
రాజ్‌కుమార్‌ను వేటాడుతున్న పోలీసులు(వీడియో)
నందిగామలో విచారించగా తనకారును పట్టణంలోనే వదిలేసి రైల్వేస్టేషన్లోకి వెళ్ళినట్లు గుర్తించారు
నిందితుడు రాజకుమార్‌ను పోలీసులు వెంటాడి వేటాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఆరుహత్యలు తెలంగాణలో సంచలనంగా మారాయి. నిందితుడి కోసం పోలీసులు పెద్దఎత్తున వేట మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిందితుడు కారులో కృష్ణాజిల్లాలోని నందిగామ వైపు వెళ్ళాడని గ్రహించారు. వెంటనే నందిగామలో విచారించగా తనకారును పట్టణంలోనే వదిలేసి రైల్వేస్టేషన్లోకి వెళ్ళినట్లు గుర్తించారు. అక్కడనుండి ఎటువెళ్ళాడు అన్నదే అంతుపట్టడంలేదు.
ఇంతకీ అసలు ఏమి జరిగింది అంటే గ్రామంలోని రాజకుమార్ అనే నిందితుడు తన ఇంటికి సమీపంలోనే ఉంటున్న ఒక మైనర్ బాలికను వేధించటం మొదలుపెట్టాడు. కొంతకాలం అతను పెట్టే బాధలను భరించిన బాలిక కుటుంబం తర్వాత పోలీసులకు ఫిర్యాదుచేసింది. దాంతో పోలీసులు రాజకుమార్‌పై పోక్సోకేసు నమోదుచేశారు. స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు అరెస్టుచేయకుండా కేవలం కౌన్సిలింగ్ చేసి పంపేశారు.
మామూలుగా అయితే పోక్సో కేసు నమోదవ్వగానే నిందితుడిని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్టుచేస్తారు. అయితే ఇక్కడ పోలీసులు ఏమిచేశారంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాకుండా బెయిల్ వచ్చే సెక్షన్లు మాత్రమే పెట్టారు. దాంతో నిందితుడు ముందుజాగ్రత్తగా తనను పోలీసులు అరెస్టుచేయకుండా ఉండేట్లు కోర్టునుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ తతంగం అంతా అయిన తర్వాత నిందితుడు మళ్ళీ మైనర్ బాలికమీద దృష్టిపెట్టాడు. తనపైన పోక్సోకేసు పెట్టి పరువు తీశారన్న ఆగ్రహంతో రగిలిపోయాడు.
శుక్రవారం రాత్రి బాలిక ఇంట్లోకి వెళ్ళాడు. బాలికను తీవ్రంగా గాయపరిచి అడ్డువచ్చిన అమ్మాయి తల్లి, నానమ్మను కత్తితో పొడిచేశాడు. అమ్మాయిని గ్రామానికి దూరంగా ఉండే నిర్జన ప్రదేశంలోకి తన కారులో తీసుకెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత తనింటికి చేరుకున్నాడు. నిద్రిస్తున్న తన భార్యను లేపి కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత నిద్రపోతున్న ఇద్దరు చిన్నపిల్లలను కత్తితో పొడిచి చంపేశాడు. ఆరుగురిని గంట వ్యవధిలోనే చంపిన నిందితుడు తర్వాత తన తల్లి, దండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పి తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పి ఫోన్ ను స్విచ్చాఫ్ చేశాడు. నిందితుడి తండ్రి ద్వారా విషయం పోలీసులకు చేరి తర్వాత వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి పోలీసులు నిందితుడి కోసం 9 బృందాలతో పెద్దఎత్తున వేటాడుతున్నారు.

