ఖరీఫ్‌కు తెలంగాణ సర్కార్ సన్నాహాలు.. యూరియాపై సరికొత్త టార్గెట్
x

ఖరీఫ్‌కు తెలంగాణ సర్కార్ సన్నాహాలు.. యూరియాపై సరికొత్త టార్గెట్

ఖరీఫ్ సీజన్‌కు ఎరువుల నిల్వలు, నానో యూరియా వినియోగం, ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు ఇచ్చారు.


ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేసింది. యూరియా సరఫరా, బఫర్ స్టాక్‌లు, నానో యూరియా వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.46 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని అధికారులు మంత్రికి వివరించారు. అదనంగా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

ఖరీఫ్ 2026 కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కోరింది. అయితే కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించినట్లు సమావేశంలో వెల్లడైంది. ఏప్రిల్ నెలకు కేటాయించిన 2 లక్షల టన్నుల్లో 1.53 లక్షల టన్నులే రాష్ట్రానికి చేరాయని, మే నెలలో ఇప్పటివరకు 48,985 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూన్ మొదటి వారంలో వరి నాట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో, మే చివరి నాటికి కనీసం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

కేంద్రం కేటాయించిన మిగిలిన యూరియాను వెంటనే రాష్ట్రానికి తరలించాలని అధికారులను సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 90 శాతం తెలంగాణ రైతులకే ఇవ్వాలని తుమ్మల డిమాండ్ చేశారు. రాష్ట్ర వనరులతో తయారయ్యే యూరియా అవసర సమయంలో తెలంగాణ రైతులకు అందకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంపై రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఎండీకి లేఖ రాయాలని అధికారులకు సూచించారు.

గత నెల కేటాయించిన ఎరువులను సరఫరా చేయని కంపెనీలు పెండింగ్ స్టాక్‌తో పాటు ప్రస్తుత నెల కోటాను కూడా సమయానికి పంపించాలని మంత్రి హెచ్చరించారు. రేక్ పాయింట్ల నుంచి జిల్లాలకు యూరియా రవాణాలో ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్సిడీ ఎరువుల పంపిణీ కోసం కేంద్రం కొత్త యాప్‌ను తీసుకొస్తోందని సమావేశంలో వెల్లడైంది. తెలంగాణ ఫర్టిలైజర్ యాప్ నమూనాను ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ యాప్‌ను దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మే 21 నుంచి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. నానో యూరియా వినియోగంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. సంప్రదాయ యూరియాను అధికంగా వాడటం వల్ల భూమి సారానికి నష్టం జరుగుతుందని తెలిపారు. భూమి పరీక్షలు చేయించి అవసరమైన ఎరువులను మాత్రమే వాడాలని రైతులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలని కూడా కేంద్రాన్ని మంత్రి కోరారు.

Read More
Next Story