
కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారు: సీజేపీ
నిబంధనల ప్రకారమే వెళ్తున్నామన్న ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు వెళ్లిన ఇద్దరు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల విడుదల వ్యవహారం మరో వివాదానికి దారితీసింది. సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా విడుదలను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని సీజేపీ ఆరోపించింది. బెయిల్ ప్రక్రియలో పదేపదే అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదు చేసినప్పటికీ అస్పష్టమైన కారణాలతో బెయిల్ పూచీకత్తులను తిరస్కరించారని కూడా ఆరోపించింది. అయితే, నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
నిరసన ప్రదర్శనల స్థలం జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించినప్పటికీ అక్కడికి వెళ్లడానికి సీజేపీ నాయకులు ప్రయత్నించారు. దాంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఐదు రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపారు.
ఆ తర్వాత వారి విడుదల కోసం పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. బెయిల్‌కు అవసరమైన పూచీకత్తు పత్రాలను సమర్పించినప్పటికీ, అధికారులు వివిధ కారణాలతో వాటిని తిరస్కరిస్తున్నారని సీజేపీ న్యాయ విభాగం ఆరోపించింది. బ్యాంకు ధ్రువీకరణ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారని, పూచీకత్తు ఇచ్చే వ్యక్తుల ఢిల్లీ చిరునామాల విషయంలోనూ సమస్యలు లేవనెత్తారని పేర్కొంది.
అక్టోబర్ 18న జరగాల్సిన విచారణ మధ్యాహ్నం 12 గంటలకు బదులుగా సాయంత్రం వరకు ఆలస్యమైందని సీజేపీ న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్ ఆరోపించారు. ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయంత్రం 5.30 గంటల సమయంలో వచ్చారని తెలిపారు. అయితే, ఇద్దరు నేతల విడుదలపై చర్చించాల్సిన సమయంలో మేజిస్ట్రేట్‌కు వచ్చినట్లు చెబుతున్న బెదిరింపు సందేశం అంశం తెరపైకి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
మేజిస్ట్రేట్‌కు బెదిరింపులు వచ్చినట్లయితే, వాటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమ న్యాయవాదులు కోరినప్పటికీ, ఆ విజ్ఞప్తులను పట్టించుకోలేదని రత్నా సింగ్ ఆరోపించారు. ఈ సందేశానికి దాస్, రంకా విడుదల ప్రక్రియతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
మరోవైపు, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఫిర్యాదు అందడంతో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పూచీకత్తు పత్రాల్లో లోపాలు ఉన్నందున వాటిని అంగీకరించలేదని, చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. విడుదలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాత్రం తమ నేతలను అక్రమంగా నిర్బంధంలో ఉంచేందుకు అధికారులు జాప్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన మార్గాలను అనుసరిస్తామని పార్టీ ప్రకటించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సీజేపీ ఇప్పటికే నిరసనలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో తమ నేతల విడుదల వ్యవహారం పార్టీకి, ఢిల్లీ అధికారులకు మధ్య వివాదాన్ని మరింత పెంచింది. దాస్, రంకా విడుదలపై తదుపరి పరిణామాలు న్యాయపరమైన ప్రక్రియతో పాటు పోలీసుల విచారణపై ఆధారపడి ఉండనున్నాయి.
Next Story

