ఉద్యోగుల ‘డూప్లికేట్’ మోసం ఇలా జరిగుండచ్చా ?
ఒక్కో ఉద్యోగి రు. 1.5 లక్షల నుండి రు. 5 లక్షల వరకు మూడునెలలపాటు అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలో రెండు జీతాలను డ్రా చేసుకున్నారన్న విషయం సంచలనంగా మారింది
ప్రభుత్వ శాఖల్లో బయటపడిన తాజా మోసానికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలా ? అవుననే అన్నారు స్టేట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసిన రిటైర్ అయిన ఎం అరుణా శంకర్. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ప్రభుత్వంలోని విద్యాశాఖ, రెవిన్యు, పంచాయితీరాజ్, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల్లో జరిగిన డూప్లికేట్ ఉద్యోగుల మోసానికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతగా చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే పైన చెప్పిన ఐదు శాఖల్లోని 40మంది పెద్ద ఉద్యోగులు తమ శాఖతో పాటు మరో శాఖలో కూడా జీతాలు తీసుకున్నారు. ఈ విషయం ఫైనాన్స్ శాఖలోని ఇంటర్నల్ ఆడిటింగ్ లో బయటపడింది.
ఒక్కో ఉద్యోగి రు. 1.5 లక్షల నుండి రు. 5 లక్షల వరకు మూడునెలలపాటు అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలో రెండు జీతాలను డ్రా చేసుకున్నారన్న విషయం సంచలనంగా మారింది. దీనిపైన చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజూ విచారణ చేయిస్తున్నారు. విచారణలో ఇంకెమంది డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నారో అన్న విషయం బయటపడతుంది. మరో ఐదురోజుల్లో విచారణ పూర్తవబోతోంది. అప్పుడు ఆ నివేదికలో ఏముందన్నది మరో సంచలనం అవుతుందేమో చూడాలి. శంకర్ చెప్పిన దానిప్రకారమైతే ఒకే ఉద్యోగి తాను పనిచేస్తున్న శాఖతో పాటు మరో ప్రభుత్వ శాఖలో జీతం తీసుకోవటానికి అవకాశం దాదాపులేదు.
ఎందుకంటే కంప్యూటరీకరణ అయిపోయిన ప్రస్తుత నేపధ్యంలో ఒకే పేరు, ఒకే ఆధార్ కార్డు నెంబర్, ఒకే ఇన్షియల్ తో రెండు చోట్ల జీతాలు తీసుకునే అవకాశం లేదు. సాఫ్ట్ వేర్ రెజెక్ట్ చేస్తుందని శంకర్ చెప్పారు. అయితే 40 మంది రెండు చోట్ల జీతాలు తీసుకున్నది వాస్తవం. శంకర్ ప్రకారం సదరు ఉద్యోగులు తాము పనిచేస్తున్న శాఖతో పాటు వేరే కార్పొరేషన్ పరిధిలో రెండో జీతం డ్రా చేసి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వం నుండి కొన్ని కార్పొరేషన్లకు ట్రెజరీతో సంబంధం లేకుండా పర్సనల్ డిపాజిట్ ఖాతాలో డబ్బులు పడతాయి అని చెప్పారు. అలాంటి ఏవైనా కార్పొరేషన్లలో సదరు ఉద్యోగులు రెండో జీతం తీసుకునేందుకు ఎక్కువ అవకాశం ఉందని శంకర్ వివరించారు. మరి చీఫ్ సెక్రటరీ చేయిస్తున్న విచారణలో ఏ విషయాలు బయటపడతాయో చూడాలి.

