గ్లోబల్ సమ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో..
x

గ్లోబల్ సమ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో..

తెలంగాణను డిఫెన్స్ హబ్‌గా మార్చే ప్లాన్!


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం

1) డ్యూటీ నుంచి ఇంటి వరకు.. మహిళల భద్రతలో వైఫల్యం ఎక్కడ?

2) గ్లోబల్ సమ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో.. తెలంగాణను డిఫెన్స్ హబ్‌గా మార్చే ప్లాన్!

3) హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం NH-65 హైస్పీడ్ కారిడార్

1) డ్యూటీ నుంచి ఇంటి వరకు.. మహిళల భద్రతలో వైఫల్యం ఎక్కడ?

డ్యూటీకి వెళ్లే నర్సు నుంచి, నైట్ షిఫ్ట్‌లో పనిచేసే BPO ఉద్యోగిని వరకు, హోటల్, రిటైల్ రంగాల్లో పనిచేసే మహిళల నుంచి, అద్దె గదులు, PGలు, హాస్టళ్లలో ఒంటరిగా ఉంటున్న యువతుల వరకు డ్యూటీ ప్లేస్ నుంచి ఇంటి గుమ్మం వరకు మహిళలకు నిజంగా భద్రత ఉందా? ఆగస్టు నెలలో తెలంగాణలో చోటుచేసుకున్న వరుస ఘటనలు ఇప్పుడు ఇదే ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చాయి.

ఆగస్టులో జరిగిన ఘటనలు, ఒకే ప్రశ్న. ఘట్‌కేసర్‌లో మహిళ హత్య. బాలాపూర్‌లో యువతి హత్య. నిరాశ్రయ మహిళపై దారుణ దాడి. ఆపై ఆగస్టు 31న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 21 ఏళ్ల యువ నర్సు హత్య కేసు. ఈ ఘటనలు ఒక్కో ప్రాంతంలో. ఒక్కో పరిస్థితిలో జరిగాయి. కానీ బాధితులందరిలో ఒకే అంశం ఉంది. మహిళ ఎక్కడ ఉన్నా, ఆమె భద్రతకు సంబంధించిన రిస్క్ పూర్తిగా తొలగిపోలేదు. తుక్కుగూడ ఘటన ప్రత్యేకంగా పనిచేసే మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే తెలంగాణలో వేలాది మంది మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.

నర్సులు, BPO ఉద్యోగులు, హోటల్ సిబ్బంది, రిటైల్ ఉద్యోగులు, వీరందరికీ డ్యూటీ సమయంలో మాత్రమే కాదు. డ్యూటీకి వెళ్లే ప్రయాణంలో, డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో వారు నివసించే హాస్టల్ లేదా PGలో కూడా భద్రత అవసరం.మహిళల భద్రత అంటే కేవలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కాదు. నేరం జరగకముందే రిస్క్‌ను గుర్తించి తగ్గించే వ్యవస్థ ఉండాలి. అయితే ఇక్కడ కొన్ని కీలక ప్రశ్నలు ఉన్నాయి. రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే మహిళలకు సంస్థలు సురక్షిత రవాణా కల్పిస్తున్నాయా? డ్రాప్ పాయింట్ నుంచి హాస్టల్ వరకు భద్రత ఉందా? స్టాఫ్ క్వార్టర్స్, PGలు, హాస్టళ్లలో CCTVలు పనిచేస్తున్నాయా? ఎవరైనా బయట వ్యక్తి సులభంగా లోపలికి ప్రవేశించే పరిస్థితి ఉందా? రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే స్పందించే వ్యవస్థ ఉందా? ఇక్కడే మహిళల భద్రతలో అసలు గ్యాప్ కనిపిస్తోంది. పోలీసింగ్ ఒక్కటే దీనికి పరిష్కారం కాదు. ఉద్యోగ సంస్థ, హాస్టల్ యాజమాన్యం, PG నిర్వాహకులు, భవన యజమానులు, స్థానిక పోలీసులు, అందరూ కలిసి పనిచేసినప్పుడే భద్రతా వ్యవస్థ పూర్తి అవుతుంది.

