పట్టాలెక్కుతున్న తెలంగాణ: పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఊతం
x
తెలంగాణలో రైల్వే రవాణ పురోగతి (ఫొటో : ఎక్స్ పోస్టు /ఎస్ సీ ఆర్)

పట్టాలెక్కుతున్న తెలంగాణ: పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఊతం

రైల్వే మౌలిక సదుపాయాల్లో దూకుడు


తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ పలు కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. కొత్త రైల్వే లైన్లు, ఎంఎంటీఎస్ విస్తరణ, హైస్పీడ్ కారిడార్లు, స్టేషన్ ఆధునీకరణ పనులతో రాష్ట్ర రైల్వే రంగంలో కొత్త దశ ప్రారంభమవుతోంది.

తెలంగాణలో రైల్వే వ్యవస్థను ఆధునీకరించేందుకు, కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు మంజూరు చేస్తూ కొత్త ప్రాజెక్టులను చేపడుతోంది. ముఖ్యంగా 2026 వ సంవత్సరం మే నాటికి తెలంగాణలో రైల్వే రంగానికి సంబంధించి కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2026-27 బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5,454 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు 2014వ సంవత్సరం కంటే ముందున్న కేటాయింపులతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. తెలంగాణలో మొత్తం ప్రాజెక్టుల విలువ రూ. 47,984 కోట్ల విలువైన రైల్వే పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

తెలంగాణపై కేంద్రం దృష్టి

ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత కేంద్రప్రభుత్వం తెలంగాణపై దృష్టి సారించింది.2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రధాని మోదీ మే 10న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో పలు రైల్వే ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పట్టాలెక్కిన రైల్వే ప్రాజెక్టులు

రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు రూ.48,984 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. గుంతకల్ - వాడి 3వ, 4వ రైల్వే లైన్ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వశాఖ నిధులిచ్చింది.యాదగిరిగుట్ట ఆలయ నగరానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నఎంఎంటీఎస్ రైలు అనుసంధాన ప్రాజెక్టు త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. 122 కిలోమీటర్ల వికారాబాద్ - కృష్ణా కొత్త లైన్ నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్‌కు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైంది. దీని అంచనా వ్యయం రూ.2,844 కోట్లు. ఈ లైన్ పూర్తయితే తెలంగాణ నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ దూరం, సమయం తగ్గుతుంది.కాజీపేట - విజయవాడ మార్గంలో రద్దీని తగ్గించేందుకు చేపట్టిన మూడో రైల్వే లైన్‌ను ఇటీవలే ప్రధాని మోదీ ప్రారంభించారు.

హై-స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణం

2026-27 కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన నగరాలకు హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించారు.హైదరాబాద్ - బెంగళూరు,హైదరాబాద్ - ముంబై (పూణే మీదుగా),హైదరాబాద్ - చెన్నై హై స్పీడ్ కారిడార్లను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ నిర్మించనున్నారు.రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు రూ.2,015 కోట్లు కేటాయించారు.ఇప్పటికే బేగంపేట, కరీంనగర్, వరంగల్, జోగులాంబ గద్వాల స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.సికింద్రాబాద్ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎయిర్‌పోర్టు తరహాలో నిర్మిస్తున్నారు.హైదరాబాద్ నగరంలో రద్దీని తగ్గించేందుకు రూ.413 కోట్లతో నిర్మించిన చర్లపల్లి కొత్త టర్మినల్ అందుబాటులోకి వచ్చింది.

విద్యుదీకరణ పూర్తి

తెలంగాణలో రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రక్రియ వంద శాతం పూర్తయింది.తెలంగాణలో ఐదు జతల వందే భారత్ రైళ్లు, మూడు జతల అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి.రైళ్ల ప్రమాదాలను నివారించే 'కవచ్' వ్యవస్థను రాష్ట్రంలో 1,242 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్నారు.ఈ రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణలో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, పారిశ్రామికంగా కూడా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందనుంది.

రైల్వే ప్రాజెక్టులెన్నో...

కేంద్ర మంత్రివర్గం మే నెలలో ఆమోదించిన ప్రాజెక్టులలో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన లైన్లు ఉన్నాయి.గుంతకల్ - వాడి (3వ, 4వ లైన్లు)ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. దీనివల్ల వస్తు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత వేగవంతం అవుతాయి.సికింద్రాబాద్ (సనత్‌నగర్) - వాడి (3వ, 4వ లైన్లు) 173 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టుకు రూ.5,012 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది.మంగళూరు (కర్ణాటక) - రామగుండం (తెలంగాణ) మధ్య 207.8కిలోమీటర్ల పొడవు గల ఈ కొత్త బ్రాడ్ గేజ్ లైన్‌కు ఇటీవల ఆమోదం లభించింది. దీని అంచనా వ్యయం రూ.5,818 కోట్లు.మనోహరాబాద్ - కొత్తపల్లి 151 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటికే సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన సిద్దిపేట - సిరిసిల్ల (31 కి.మీ) పనులను 2026 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మల్కాన్‌గిరి - పాండురంగాపురం: 174 కి.మీ పొడవు గల ఈ కొత్త లైన్‌కు రూ.3,592 కోట్లు వెచ్చించనున్నారు.యాదాద్రి వరకు ఎంఎంటీఎస్: ఘటకేసర్ నుండి రాయగిరి (యాదాద్రి) వరకు 33 కిలోమీటర్ల విస్తరణ పనులకు రూ. 430 కోట్లతో పచ్చజెండా ఊపారు. ఈ పనులను 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆల్వాల్ (లయోలా కాలేజీ), ఆనంద్‌బాగ్, మౌలాలి వద్ద మూడు కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.కాజీపేట - విజయవాడ (3వ లైన్) కోసం రూ. 3,315 కోట్లు,కాజీపేట - బల్లార్షా (3వ లైన్) నిర్మాణానికి రూ.3,183 కోట్లు,గుంటూరు - బీబీనగర్ డబ్లింగ్ కోసం రూ.2,853 కోట్లను రైల్వే మంత్రిత్వశాఖ కేటాయించింది.

పారిశ్రామికాభివృద్ధికి ఊతం

ఈ రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా పారిశ్రామికాభివృద్ధికి కూడా భారీ ఊతం లభించనుంది. వస్తు రవాణా వేగవంతం కావడంతో పరిశ్రమలకు లాజిస్టిక్స్ వ్యయం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్, వాడి మార్గాలు దేశవ్యాప్తంగా కీలక రైల్వే కారిడార్లుగా మారనున్నాయి.

కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్

వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణలో రైలు మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ నుంచి కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.తెలంగాణలో అతిపెద్ద రైల్వే హబ్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ పునర్నిర్మాణ పనులు ఇప్పటికే 70శాతం పైగా పూర్తియ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ భారీ ఊతం ఇస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ లో పేర్కొన్నారు. గుంతకల్ - వాడి 3వ, 4వ రైల్వే లైన్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ లబ్ధి పొందుతోందని ఆయన పేర్కొన్నారు.
రూ. 292 కోట్లతో నిర్మించిన 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ సికింద్రాబాద్, బలార్షా, విజయవాడ మూడు ప్రధాన దిశల గుండా రైళ్ల రాకపోకలను సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
తెలంగాణలో రైల్వే రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త దిశను చూపుతోంది. పెండింగ్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి అయితే తెలంగాణ రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో మరింత ముందంజ వేయనుంది. రైల్వే విస్తరణ కేవలం ప్రయాణ సౌకర్యాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక శక్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read More
Next Story