
ఆర్టీసీతో సర్కార్ చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచి నిలవనున్న బస్సులు..
టీజీఎస్ ఆర్టీసీ చర్చలు విఫలం. అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె. కార్మికుల కీలక డిమాండ్లు, ప్రయాణికులకు ఇబ్బందులు.
తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మధ్య నెలకొన్న పరిస్థితి మరింత ముదిరింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో అర్థరాత్రి నుంచి సమ్మె స్టార్ట్ చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను పరిష్కరించే అంశంలో ప్రభుత్వం తమకు భరోసా కల్పించలేకపోయిందని ఆర్టీసీ జేఏసీ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామంతో రవాణా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో వేతన సవరణ, బకాయిల చెల్లింపు, సంక్షేమ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏకాభిప్రాయం కుదరలేదని జేఏసీ నేతలు వెల్లడించారు. ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉందని వారు భావించినట్లు తెలిపారు.
చర్చలు విఫలమవడంతో జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను అప్రమత్తం చేసింది. అర్ధరాత్రి ప్రారంభమయ్యే మొదటి షిఫ్ట్ నుంచే బస్సులు నిలిపివేయాలని పిలుపునిచ్చింది. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గబోమని సంకల్పం వ్యక్తం చేశారు. బస్టాండ్లు, డిపోల వద్ద పోలీసులు మోహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
బస్సులు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు, దూర ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. రద్దీ సమయాల్లో సమ్మె ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కార్మికులు టీజీఎస్ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వ విభాగంగా విలీనం చేయాలని కోరుతున్నారు. వేతన సవరణలను తగిన ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెల ఆదాయ లోటు భర్తీకి నిధులు విడుదల చేయాలని సూచించారు. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని కోరుతున్నారు. అలాగే కార్మిక సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని జేఏసీ పేర్కొంది.
గతంలో 2019లో జరిగిన దీర్ఘకాలిక సమ్మెను ఈ సందర్భంలో గుర్తుచేస్తున్నారు. ఆ సమ్మె సమయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొనబడింది. ఆ సమయంలో రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
Live Updates
- 22 April 2026 8:16 AM IST
ఆర్టీసి సమ్మె
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసి సమ్మె
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోఆదిలాబాద్ , ఉట్నూర్, నిర్మల్, బైంసా, ఆసిఫాబాద్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్లు, డిపోల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 డిపోల ముందు ఆర్టీసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతున్నది.
కరీంనగర్ జిల్లాలో...
అర్ధరాత్రి నుంచి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.
డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం అయ్యాయి. రాబాద్ డిపో ఎదుట కార్మికుల ఆందోళన చేపట్టారు. బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణీకులు ఎదురుచూస్తున్నరు.
మంచిర్యాలలో...
ఇక మంచిర్యాల డిపోలో 76 ఆర్టీసీ బస్సులు, 69 ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఎఫెక్టుతో ప్రైవేటు వాహనాలను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు.
- 22 April 2026 8:11 AM IST
ఎంజిబిఎస్ వద్ధ నిరసన
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జేఏసీ నేతలు, TJNMU నాయకులు హనుమంత్, ఇతర నాయకుల నిరసన.
స్థలం : MGBS (ప్లాట్ ఫామ్ 2)
ఉదయం : 9 - 9.30 గంటలు
తేదీ : 22-04-2026.
- 22 April 2026 8:10 AM IST
సమస్యల పరిష్కారానికి గుడువు కావాలి: ప్రభుత్వం
ఆర్టీసి కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి మరికొన్ని సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున, వాటిని లోతుగా పరిశీలించి పరిష్కరించడానికి ప్రభుత్వానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని, ఈ మేరకు ప్రభుత్వం గడువు కోరినట్లు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) వై. నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్టీసి స్పష్టం చేశారు.

