మండే ఎండలు, తీవ్ర వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం నుంచి మే 30వతేదీ వరకు రాబోయే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అయితే మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాలులు కొనసాగనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో ఏడు రోజుల పాటు వర్షాలు
రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, కొమరిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ఆదివారం సాయంత్రం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం నుంచి మే 30వతేదీ వరకు ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
రేపు తీవ్ర వడగాలులు
మే 25వతేదీ సోమవారం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సోమవారం ఐఎండీ ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాత్రివేళ కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో రోహిణి కార్తె ప్రభావంతో నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నడర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఉరుములతో కూడిన వర్షాలు
ఆదివారం రాత్రి సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి (షాద్‌నగర్) జిల్లాల్లో చెదురుమదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ వర్షాలు నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు కూడా విస్తరించనున్నాయని వెల్లడించారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ వర్షాలు తేమను పెంచుతాయని, వేడి నుంచి ఉపశమనం కలిగించవని తెలిపారు. ఉత్తర హైదరాబాద్‌లో అక్కడక్కడా జల్లులు మినహా, మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వెదర్ మ్యాన్ వివరించారు.
అయిదు జిల్లాల్లో ఆరంజ్ అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో ఆదివారం ఉరుములు,మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ఆదివారం సాయంత్రం విడుదల చేసిన వెదర్ రిపోర్టులో తెలిపారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆమె పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలోని అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడతాయని ఆమె వివరించారు.
ఎల్లో వార్నింగ్
తెలంగాణలోని మరో అయిదు జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. జోగులాంబ గద్వాల్, ఖమ్మం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని ఆమె తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆమె వివరించారు.
కుంచవెల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రంలోని కుంచవెల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ రెయిన్స్ తెలిపింది. ఆదివారం హైదరాబాద్ నగర పరిధిలో కూడా వడగాలుల తీవ్రత స్వల్పంగా పెరిగింది. గోల్కొండలో 42.7డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ రెయిన్స్ ఎక్స్ పోస్టులో తెలిపింది. పశ్చిమ,దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిశాయి.
రాబోయే రోజుల్లో తెలంగాణలో వర్షాలు, వడగాలులు ఒకేసారి ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించడం అవసరం. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవడంతో పాటు, ఉరుములు-మెరుపులు సంభవించే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురిసినా వేడి పూర్తిగా తగ్గే అవకాశం లేకపోవడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచిస్తుంది.