
ప్రకృతి సేద్యం కోసం తెలంగాణ ‘ఆర్గానిక్ యాప్ ’
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినట్టు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన టీజీ ఆర్గానిక్స్ మొబైల్ యాప్ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో ఒక చిన్న అడుగు మాత్రమే అని మరిన్ని చర్యలు అవసరం అని సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జీ.వి. రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రయత్నం సఫలం కావటానికి రైతులకు గుర్తింపుతో పాటు మార్కెటింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ రంగంలో ఉన్న మరికొందరు నిపుణులు పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన టీజీ ఆర్గానిక్స్ మొబైల్ యాప్ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో ఒక చిన్న అడుగు అనటంలో సందేహం లేదు. అయితే ఈ ప్రయత్నం సఫలం కావటానికి రైతులకు గుర్తింపుతో పాటు మార్కెటింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ రంగంలో ఉన్న నిపుణులు పేర్కొన్నారు.
రాష్ట్రం ఆర్గానిక్ వ్యవసాయం లో ముందడుగు వేసి 2006 నాటికే ‘రసాయనాలు వాడని ఊరు’ గా జనగామ జిల్లాలోని ఎనబావి గ్రామం పేరు తెచ్చుకుంది. అయితే రాష్ట్రం ఈ దిశలో ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో వెనుకబడింది అనే దానిలో సందేహం లేదు. ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రైతు సాధికార సంస్థ (rythu sadhikara sanstha) పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి ముందడుగు వేసి అంతర్జాతీయంగాను గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం వైపు నుండి తగిన ప్రోత్సాహం లేకుండా పోయింది. అయితే రాష్ట్రం ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెట్టి కొన్ని చర్యలు చేపట్టింది.
ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగిన పరిణామం అని సుస్థిర వ్యవసాయ కేంద్రం (Centre For Sustainable Agriculture) లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న జీ. రాజశేఖర్ అన్నారు. “రాష్ట్రం గ్రామ స్థాయిలో బయో రిసోర్సెస్ కేంద్రాలను మొదలు పెడుతోంది. వీటిలో పంటను బట్టి ప్రకృతి వ్యవసాయం చేయటానికి అవసరం అయిన ఇన్పుట్ లు ఇస్తారు. ఎల్ నినో తో రాబోయే వర్షాభావ పరిస్థితులు, యూరియా కొరత ఉన్న పరిస్థితిలో ఈ ప్రయత్నం అవసరం. ప్రణాళిక స్థాయిలో అన్నీ బాగుంటాయి కానీ అమలుకు వచ్చేసరికి ఫెయిల్ అవుతుంటాయి. అధికారులు నిబద్దతతో పని చేస్తే సక్సెస్ అవుతాయి. రైతులకు ఉపయోగపడుతుంది,” అన్నారు.
మొదట గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ను విడుదల చేసిన వ్యవసాయ శాఖ త్వరలో ఆపిల్ ప్లే స్టోర్ లోనూ యాప్ ను త్వరలో విడుదల చేస్తామని తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ డైరెక్టర్ డా. ఏ. కిరణ్ కుమార్ తెలిపారు. “ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ముందు ముందు అవసరాన్ని బట్టి అందులో మరిన్ని సౌకర్యాలు పొందుపరుస్తాము. మాకు వచ్చే ప్రోత్సాహాన్ని బట్టి ముందుకు వెళ్తాము. ఇది ప్రధానంగా రైతులు, వినియోగదారుల మధ్య ఒక వారధిని ఏర్పాటు చేసే ప్రయత్నం మాత్రమే. ఇది రాత్రికి రాత్రి సక్సెస్ అయ్యే అవకాశం లేదు,” అని అన్నారు.
“చాలా మందికి ఆర్గానిక్ ఆహారం తినాలని ఉంటుంది అయితే మార్కెట్లో ఉన్నవి పూర్తిగా సేంద్రీయ పద్దతుల్లో పండించారా లేదా అనే సందేహం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, వరి పండించే రైతులు యాప్ లో భాగం అయ్యారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆయా రైతులను నేరుగా సంప్రదించి కొనుగోలు చేయవచ్చు. ధరలను ఆయా రైతులే నిర్ణయించుకుంటారు. మధ్య దళారులు లేరు. మేము సేంద్రీయ పద్దతిలో పండించారా లేదా అని సర్టిఫికేట్ భూమికి ఇస్తాము,” అని ఆయన తెలిపారు.
రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ యాప్ ను విడుదల చేశారు. మే 4 నుండి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "రైతు వారం" కార్యక్రమాలలో భాగంగా మంత్రి మే 4న వికారాబాద్ జిల్లా తాండూరులో యాప్ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,565 మట్టి నమూనాలను సేకరించి, 20,734 మట్టి విశ్లేషణ పత్రాలను రైతులకు అందజేశారు. నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి సాగు వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో 1,32,423 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని వ్యవసాయ శాఖ ఆ రోజు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది.
“ఒక ఎకరా మట్టి నమూనా పరీక్షకు రు. 2,950 ఖర్చు అవుతుంది. ప్రతి అదనపు ఎకరాకు రు. పది అదనంగా తీసుకుని సర్టిఫికేట్ జారీచేస్తాము. మూడు సంవత్సరాలు సేంద్రీయ వ్యవసాయం చేస్తే గానీ మట్టిలోని రసాయన అవశేషాలు పోవు. ఇలా మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళనే యాప్ లో చేర్చాము,” అని తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ టీ. సౌమ్య తెలిపారు.
ఈ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం రాష్ట్రంలో సుస్థిర వ్యవసాయ కేంద్రంతో పాటు మరో తొమ్మిది సంస్థలకు ఇచ్చారు. దేశంలో ఇలాంటి రీజనల్ కౌన్సిల్ లు 94 ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ లాంటి కార్యక్రమాలను ఉపయోగించుకుని రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు సహాయం చేయాలి. అలా చేస్తే ఎనబావి లాంటి మరిన్ని గ్రామాలను సృష్టించచ్చు. రసాయన వ్యవసాయం తగ్గిస్తే తద్వారా మిగిలిన సొమ్మును కేంద్రం రాష్ట్రాలకు ఇస్తుంది, అని రాజశేఖర్ తెలిపారు.
కాగా యాప్ లో భాగం అయిన కరువంగా గ్రామం, చిలకపల్లి మండల, నాగర్కర్నూల్ జిల్లా రైతు కోసిరెడ్డి లావణ్య ‘ఫెడరల్’ తో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి సన్న బియ్యానికి రైతులకు బోనస్ ఇచ్చినట్టు ఇవ్వాలన్నారు. “అలా చేస్తే పంట ఉత్పత్తి తగ్గినా రైతులు నష్ట పోరు. యార్డులలో ప్రత్యేక షాప్ లను ఏర్పాటు చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో రోజు పని ఉంటుంది. కషాయాలు చల్లటానికి యంత్రాలు కావాలని యాప్ విడుదల చేసిన సభలో వ్యవసాయ మంత్రిని అడిగాము,” అని తెలిపారు.
సేంద్రీయ వ్యవసాయం గురించి ఇంకా అవగాహన పెరగాల్సి ఉందని మరో రైతు సార్ది నేనీ సుమన్ రావు అన్నారు.
అయితే ఈ ప్రయత్నం ముందుకు వెళ్ళి సక్సెస్ కావాలంటే రైతుల సహకార సంస్థలు (Farmer producer organization) ఏర్పాటు అవసరం అని సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జీ.వి. రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. “వినియోగదారులకు అవసరం అయిన ఉత్పత్తులు అన్నీ ఒక చోట ఉండవు కాబట్టి వాటి కొనుగోలుకు తగిన వేదిక అవసరం అవుతుంది. ఆ పనిని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు లేదా వ్యాపారులు చేయాల్సి ఉంటుంది. రైతులు పండించే క్రమం వినియోగదారులు వాటిని తినే క్రమం ఒకే సమయం లో ఉండవు,” అని అన్నారు.
ఈ క్రమంలో ఆహార పంటలు చెడిపోయి నష్టం వస్తుంది. వినియోగదారులు అందుకున్న సరుకు నచ్చక

