
సూపర్ ఎల్‌నినో ప్రమాదం.. తెలంగాణకు కరువు భయం..
పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎల్‌నినో ప్రభావం ముందుగానే ప్రారంభమయ్యే సూచనలు. తెలంగాణలో నీటి కొరతపై ఆందోళన.
ఈ ఏడాది హైదరాబాద్ కరువును చూసే అవకాశం ఉంది. ఋతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉండటంతో తెలంగాణ వ్యవసాయం రంగం భారీ కుదుపును ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న క్రమంలో ఎల్‌నినో మరింత బలపడే అవాశం ఉందని, ఇప్పటికే పసిఫక్ టెంపరేచర్ల ప్రభావం ప్రపంచ పర్యావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ, నేషనల్ ఓషనిక్, అట్మాస్వియరిక్ అడ్మినస్ట్రేషన్ వంటి సంస్థ సూపర్ ఎల్‌నినో హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.
మే రెండో వారంలోనే ఎల్‌నినో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, జూలై నాటికి ఇది మరింత బలపడవచ్చని అంచనా వేశారు. గత అంచనాలతో పోలిస్తే ఇది వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు. శాస్త్రవేత్తల ప్రకారం పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకంటే ఎక్కువ పెరిగితే దాన్ని బలమైన లేదా సూపర్ ఎల్‌నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఇప్పటికే 0.6 డిగ్రీల పెరుగుదల నమోదైంది. ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.
ఇదే సమయంలో గాలుల బలహీనత, మేఘాల తగ్గుదల కారణంగా వర్షపాతం తగ్గే సూచనలు ఉన్నాయి. ఇండోనేషియా, దక్షిణాసియా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిస్థితి భారతదేశంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గితే కృష్ణా, గోదావరి నదుల్లో నీటి ప్రవాహం తగ్గవచ్చు. దీని ప్రభావం తెలంగాణలో సాగునీటిపై పడే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని అధికారులు సూచించారు.
సగటు వర్షపాతం 92 శాతం వరకు మాత్రమే ఉండే అవకాశం ఉందని, ఇంకా తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాభావం ఉంటే తెలంగాణకు వచ్చే నీటి ప్రవాహం కూడా తగ్గవచ్చు. తెలంగాణలో ఉత్తర జిల్లాల్లో వర్షాల లోటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తూర్పు ప్రాంతాల్లో కొంత తక్కువ ప్రభావం ఉండగా, దక్షిణ జిల్లాలు ప్రారంభంలో తక్కువగా ప్రభావితమయ్యే అవకాశముంది.
ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా తీవ్ర ప్రభావం చూపాయి. 1876 నుంచి 1878 వరకు జరిగిన కరువు పరిస్థితులకు బలమైన ఎల్‌నినో కారణమైంది. ఆ సమయంలో పంటలు విఫలమై, నీటి కొరత తీవ్రంగా పెరిగింది. లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులు వస్తే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు, వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేడి తరంగాలు, అగ్ని ప్రమాదాలు పెరిగే ప్రమాదం కూడా ఉందని సూచిస్తున్నారు. మొత్తానికి, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. పరిస్థితులు ఎలా మారతాయో గమనించడం కీలకం.

