
ఎఫ్ - 35 దగ్గరకు కూడా మమ్మల్ని వెళ్లనివ్వరు: ఐఏఎఫ్ చీఫ్
తరంగ్ శక్తి ప్రదర్శన సందర్భంగా యూఎస్ ప్రతినిధి ముందే విమర్శలు
భారత వైమానిక దళం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శనివారం యూఎస్ పై విమర్శలు గుప్పించారు. ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ లను భారత్ కు విక్రయించేందుకు అమెరికా ఎలాంటి ప్రతిపాదన చేయలేదని మీడియాకు స్పష్టం చేశారు. అమెరికా తన ఎఫ్ -35 విమానాల దగ్గరకు భారత అధికారులను రానివ్వలేదని ఆయన వ్యంగ్యంగా చెప్పారు.
జోధ్ పూర్ లో జరిగిన తరంగ్ శక్తి- 2026 ముగింపు సందర్భంగా యూఎస్ వైమానిక దళానికి చెందిన పసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ కెవిన్ ష్నైడర్ తో కలిసి వేదికను పంచుకున్న సందర్భంగా సింగ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
‘‘మీ వాళ్లు మిమ్మల్ని విమానం దగ్గరికు కూడా వెళ్లనివ్వడం లేదు. అలాంటిది మీర దాన్ని మాకు అమ్మడం గురించి మాట్లాడుతున్నారు’’ అని అతను అన్నారు.
ఎఫ్ - 35 ప్రపంచంలోనే అత్యంత అధునాతన, శక్తివంతమైన యుద్ధ విమానంగా చెప్తారు. తరంగ్ శక్తి విన్యాసాలలో ఆరు ఎఫ్ 35 లైట్నింగ్- II యుద్ధ విమానాలు, 200 మందికి పైగా వైమానిక సిబ్బంది తొలిసారిగా పాల్గొన్నారు.
ఎస్ యూ- 57 విమానంపై ఇంకా నిర్ణయం..
రష్యా ఐదో తరం ఎస్ 57 యుద్ధ విమానాన్ని భారత్ కొనుగోలు చేసే అవకాశం గురించి కూడా ఐఎఎఫ్ అధిపతి ప్రస్తావించారు. రష్యా ఒక ప్రతిపాదన చేసిందని తమ దృష్టికి తీసుకు వచ్చిందని, అయితే ఆ విమానాన్ని మూల్యాంకనం చేయాలా వద్దా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేము మాకు నిర్ణయం తెలియజేసిన తరువాత అది(ఎస్ యూ 57) మా అవసరాలను ఎంతవరకూ తీరుస్తుందో మేము అంచనా వేస్తాము’’ అని ఆయన అన్నారు.
స్వయం సమృద్ధి దృష్టి..
రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను బలోపేతం చేసేందుకు, భారత్ తన దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా, భవిష్యత్ యుద్ద విమానాల అవసరాలను అంచనా వేస్తూ, స్వంత ఐదో తరం యుద్ధ విమానాల అభివృద్ధిని కొనసాగిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
తరంగ్ శక్తి 2026 భారత వైమానిక దళాన్ని, భారత తో సహ ఎనిమిది దేశాలకు చెందిన విదేశీ వైమానిక దళాలను ఒక చోట చేర్చి, కార్యాచరణ సహకారానికి, వృత్తిపరమైన అనుభవాల మార్పిడికి ఒక వేదికను అందించింది.
Next Story

