
తెలంగాణలో 121 కొత్త లిక్కర్ బ్రాండ్లు.. లగ్జరీ పేర్లు
తెలంగాణలో 121 కొత్త లిక్కర్ బ్రాండ్లకు ప్రతిపాదనలు వచ్చాయి. విదేశీ బీర్లు, సింగిల్ మాల్ట్స్, కాగ్నాక్, వైన్స్‌తో పాటు ప్రీమియం భారతీయ బ్రాండ్లు ఉన్నాయి.
తెలంగాణలో లిక్కర్ మార్కెట్‌లో కొత్త బ్రాండ్లు అడుగుపెట్టనున్నాయి. విదేశీ బీర్లు, లగ్జరీ విస్కీలు, కాగ్నాక్, వైన్స్‌తో పాటు ప్రీమియం భారతీయ మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోకి రానున్నాయి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) 18 సరఫరాదారుల నుంచి 121 కొత్త బ్రాండ్ల ప్రతిపాదనలు స్వీకరించింది. ఈ బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను TGBCL ప్రారంభించింది. కొత్తగా వచ్చిన సరఫరాదారులు ప్రస్తుతం కార్పొరేషన్‌లో నమోదు కాలేదు. వారి దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. పారదర్శకత కోసం ప్రతిపాదిత బ్రాండ్ల వివరాలు, కంపెనీలు సమర్పించిన పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా కోరారు. బ్రాండ్ పేర్ల విషయంలో న్యాయపరమైన సమస్యలు, ట్రేడ్‌మార్క్ వివాదాలు రాకుండా ఈ ప్రక్రియ చేపట్టినట్లు TGBCL మేనేజింగ్ డైరెక్టర్ సీ హరి కిరణ్ తెలిపారు. నోటిఫికేషన్ తేదీ నుంచి 10 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 1 సాయంత్రం 5 గంటలలోపు నాంపల్లి అయ్యర్ భవన్‌కు చేరే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారు. వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ నిబంధనలు, అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన బ్రాండ్లకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత వాటిని దశలవారీగా డిపోలకు, అక్కడి నుంచి రిటైల్ మద్యం దుకాణాలకు సరఫరా చేయనున్నారు.
ప్రతిపాదిత జాబితాలో లగ్జరీ బ్రాండ్లు
కొత్త జాబితాలో సింగిల్ మాల్ట్ విస్కీలు, కాగ్నాక్, విదేశీ బీర్లు, వైన్స్, వోడ్కా, టెకిలా వంటి పలు రకాల మద్యం ఉన్నాయి. విలియం గ్రాంట్ అండ్ సన్స్ ఇండియా గ్లెన్‌ఫిడిచ్, మంకీ షోల్డర్ వంటి బ్రాండ్లను నమోదు చేయడానికి దరఖాస్తు చేసింది. 12, 15, 18, 21, 23, 26, 30 ఏళ్ల సింగిల్ మాల్ట్ విస్కీలు కూడా ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఎఫ్‌ఎల్ బెవరేజెస్ ది మకల్లన్ హైలాండ్ సింగిల్ మాల్ట్ రేంజ్‌తో పాటు ఇతర విదేశీ విస్కీ, వైన్ బ్రాండ్లను ప్రతిపాదించింది.
లూయిస్ చార్డిన్ గ్రాండ్ షాంపేన్ కాగ్నాక్, రెమీ మార్టిన్, బ్రూచ్‌లాడిచ్ విస్కీ, హార్డీస్ వైన్ వంటి బ్రాండ్లకు కూడా దరఖాస్తులు వచ్చాయి. బీర్లలో టైగర్ లాగర్, శాన్ మిగుయెల్, రెడ్ హార్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ఉన్నాయి. జర్మన్ బీర్ బ్రాండ్లను కూడా జాబితాలో చేర్చారు. కొరియన్ బీర్లలో సియోక్‌బాంగ్‌గో లాగర్, డోంగంగ్ బీర్ ఉన్నాయి. ఇతర ప్రతిపాదనల్లో గ్లెన్ ప్లాగర్, ఎక్స్టిల్ ఆర్గానిక్ వోడ్కా, లోకా లోకా టెకిలా ఉన్నాయి.
భారతీయ ప్రీమియం బ్రాండ్లకు కూడా ప్రతిపాదనలు
విదేశీ బ్రాండ్లతో పాటు భారతదేశంలో తయారయ్యే ప్రీమియం మద్యం, వైన్లకు కూడా దరఖాస్తులు వచ్చాయి. అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ లిమిటెడ్ తన అల్ట్రా కలెక్షన్ ఎలైట్ బ్లెండెడ్ మాల్ట్ విస్కీ, జోయా లగ్జరీ బ్రాండ్లను ప్రతిపాదించింది. అన్హె డిస్టిల్లరీస్ నుంచి స్యోక్ ల్యాబ్ క్లాసిక్, సాఫ్రాన్ ఇన్‌ఫ్యూజ్డ్ వోడ్కా, రాయల్ ఎన్‌సీ ప్రీమియం విస్కీ వంటి బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చాయి. కర్ణాటకకు చెందిన రీకో వైనర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇర్మా పేరుతో రెడ్, వైట్, స్పార్క్లింగ్, హనీ వైన్లను ప్రతిపాదించింది.
విదాది వ్యాలీ బెవరేజెస్ బ్యాడ్ యాపిల్స్ చిల్లర్స్, చాచి రెడ్ వైన్‌ను ప్రతిపాదించింది. శంకర్ డిస్టిల్లర్స్ వెర్సాస్ అమెరికన్ బ్లెండెడ్ విస్కీకి దరఖాస్తు చేసింది. మహారాష్ట్రకు చెందిన సలోన్ వైన్‌యార్డ్ సెవెన్, ఓర్యా పేర్లతో కొత్త వైన్ రేంజ్‌లను ప్రతిపాదించింది. యునైటెడ్ స్పిరిట్స్‌కు చెందిన హెర్క్సెన్ డిస్టిల్లరీ మెక్‌డోవెల్స్ నంబర్ వన్ క్లాసిక్ ట్రెండ్ విస్కీని జాబితాలో చేర్చింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్‌ఆర్ ఎంటర్‌ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గానికి చెందిన బదిరియం ఎగ్జిమ్ కూడా ప్రీమియం బీర్లు, విదేశీ వైన్ల కోసం ప్రతిపాదనలు పంపాయి.
మొత్తం 18 సరఫరాదారులు సమర్పించిన సాంకేతిక వివరాలు, కంపెనీ పత్రాలను అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాల పరిశీలన, నిబంధనల తనిఖీ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎక్సైజ్ శాఖ వర్గాల ప్రకారం, ప్రీమియం మద్యం కోరుకునే వినియోగదారులను ఈ కొత్త ఉత్పత్తులు ఆకర్షించే అవకాశం ఉంది.

