తెలంగాణలో బడి నుంచి కాలేజీ దాకా.... అంతటా ఎఐ
x

తెలంగాణలో బడి నుంచి కాలేజీ దాకా.... అంతటా ఎఐ

తెలంగాణలో విద్యా సిలబస్‌లో ఏఐ వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. రఘురామ్ రాజన్‌తో సీఎం చర్చలు.


తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో కీలక మార్పు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక విద్య నుంచి నుంచి వైద్య విద్య వరకు సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తాజా సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో భాగమయ్యారు.

ఉద్యోగ అవకాశాలపై దృష్టి

ఏఐ వినియోగంతో పాటు మధ్యస్థాయి ఉద్యోగాల కోసం స్కిల్స్ యూనివర్సిటీలు, శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఏఐను సరైన విధంగా ఉపయోగిస్తే అందరికీ ప్రయోజనం ఉంటుందని రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమిళనాడు తరహా పారిశ్రామిక విధానం ఉంటే పెట్టుబడులు మరింతగా వస్తాయని ఆయన సూచించారు. డేటా సెంటర్ల కోసం ఎక్కువ విద్యుత్, నీటి అవసరం ఉంటుందని కూడా పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్‌ను సందర్శించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

స్కిల్స్ పెంపు

వివిధ రంగాల్లో ఉద్యోగాలు పెరగాలంటే నైపుణ్యాలు కీలకమని రాజన్ సూచించారు. మానవ వనరుల అభివృద్ధికి పోషకాహార లోపాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్ అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్ వంటి సదుపాయాలు రాష్ట్రానికి బలం అని వివరించారు.

మూడు భాగాలుగా రాష్ట్ర అభివృద్ధి

రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. CURE, PURE, RARE విధానాలతో ముందుకు సాగుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో సులభతర వ్యాపారానికి అనుకూల వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ల కోసం అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

Read More
Next Story