
వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతుతో హైదరాబాద్‌కు అవకాశం
దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫోరం ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఫాలోఅప్ సదస్సు నిర్వహణపై సానుకూల స్పందన లభించింది.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు మరో కీలక గుర్తింపు లభించింది. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలు, భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.
ప్రతి ఏడాది జులై నెలలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని సీఎం ప్రతిపాదించారు. దావోస్ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని సమీక్షించుకునేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని వివరించారు. ఫోరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సిద్ధతతో ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ వేదికగా ఈ సదస్సు జరగడం ద్వారా రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అనుకూలతలు, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ఇలాంటి సూచనలు వచ్చినప్పటికీ తుది నిర్ణయం సమీప భవిష్యత్తులో తీసుకుంటామని జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది సమ్మర్ దావోస్ జరుగుతుండగా సౌదీ అరేబియా కూడా ఆసక్తి చూపుతోందని చెప్పారు.
సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను సీఎం వివరించారు. ఈ విజన్ పరస్పర సహకారానికి అనుకూలంగా ఉందని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ ఆర్థిక వృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా ముందుకు సాగుతామని ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో లభ్యమవుతున్న ప్రతిభావంతమైన మానవ వనరులపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. నైపుణ్యాభివృద్ధి, క్రీడారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రారంభమైన C4IR తెలంగాణ పురోగతిపై కూడా చర్చ జరిగింది. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి భారత్‌లో ప్రారంభమైన తొలి థీమాటిక్ సెంటర్ ఇదేనని గుర్తు చేశారు. ఇది ఆదర్శ మోడల్‌గా గుర్తింపు సాధించిందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన ఉత్తమ పద్ధతులపై చేసిన పరిశోధనలను తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు మూడు జోన్ల అభివృద్ధి నమూనా, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏరోస్పేస్, డిఫెన్స్, బయో, ఫార్మా, సాఫ్ట్‌వేర్ రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న బలాలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాలపై ప్రభుత్వ దృష్టిని స్పష్టంగా వెల్లడించారు.


