
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలకు రేవంత్ సిద్ధం!
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని నిశ్చయించుకుంది. ఈ చర్చలు ఎప్పుడయినా ప్రారంభం కావొచ్చని, కాబట్టి అవసరమైన వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సూచించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగానే 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేలా సాంకేతిక నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వంశీచంద్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఏ ఎత్తులో నిర్మిస్తే ఎక్కువ నీటిని తీసుకురావచ్చనే అంశంపై ప్రధానంగా చర్చించారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకోవచ్చు? 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఎంత నీటిని తరలించవచ్చు? అనే వివరాలను ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు.
152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే దాదాపు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ముంపు విస్తీర్ణం వెయ్యి ఎకరాల్లోపే ఉంటుందని వివరించారు. అయితే, మహారాష్ట్ర పరిధిలోని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ముంపు ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయాలని, సాధ్యమైనంత ఎక్కువ నీటిని తెలంగాణకు తీసుకొచ్చేలా నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం వెనుక ప్రధాన లక్ష్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాలకు సాగునీరు అందించడమేనని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో ఏళ్ల తరబడి పోరాడిన అటవీ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాలని సీఎం ఆకాంక్షించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే దిశగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గతంలో 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అయితే, ఆ ఎత్తులో నిర్మిస్తే ఆశించిన స్థాయిలో నీటిని తీసుకురావడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అందుకే 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేలా నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, సాంకేతిక అంశాలతో కూడిన పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో చర్చించిన అంశాలు, అధికారులు కోరిన నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. మహారాష్ట్రతో చర్చల సందర్భంగా తెలంగాణ నీటి అవసరాలను స్పష్టంగా వివరించి, రాష్ట్ర వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సూచించారు. బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే మార్గ రూపకల్పన, భూసేకరణపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు సీఎం సూచించారు.
మరోవైపు, డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించే అంశంపైనా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని డీఎల్ఐఎస్కు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన మొత్తం 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే మార్గాలను పరిశీలించాలని సీఎం సూచించారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు నీటిని తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఎక్కడ పంపులు, పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయాలి? ప్రస్తుతం ఉన్న కాల్వలు, సొరంగాల సామర్థ్యం సరిపోతుందా? అవసరమైతే వాటి సామర్థ్యాన్ని ఎక్కడ పెంచాలి? అనే అంశాలపై వెంటనే అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఏర్పాట్ల వల్ల పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాలమూరు నీటి అవసరాలకు కోత పడకుండా డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు అదనపు నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
డిండి ప్రాజెక్టుకు నార్లాపూర్ నుంచి నీటిని తరలించాలా? లేక ఏదుల రిజర్వాయర్ నుంచి తీసుకురావాలా? అనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ విషయంలో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, విజ్ఞప్తులను సమావేశంలో పరిశీలించారు. నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుంది? ఏదుల నుంచి తీసుకొస్తే ఎంత వ్యయం అవుతుంది? అనే వివరాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రెండు మార్గాల్లోని అనుకూలతలు, ప్రతికూలతలను వెల్లడించారు.