“మహిళల భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. వారు పనిచేసే సంస్థలు, నివసించే హాస్టళ్లు, PGల యాజమాన్యాలు కూడా భద్రతా ప్రమాణాలను పాటించాలి. అనుమానాస్పద పరిస్థితులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.” అని SP police officers Association ex president M. Madhava Reddy ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

అధికారికంగా అందుబాటులో ఉన్న 2024 వరకు తెలంగాణలో మహిళలపై నమోదైన నేరాల రేటు ప్రతి లక్ష మంది మహిళలకు 128.6గా ఉన్నట్లు NCRB ఆధారిత గణాంకాలు చెబుతున్నాయి. అత్యాచార కేసుల సంఖ్యలో కూడా తెలంగాణ దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో ఉందని అందుబాటులో ఉన్న నివేదికలు సూచిస్తున్నాయి.

“మహిళలపై భద్రత బాధ్యతను పూర్తిగా మహిళలపైనే వేయకూడదు. రాత్రి బయటకు వెళ్లవద్దు, ఒంటరిగా ఉండవద్దు అనే సూచనలు మాత్రమే పరిష్కారం కాదు. సురక్షిత రవాణా, భద్రత కలిగిన నివాసాలు, సంస్థల బాధ్యత, వేగవంతమైన పోలీసు స్పందన వంటి వ్యవస్థాపరమైన మార్పులు అవసరం.” అని రిటైర్డ్ సీనియ‌ర్ ఐపిఎస్ అధికారి Santosh Kumar తెలిపారు.

తుక్కుగూడ నర్సు హత్య కేసు నేపథ్యంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే మహిళలకు తప్పనిసరిగా సురక్షిత డ్రాప్ సిస్టమ్ ఉండాలా? హాస్టళ్లు, PGలు, స్టాఫ్ క్వార్టర్స్‌కు భద్రతా ప్రమాణాలు తప్పనిసరి చేయాలా? CCTVలు పెట్టడమే కాకుండా అవి పనిచేస్తున్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేయాలా? మహిళలు నివసించే ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ పెంచాలా? సంస్థల్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక అత్యవసర స్పందన వ్యవస్థ ఏర్పాటు చేయాలా? ఇవి ఇప్పుడు కేవలం చర్చించాల్సిన అంశాలు కాదు... అమలు చేయాల్సిన చర్యలు.

ఒక మహిళ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు, ఆమె కుటుంబం కోరుకునేది ఒక్కటే. డ్యూటీ పూర్తయ్యాక ఆమె సురక్షితంగా తిరిగి రావాలి. కానీ డ్యూటీ ప్లేస్, ప్రయాణం, హాస్టల్, అద్దె గది ప్రతి దశలో భద్రత గురించి ఆలోచించాల్సి వస్తే, అది మహిళల వ్యక్తిగత వైఫల్యం కాదు. అది వ్యవస్థలో ఉన్న లోపం.తుక్కుగూడ నర్సు హత్య కేసు కేవలం ఒక క్రైమ్ కేసుగా ముగియకూడదు. డ్యూటీ నుంచి ఇంటి వరకు...తెలంగాణలో పనిచేసే ప్రతి మహిళకు భద్రత ఉందా? అనే ప్రశ్నకు సమాధానం వెతికే సందర్భంగా మారాలి. ఎందుకంటే, మహిళల భద్రత అంటే, నేరం జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకోవడం మాత్రమే కాదు.నేరం జరగకుండా మహిళకు సురక్షితమైన జీవన వాతావరణం కల్పించడం. “డ్యూటీ నుంచి ఇంటి వరకు... మహిళ ప్రయాణం భయంతో కాకుండా, భద్రతతో సాగినప్పుడే అసలైన మార్పు వచ్చినట్టు.”


2) గ్లోబల్ సమ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో.. తెలంగాణను డిఫెన్స్ హబ్‌గా మార్చే ప్లాన్!

ఒకవైపు తెలంగాణను ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా మార్చే ప్రయత్నాలు. మరోవైపు, రక్షణ, భద్రతా వ్యవస్థలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన కంటోన్మెంట్ ఆయుధాల చోరీ ఘటనపై ఆందోళన. ఇప్పుడు తెలంగాణలో డిఫెన్స్ రంగంపై చర్చ కేవలం పరిశ్రమలు, పెట్టుబడులకే పరిమితం కావడం లేదు. రక్షణ రంగంలో పెట్టుబడులు ఎంత ముఖ్యమో, భద్రతా వ్యవస్థ అంత పటిష్టంగా ఉండాలనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. ఇదే సమయంలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో రక్షణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న డిఫెన్స్ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని కూడా కోరారు. ఈ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ ఈ మూడు కీలక రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు, భారీ ఎయిర్ షో. పారిశ్రామిక ప్రదర్శనలు. అత్యాధునిక భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

