటే దాదాపు రెట్టింపు కావటం గమనించాల్సిన విషయం.

దీనికి పని ప్రదేశంలో హాజరు కోసం యాప్ వినియోగం (NMMS), ఈ-కెవైసీ (eKYC) తప్పని సరి చేయటం లాంటి కారణాలు కావచ్చని లిబెక్ ఇండియా పరిశోధకులు రాహుల్ స్వేరో తెలిపారు. ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి కొత్త చట్టం అమలులోకి వచ్చింది అయితే యిప్పటికి అది అమలు అయ్యే ప్రాంతాలు ఏవి అనే స్పష్టత లేదు. ఇది ఆందోళనకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి కల్పనలో రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యంత కనిష్టం. ఈ విషయం పనిచేసిన కుటుంబాలు, పని దినాలు మరియు 100 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు వంటి కీలక సూచికల గమనిస్తే స్పష్టంగా వెల్లడవుతోంది. ఉపాధి పొందిన కుటుంబాలు మరియు కార్మికుల సంఖ్య లో పోయిన ఏడు 17.4 శాతం తగ్గగా ఈ ఏడు 20.3 శాతం తగ్గుదల నమోదయ్యింది. మొత్తం కుటుంబాల సంఖ్యలోనూ 1.6 శాతం తగ్గుదల కనిపించింది. ఇక సగటు పనిదినాలలో 28.1 శాతం తగ్గుదల కనిపించగా సగటు పనిదినాలు 45.80 శాతం నుండి 32.93 శాతం కి గణనీయంగా తగ్గాయి. రాష్ట్ర సగటు పనిదినాలు 32.93 శాతం కాగా, జాతీయ సగటు 43.18 శాతం గా ఉంది.

ఇక వంద పని రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాల్లోనూ 75.3 శాతం భారీ తగ్గుదల నమోదయ్యింది. మొత్తం కోటా ను పూర్తి చేసిన కుటుంబాలు 0.93 లక్షల నుండి 0.23 లక్షలకు పడిపోయింది. దీని ఫలితంగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతం కుటుంబాలు 100 రోజులు పూర్తి చేసుకోగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 1 శాతానికి పడిపోయింది.

ఈ పనుల కల్పన ఏడాది మొత్తం ఒకే రీతిన జరగకపోవటం గమనార్హం. సంవత్సరం ప్రారంభంలో పనిదినాలలో తీవ్రమైన తగ్గుదల తో మొదలై నిష్పత్తి పరంగాను మరియు సంఖ్యాపరంగా కూడా క్షీణత కొనసాగి, ఆపై చివరి మూడు నెలల్లో స్వల్ప మెరుగుదల నమోదైంది. మొదటి త్రైమాసికంలో 48.8 శాతం భారీ తగ్గుదల కనిపించగా, రెండో త్రైమాసికంలో 27.9 శాతం మరియు మూడవ త్రైమాసికంలో 20.4 శాతం తగ్గుదలతో కొనసాగింది. నాలుగో త్రైమాసికంలో 2.1 శాతం స్వల్ప వృద్ధి నమోదైనప్పటికీ, గత త్రైమాసికాల్లో జరిగిన నష్టాన్ని ఇది పూడ్చలేకపోయింది.

ఈ మొత్తం కాలంలో కూలీలు 496.03 లక్షల పనిదినాలు నష్టపోయారు. నరేగా పనులకు కీలకమైన మొదటి త్రైమాసికంలోనే 477.26 లక్షల పనిదినాల నష్టం నమోదు కాగా, రెండవ మరియు మూడవ త్రైమాసికాలలో వరుసగా 16.61 మరియు 5.45 లక్షల పనిదినాల నష్టం నమోదైంది. నాల్గవ త్రైమాసికంలో మాత్రం 3.29 లక్షల పనిదినాలతో స్వల్ప వృద్ధి కనిపించింది.

