
తెలంగాణలో నర్సుల కొరత.. 47% తక్కువ!
తెలంగాణలో నర్సుల కొరత కొనసాగుతోంది. 60,919 మంది నర్సులే ఉండగా, WHO ప్రమాణాలతో పోలిస్తే రాష్ట్రం 47 శాతం వెనుకబడి ఉంది.
తెలంగాణ ఆసుపత్రుల్లో నర్సుల కొరత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం నర్సుల సంఖ్య లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్లలో 10 వేలకు పైగా నర్సులను నియమించినా పరిస్థితి పూర్తిగా మారలేదు. WHO ప్రమాణాలతో పోలిస్తే రాష్ట్రంలో నర్సుల సంఖ్య 47 శాతం తక్కువగా ఉంది. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో ప్రస్తుతం 60,919 మంది రిజిస్టర్డ్ నర్సులు, మిడ్‌వైఫ్స్ ఉన్నారు. 2026 అంచనా జనాభా దాదాపు 3.9 కోట్లు. ఈ లెక్కన ప్రతి వెయ్యి మందికి 1.58 మంది నర్సులు మాత్రమే ఉన్నారు. WHO ప్రమాణం ప్రకారం ప్రతి వెయ్యి మందికి ముగ్గురు నర్సులు ఉండాలి. జాతీయ సగటు కూడా 2.45గా ఉంది.
పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ పరిస్థితి కొన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడి ఉంది. కేరళలో ప్రతి వెయ్యి మందికి 10.47 మంది నర్సులు ఉన్నారు. కర్ణాటకలో 7.69, ఆంధ్రప్రదేశ్‌లో 5.72, తమిళనాడులో 5.09 మంది ఉన్నారు. ఇటీవల చేపట్టిన నియామకాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు కొంత భర్తీ అయ్యాయి. అయితే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ సేవలు పెరగడంతో నర్సుల అవసరం కూడా పెరిగింది. తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ వివరాల ప్రకారం.. 100 పడకల ఆసుపత్రికి సుమారు 45 మంది నర్సులు అవసరం.
తెలంగాణ ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 17 వేల పడకలు ఉండగా, దాదాపు 13 వేల మంది నర్సులు పనిచేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 28 వేలకు పైగా పెరిగింది. అయితే అదే స్థాయిలో నర్సుల నియామకాలు జరగలేదని అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మరో 6 వేల నుంచి 7 వేల మంది నర్సుల అవసరం ఉందని తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ పేర్కొంది. రాష్ట్రంలో నర్సుల నియామకాలు, ఆసుపత్రుల విస్తరణకు అనుగుణంగా కొనసాగుతున్నాయి.

