
హైదరాబాద్ లో వడగాలుల ప్రభావం : ఎండ దెబ్బ
భానుడి భగభగ :తెలంగాణలో వడదెబ్బకు 9 మంది మృత్యువాత
వడగాలుల విజృంభణ…పెరుగుతున్న మృతులు
తెలంగాణ రాష్ట్రాన్ని మండుతున్న ఎండలు ముంచెత్తుతున్నాయి. తీవ్ర వడగాలుల ప్రభావంతో వృద్ధులు, కూలీలు, రైతులు అల్లాడుతుండగా ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి తీవ్రతరమవుతుండటంతో ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగింది.
తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బతో వృద్ధులు అల్లాడుతున్నారు. రోజురోజుకు తీవ్ర వడగాలుల ప్రభావం వల్ల వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. వడదెబ్బ బారిన పడిన వారికి తక్షణం మెరుగై వైద్య చికిత్స అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా వైద్యాధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఒక వైపు ఊరూరా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బ బాధితుల చికిత్సకు వైద్యశాఖ యంత్రాంగాన్ని సంసిద్ధం చేశారు.
పశువుల కాపరి మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని యాదవనగర్ కు చెందిన పశువుల కాపరి ఎస్ వెంకటనారాయణ (55) వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. గేదెలను మేతకు తీసుకువెళ్లిన వెంకటనారాయణ వడదెబ్బకు గురవడంతో అతన్ని ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మంలం అంచనూరుకు చెందిన జి మారుతి (70) ఎండవేడిమికి మరణించాడు.
రైతు మృత్యువాత
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో వడదెబ్బకు గురైన రైతు అంతటి స్వామి (50) మృతి చెందారు.హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ కు చెందిన బరిగె శోభ(45) వ్యవసాయ పనికి వెళ్లి ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైంది. పొలం నుంచి ట్రాక్టరులో ఇంటికి వెళ్లగానే వడెదబ్బతో మృత్యువాతపడింది. కాజీపేటకు చెందిన ఎండీ అఫ్జల్ (28) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లె గ్రామానికి చెందిన జి వినయ్ కుమార్ (38) ఎండదెబ్బకు మరణించాడు.
వడదెబ్బతో కుప్పకూలిన కూలీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేసీఆర్ నగర్ కు చెందిన బానోతు భద్రు (57) ఎండలో సుతారి కూలీగా పనిచేస్తుండటంతో అతనికి వడదెబ్బ సోకింది. భద్రును ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే పరిస్థితి విషమించి మృతి చెందారు. తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పులి సత్యనారాయణ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి వడదెబ్బ బారిన పడి కుప్పకూలి మరణించాడు. పాల్వంచలోని కరకవాగు ప్రాంతానికి చెందిన చంద్రవేఖర్ (30) వడదెబ్బతో ప్రాణాలు విడిచాడు.
రాష్ట్ర విపత్తుగా వడగాలులు
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నుంచి వడగాలులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రకటించి, బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షల సహాయాన్ని అందిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, వృద్ధులతో సహా బలహీన వర్గాల ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (టీఎస్‌డీపీఎస్) వడగాలుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది.చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాుట ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ప్యాకెట్లను పంపిణీ చేశారు. మధ్యాహ్నం పూట తీవ్రమైన వేడి ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు.వడదెబ్బ మృతుల కుటుంబాలు ప్రభుత్వ పరిహారం పొందాలంటే మృతుని పోస్టుమార్టం నివేదిక, ఎఫ్ఐఆర్ (FIR) కాపీ, వాతావరణ శాఖ ధృవీకరణ పత్రం తప్పనిసరి అని అధికారులు చెప్పారు.
తెలంగాణలో హీట్ వేవ్ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు చెప్పారు. గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 17వతేదీన నారాయణపేట, జోగులాంబ గద్వాల్,ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఐఎండీ అధికారులు హీట్ వేవ్ అలెర్ట్ జారీ చేశారు.ఈ నెల 18వతేదీన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు. మూడు రోజులపాటు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఐఎండీ సూచించింది.
గుడిపల్లిలో అత్యధిక ఉష్ణోగ్రతలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుడిపల్లి మండలం ఘన్ పూర్ లో తెలంగాణలోనే అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లాలోని 112 ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ముల్కచర్ల, కోదండపురం, శివన్నగూడెం, బుగ్గబావిగూడెం, నాంపల్లి, ఉరుమడ్లరోడ్డు, నకిరేకల్, యాచారం, కామారెడ్డి గూడెం గ్రామాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి.
ఆదిలాబాద్ జిల్లాల్లో భగభగమంటున్న భానుడు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భానుడు భగభగ మంటున్నాడు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.
గ్రామాల్లో చలివేంద్రాలు
ఈ వేసవికాలంలో వడగాలుల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్వ దేవరాజన్ అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించారు.మండలకేంద్రాలు, గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
వడగాలుల నుంచి ఉపశమనం : తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడి
తెలంగాణలో మండే ఎండలు, తీవ్రమైన వడగాలుల ధాటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు తెలంగాణ వెదర్ మ్యాన్ శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 18 లేదా 19 వతేదీ నుంచి పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో మొదలై ఏప్రిల్ 20 నుంచి 24వతేదీల మధ్య తెలంగాణలోని చాలా ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ఈ వర్షాలు ప్రధానంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కురుస్తాయని, సాయంత్రం వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ వివరించారు.ఏప్రిల్ 19 నుంచి 23 మధ్య హైదరాబాద్‌లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, ఎండ వేడి నుండి ఉపశమనం లభించనుందని వెదర్ మ్యాన్ తెలిపారు.వేడిగాలుల కారణంగా ఇంటి నుంచి పని చేసేలా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కోరుతున్నారు.
వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. పెద్ద హాస్పిటల్స్‌లో ప్రతి బ్లాక్‌లో, ప్రతి ఫ్లోర్‌లో డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్ ఆవరణలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఐసీయూలు, అవసరమైన ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు.
వడ దెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామని, అవసరమైన మెడిసిన్, ఓఆర్‌ఎస్ వంటివి అందుబాటులో ఉంచామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వివరించారు.
ఎమర్జన్సీలో డెడికేటెడ్ టీమ్ ఉండాలి
వడ దెబ్బతో అనారోగ్యం పాలైన వారికి చికిత్స అందించేందుకు ఒక బృందాన్ని హాస్పిటల్ ఎమర్జన్సీ ఏరియాలో సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు. పేషెంట్ వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించేలా ఈ బృందంలోని సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైన మెడిసిన్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.వేసవి కాలంలో గాలిదుమారాలు, ఈదురు గాలులు, అకాల వర్షాల వలన విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంటుందని, ఇలాంటి సమయాల్లో పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వెంటనే జనరేటర్లు ఆన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా వడ దెబ్బ తగిలితే, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు బాధితున్ని తరలించాలని, 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయాలని మంత్రి ప్రజలను కోరారు.
మండే ఎండలు, ప్రాణాలు తీస్తున్న వడగాలుల మధ్య తెలంగాణలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజల అప్రమత్తతే ప్రాణాలను కాపాడగలదు. “ఎండను తక్కువగా అంచనా వేయొద్దు” అనే హెచ్చరికను ప్రతి ఒక్కరూ గంభీరంగా తీసుకోవాల్సిన సమయం ఇదే.
Next Story