డిఫెన్స్ ఎక్స్‌పోను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకారం కోరారు ముఖ్యమంత్రి.ఎయిర్ షో కోసం గగనతల అనుమతులు, భారత వైమానిక దళం విమానాల ప్రదర్శనలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల భాగస్వామ్యం, స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శన. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉన్నాయి. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఒకే వేదికపై ప్రదర్శించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

అంటే, గ్లోబల్ సమ్మిట్ కేవలం పెట్టుబడుల వేదిక మాత్రమే కాదు. తెలంగాణలో డిఫెన్స్ ఇండస్ట్రీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే వేదికగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

డిఫెన్స్ ఎక్స్‌పోలో ప్రముఖ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, DRDO ప్రయోగశాలలు విస్తృతంగా పాల్గొనేలా కేంద్రాన్ని కోరారు. HAL, BEL, BDL, MDL, DRDO ప్రయోగశాలలు. ఇవన్నీ తమ స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలకు తెలంగాణ ఒక పెద్ద నెట్‌వర్కింగ్ వేదికగా మారే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ రక్షణ సంస్థలు, విదేశీ ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా, తెలంగాణలో డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. డిఫెన్స్ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ఎంత ఫోకస్ పెడుతోందో దేవరకద్ర ప్రాజెక్టు ద్వారా కూడా అర్థమవుతోంది.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో DRDL ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు TGIIC అంగీకరించింది. ముఖ్యంగా, ఈ భూమిని సాధారణ వాణిజ్య లీజు రేటుకు కాకుండా సంవత్సరానికి మొత్తం భూమికి కేవలం రూ.1 నామమాత్రపు లీజుతో 33 సంవత్సరాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే లీజును మరో రెండుసార్లు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్ రీసెర్చ్, హైటెక్ పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది.

ఇక ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 750 ఎకరాల భూ సేకరణ చేపట్టిన ప్రభుత్వం, రక్షణ శాఖ అవసరాల మేరకు మొత్తం 1,500 ఎకరాల భూమి కోసం మరో 750 ఎకరాలు సేకరించేందుకు అంగీకరించింది. అంటే, తెలంగాణలో డిఫెన్స్, ఏవియేషన్ రంగాలకు అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.

అయితే... ఒకవైపు తెలంగాణను డిఫెన్స్ టెక్నాలజీ, రక్షణ పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో... కంటోన్మెంట్‌లో వెలుగులోకి వచ్చిన ఆయుధాల చోరీ ఘటన భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేసు దర్యాప్తు కోణం, భద్రతా లోపాలు ఎలా జరిగాయి, బాధ్యత ఎవరిది వంటి అంశాలపై సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత ఎంత ముఖ్యమో, వాటికి సంబంధించిన భద్రతా వ్యవస్థ కూడా అంతే కీలకం. అత్యాధునిక రక్షణ పరిశ్రమలను తెలంగాణకు తీసుకురావాలంటే పరిశోధనా కేంద్రాలు, ఉత్పత్తి యూనిట్లు, రక్షణ సంస్థలు, సున్నితమైన పరికరాలు వీటన్నింటికీ అత్యున్నత భద్రత అవసరం.

డిసెంబర్‌లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 తెలంగాణకు పెట్టుబడుల వేదిక మాత్రమే కాకుండా, “డిఫెన్స్ హబ్‌గా తెలంగాణ ఎంత దూరం వెళ్లగలదు?” అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే వేదికగా మారబోతోంది. డిఫెన్స్ ఎక్స్‌పో, ఎయిర్ షో, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, DRDLకు భారీ భూకేటాయింపు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ. ఈ నిర్ణయాలన్నీ ఒకే దిశను సూచిస్తున్నాయి.

తెలంగాణను భవిష్యత్ డిఫెన్స్, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దడం. అయితే, రక్షణ రంగంలో అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా, భద్రతా వ్యవస్థ కూడా అదే స్థాయిలో బలపడాలి. ఎందుకంటే, డిఫెన్స్ హబ్‌గా ఎదగడానికి కేవలం పరిశ్రమలు సరిపోవు...అత్యున్నత స్థాయి భద్రత కూడా అవసరం. ఇదే తెలంగాణ ముందు ఉన్న అసలు ఛాలెంజ్.


3) హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం NH-65 హైస్పీడ్ కారిడార్

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే, ట్రాఫిక్ ఉంటే గంటలు గంటలు. ప్రస్తుతం సగటున ఐదు గంటలకు పైగా ప్రయాణం. కానీ త్వరలో ఈ ప్రయాణానికి కొత్త రూపం రాబోతోంది. హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి-65ను భారీ హైస్పీడ్ కారిడార్‌గా మార్చే ప్రతిపాదనకు కీలక ముందడుగు పడింది. మొత్తం 285 కిలోమీటర్ల మేర సుమారు రూ.12 వేల కోట్ల భారీ వ్యయంతో ఆరు లేన్ల హైవేగా అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే, ఈ కొత్త హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎంత టైంలో చేరుకోవచ్చు? ఈ ప్రాజెక్టులో అసలు కొత్తగా ఏం ఉండబోతోంది?

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే NH-65కు భారీ అప్‌గ్రేడ్ ప్రతిపాదించారు. మొత్తం 285 కిలోమీటర్ల మార్గాన్ని ఆరు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,073.99 కోట్లు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ నుంచి కీలక ఆమోదం లభించడంతో ప్రాజెక్టు తదుపరి దశకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ తుది ఆమోదం తర్వాత, టెండర్లు, నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ భారీ హైవే ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తర్వాత నుంచి విజయవాడ వైపు కీలక మార్గం. రెండో ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి నందిగామ వైపు రహదారి అభివృద్ధి. మూడో ప్యాకేజీలో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు సుమారు 60 కిలోమీటర్ల మార్గం.

ఈ మూడు భాగాలను కలిపి హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం కారిడార్‌ను ఒక హైస్పీడ్ రూట్‌గా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.కొత్త హైవేలో కేవలం ఆరు లేన్లు మాత్రమే కాదు, భద్రత, వేగం రెండింటికీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు. వాహనాల భద్రత కోసం క్రాష్ బారియర్లు. మరియు నియంత్రిత ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 15 నుంచి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ లేదా ఎగ్జిట్ పాయింట్ ఉండేలా ప్రణాళిక ఉంది. దీంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలు హైవేలోకి ఎక్కడం, దిగడం తగ్గుతుంది. ప్రధాన హైవేపై స్థానిక ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ హైవేలో అత్యంత ఆసక్తికరమైన అంశం, మీరు ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించే విధానం. అంటే, హైవేలోకి ఎక్కడ ఎంటర్ అయ్యారు. ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు. అనే వివరాల ఆధారంగా మీరు ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తారు. అంత దూరానికే టోల్ వసూలు చేసే విధంగా సాంకేతిక వ్యవస్థను ప్రతిపాదించారు. దీంతో, తక్కువ దూరం ప్రయాణించే వారికి పూర్తి టోల్ చెల్లించాల్సిన పరిస్థితి తగ్గే అవకాశం ఉంటుంది.ఇదే ఇప్పుడు అందరి ఆసక్తి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం సాధారణంగా 5 గంటలకు పైగా పడుతోంది. ట్రాఫిక్, పట్టణ ప్రాంతాలు, స్థానిక రాకపోకల కారణంగా సమయం మరింత పెరిగే పరిస్థితులు కూడా ఉంటాయి.

కానీ, ఆరు లేన్ల రహదారి. నియంత్రిత ఎంట్రీలు. సర్వీస్ రోడ్లు. మరింత మెరుగైన ట్రాఫిక్ ప్రవాహం. అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే, ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది.

హైదరాబాద్ నుంచి విజయవాడ అక్కడి నుంచి మచిలీపట్నం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే ఈ కీలక రహదారి ఇప్పుడు భారీ మార్పుకు సిద్ధమవుతోంది. రూ.12 వేల కోట్ల పెట్టుబడి. 285 కిలోమీటర్ల మెగా కారిడార్. 6 లేన్ల హైవే. ప్రతి 15–18 కిలోమీటర్లకు ఎంట్రీ-ఎగ్జిట్...ప్రయాణించిన దూరానికే టోల్. అన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తయితే, ఇది కేవలం రోడ్డు విస్తరణ కాదు. హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి కొత్త స్పీడ్ ఇచ్చే హైస్పీడ్ కారిడార్. అయితే ప్రస్తుతం ఇది ప్రతిపాదనల నుంచి తదుపరి ఆమోదాల దశలో ఉంది. కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ తర్వాతే, ఈ మెగా హైవే అసలు ప్రయాణం మొదలుకానుంది!

Read More
Next Story