‘ఇకపై ప్రతి ఏడాది హైదరాబాద్‌లో కూడా ఆర్థిక సదస్సు’
x

‘ఇకపై ప్రతి ఏడాది హైదరాబాద్‌లో కూడా ఆర్థిక సదస్సు’

ఈ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించింది.


ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనను ఆయన వెల్లడించారు. గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం వ్యవధి ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులకు సూచించారు.

హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ భారీ విజయాన్ని సాధించిందని సీఎం తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించినట్లు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈసారి దావోస్‌కు వచ్చామని చెప్పారు.

హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందని సీఎం అన్నారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేపట్టి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి సారిస్తామని తెలిపారు. దేశంలోనే 24 గంటలు చురుకుగా పనిచేసే నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువగా గ్రీన్ కవర్ ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030ను ఆవిష్కరించారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, చెరువులు కుంటల పునరుజ్జీవనం వంటి కీలక ప్రాజెక్టులను వివరించారు. కోర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణలో విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, గ్లోబల్ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం, నైపుణ్యాలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Read More
Next Story