
ఐఎండీ హైదరాబాద్ కేంద్రం విడుదల చేసిన వెదర్ చిత్రం (ఫొటో : ఐఎండీ)
హీట్‌వేవ్ అలర్ట్: తెలంగాణ జిల్లాలు ఉక్కిరిబిక్కిరి
ఎండల తాకిడి.. ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్,22 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణలో ఎండలు మరింత భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించగా, మరిన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇదే సమయంలో వడగాలులతో పాటు వడగళ్ల వర్షాల హెచ్చరికలు జారీ కావడం వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులకు దారితీస్తోంది.
అయిదు జిల్లాల్లో రెడ్ అలెర్ట్
తెలంగాణలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వాతావరణశాఖ కేంద్రం హీట్ వేవ్ స్పెషల్ బులెటిన్ ను విడుదల చేసింది. మంగళవారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆమె తెలిపారు. తెలంగాణలోని 5 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
22 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ
వనపర్తి, వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, నారాయణపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, ములుగు, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, జగిత్యాల, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ నమోదైందని నాగరత్న తెలిపారు. 22 జిల్లాల్లో మంగళవారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసినట్లు ఆమె వివరించారు. హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల దాకా నమోదవుతుందని ఆమె వివరించారు.
రేపటి నుంచి తేలికపాటి వర్షాలు
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఉపరితల చక్రవాత ఆవర్తనం
ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని, ఇది సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మంగళవారం ఏర్పడిందని వాతావరణశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ నాగరత్న చెప్పారు. మంగళవారం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాహత ఆవర్తనం నుంచి అంతర్గత కర్ణాటక రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని ఆమె తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం,రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని డాక్టర్ నాగరత్న వెల్లడించారు. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందన్నారు. మంగళవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
మంగళవారం ,రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30- 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
నేడు పలు జిల్లాల్లో వడగళ్ల వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, మధ్య తెలంగాణలో మంగళవారం వడగాలుల తీవ్రత కొనసాగనుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నల్గొండ, యాదాద్రి-భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన భారీ ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, అక్కడక్కడ వడగళ్లతో కూడిన మోస్తరు నుంచి తీవ్ర స్థాయి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరంలో రాబోయే నాలుగు రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది.ఈ హెచ్చరిక మే 1వతేదీ వరకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వర్తిస్తుందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణలో వడగాలులు కొనసాగే అవకాశం ఉంది.
సోమవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద అత్యధికంగా 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఒకవైపు తీవ్ర ఎండలు, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్రాన్ని ద్వంద్వ వాతావరణ పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు నివారించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. తెలంగాణలో వడదెబ్బ మృతుల సంఖ్య కూడా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహా పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది.
Next Story