జిల్లాల వారీ విశ్లేషణ:

పని దినాల తగ్గుదల అన్ని జిల్లాల్లో సమానంగా కనిపించింది. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాలలో 28 జిల్లాలలో 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 శాతం నుండి 57 శాతం మధ్య తగ్గుదల నమోదైంది.

తగ్గుతున్న కార్మికుల నమోదు; ఆదాయం:

జాతీయ స్థాయిలో కార్మికుల నమోదు పెరగ్గా రాష్ట్రంలో ఆ సంఖ్య తగ్గింది. పని కోసం కొత్తగా నమోదు చేసుకునే కుటుంబాల చేరికలోనూ తగ్గుదల కనిపించింది. తెలంగాణ లో 0.83 లక్షల మందికి జాబ్ కార్డులు రాగా 4.02 లక్షల మంది కార్మికులు తొలగించబడ్డారు. సగటు వేతనం పెరిగినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి రోజులు తగ్గడం వల్ల కుటుంబాల ఆదాయాలు, వేతనాలు గణనీయంగా తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రు. 9,770 గా ఉన్న సగటు గృహ ఆదాయం, 2025-26 లో రు. 8,766 కు పడిపోయింది. ఇది ఒక కుటుంబానికి సగటున రు. 1,004 నష్టాన్ని సూచిస్తుంది. అదే సమయంలో, రోజుకు సంపాదించే సగటు వేతనం రు. 213.32 నుండి రు. 266.19 పెరిగింది.

తగ్గిన ఉపాధి వలన కార్మికులు రు. 674.26 కోట్లు నష్టపోయారు. కార్మికులు సంపాదించిన మొత్తం వేతనాలు 2024-25లో రు. 2,607.01 కోట్ల నుండి 2025-26 లో రు. 1,932.75 కోట్లకు పడిపోయాయి.

ఈ తగ్గుదల ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఆదాయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఎస్సీ, ఎస్టీ కార్మికుల వేతనాల్లో 38 శాతం నష్టం: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కార్మికులు 2024-25 లో రు. 1,102.14 కోట్లు సంపాదించగా, 2025-26 లో కేవలం రు. 846.21 కోట్లు మాత్రమే సంపాదించగలిగారు. రాష్ట్రం ఎదుర్కొన్న మొత్తం రు. 674.26 కోట్ల ఆదాయ నష్టంలో, ఎస్సీ/ ఎస్టీల వాటానే రు. 255.93 కోట్లు (38 శాతం) ఉండటం ఆందోళనకరం.

తగ్గింపుకు కారణాలు:

ఉపాధి తగ్గుదల రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతోంది దీనికి ప్రధాన కారణాలు పని లభ్యత తగ్గడం, కార్మికుల తొలగింపు. వేతనాలు పెరిగినా పని దొరక్కపోవడం వల్ల కార్మికులు నికరంగా ఆదాయాన్ని నష్టపోయారు. ఈ భారాన్ని బలహీన వర్గాలు అసమానంగా మోస్తున్నాయి అని లిబెక్ ఇండియా తెలిపింది.

ఈ విషయం పై విశ్రాంత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డి. నరసింహ రెడ్డి స్పందిస్తూ, “తెలంగాణాలో నమోదైన ఇళ్ళు కేవలం 1.6 శాతమే తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు క్వార్టర్లలో పని దినాలు తగ్గి చివరి క్వార్టర్ లో పెరిగాయి. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది. దీనికి కేంద్రం నుండి రావాల్సిన వాటా రాకపోవటమా అనేది స్పష్టం కావాలి. తెలుగు రాష్ట్రాలు ఈ ప్రోగ్రామ్ అమలులో మొదటి నుండి ముందు ఉన్నాయి. హర్టీకల్చర్ కు దీనిని అనుసంధానం చేశారు. ఇప్పుడు తగ్గటానికి కారణాలు తెలియాల్సి ఉంది,” అని అన్నారు.

ఈ విషయంపై స్పందించటానికి అధికార వర్గాలు నిరాకరించాయి.

Read More
Next Story