రాజీవ్ గాంధీలో నన్ను ఆకట్టుకుంది అదే...
x

రాజీవ్ గాంధీలో నన్ను ఆకట్టుకుంది అదే...

సోనియా గాంధీ మనసులోని మాట!


Click the Play button to hear this message in audio format

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో తన తొలి పరిచయం, ప్రేమానుబంధానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో మొదలైన తమ పరిచయం, ప్రేమగా ఎలా మారిందో గుర్తు చేసుకున్నారు. తన జీవితంలోని ఆ విశేషాలను వివరించే ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని నవంబర్ 10న విడుదల చేయనున్న నేపథ్యంలో, సోనియా గాంధీ తాజాగా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ వీడియోను పంచుకున్నారు.

విద్యార్థి దశలో ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు తనకు నచ్చిన ఇటాలియన్ ఆహారం దొరికే రెస్టారెంట్ కోసం వెతికేవారని సోనియా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఇప్పటిలా ఎక్కువ రెస్టారెంట్లు ఉండేవి కావని, చివరకు కేంబ్రిడ్జ్‌లోని వర్సిటీ అనే గ్రీకు రెస్టారెంట్ గురించి తెలుసుకున్నామని తెలిపారు. అక్కడ యూరప్‌తో పాటు భారత్‌కు చెందిన విద్యార్థులు కూడా భోజనం చేసేందుకు వచ్చేవారని, అక్కడే ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా రాజీవ్ గాంధీ పరిచయమయ్యారని వివరించారు.

రాజీవ్‌ను మొదటిసారి కలిసినప్పుడే ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనే భావన తనలో కలిగిందని సోనియా చెప్పారు. తనకు కలిగిన భావనే రాజీవ్‌లోనూ ఉందని ఆ తర్వాత తెలుసుకున్నట్లు వెల్లడించారు.

ఆయన అందంగా ఉండటమే కాకుండా, ఎంతో సౌమ్యంగా కనిపించేవారని సోనియా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా రాజీవ్‌లోని ఆ సౌమ్యత తనను ఎంతగానో ఆకట్టుకుందని, తొలి పరిచయంలో తన మనసును తాకిన ఆ లక్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని వివరించారు.

తొలి పరిచయం తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇతర విద్యార్థులతో కలిసి పార్టీలకు వెళ్లడం, వివిధ ప్రాంతాలను సందర్శించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. విద్యార్థులతో కలిసి నిర్వహించిన ఓ వాలెంటైన్స్ పార్టీకి కూడా హాజరైన జ్ఞాపకాలను సోనియా పంచుకున్నారు.

ఈ జ్ఞాపకాలతో పాటు తన జీవిత ప్రయాణాన్ని కూడా సోనియా గాంధీ తన రాబోయే పుస్తకంలో వివరించనున్నారు. చిన్ననాటి జీవితం నుంచి రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, భారత్‌కు రావడం, జీవితంలో ఎదురైన వ్యక్తిగత నష్టాల వరకు పలు అంశాలు ఇందులో ఉండనున్నాయి. నవంబర్ 10న విడుదల కానున్న ఈ పుస్తకం ద్వారా తన వ్యక్తిగత జీవితంలోని మరిన్ని విశేషాలను పాఠకులతో పంచుకోవాలని సోనియా గాంధీ భావిస్తున్నారు.

Read More
Next Story