ధాన్యం నిల్వలకు తెలంగాణలో హైటెక్ సైలోలు
x

ధాన్యం నిల్వలకు తెలంగాణలో హైటెక్ సైలోలు

ధాన్య నిల్వ వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.4,450 కోట్లతో 23 జిల్లాల్లో సైలోల నిర్మాణానికి మంత్రి ఉత్తమ్ సమీక్షించారు.


తెలంగాణ రైతుల ముందున్న అతిపెద్ద సమస్య నిల్వ. ధాన్యాన్ని నిల్వ చేసే విషయంలో ప్రతి ఏడాది వేలాది మంది రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలని ప్రభుత్వ భావించింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించేలా నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం నిల్వల కోసం అత్యాధునిక సైలోలను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అందులో ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను మరింత ఆధునీకరించే అంశాలపై చర్చించారు.

ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అత్యాధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 82 సైలో టెర్మినల్స్ నిర్మాణం ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరచాలని యోచిస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 47.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త సైలో వ్యవస్థల వల్ల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, తేమ, పురుగుల ప్రభావం వంటి సమస్యల నుంచి ధాన్యాన్ని రక్షించవచ్చని అధికారులు వివరించారు.

ప్రస్తుతం ఉన్న సంప్రదాయ నిల్వ విధానాల కంటే ఇవి ఎంతో అధునాతనమైనవని, దీనివల్ల ధాన్యం నాణ్యతను ఎక్కువ కాలం పాటు కాపాడవచ్చని పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్, వెదర్‌ప్రూఫ్ ప్యాడీ స్టోరేజ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఈ సైలోల నిర్మాణానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక అంశాలపై కూడా సమావేశంలో చర్చలు జరిగాయి. సుమారు 4,450 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ భారీ ప్రాజెక్టును అమలు చేసే అవకాశాలపై అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధునిక ధాన్య నిర్వహణ వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ధాన్యం నిల్వలో నాణ్యత ప్రమాణాలను కాపాడటం, నిల్వ సమయంలో జరిగే నష్టాలను తగ్గించడం, అలాగే సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం సాధ్యమవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలు త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.

Read More
Next Story