
బెనిఫిట్స్ అందక అల్లాడిపోతున్న వేలాదిమంది రిటైర్డ్ ఉద్యోగులు
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అందాల్సిన రకరకాల బిల్లులు, బకాయిలు సుమారు రు.12 వేలకోట్ల బకాయిలు పేరుకుపోయాయి
*రెవిన్యు శాఖలో రామయ్య ఎంఆర్వోగా పనిచేసి 2024, ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. రామయ్యకు ప్రతినెలా పెన్షన్ అందుతోంది కాని ఇతరత్రా ఆర్ధిక బెనిఫిట్స్ సుమారు రు. 70 లక్షలు ఇంకా అందలేదు. ఎప్పటికి అందుతాయో కూడా తెలీదు.
*టీచర్ గా పనిచేసిన రామకృష్ణయ్య 2024 ఏప్రిల్ నెలలో రిటైర్ అయ్యారు. ఈయనకు కూడా ప్రతినెలా పెన్షన్ అందుతోంది కాని ఇతర బెనిఫిట్స్ సుమారు 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.
*పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న కృష్ణమూర్తి జీపీఎఫ్ నుండి రు. 6 లక్షలు కావాలని, ఎర్న్ లీవ్ నుండి రు. 1 లక్ష కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుని ఆరుమాసాలైంది. ఇప్పటివరకు అర్జీకి అతిగతీలేదు.
ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్న ప్రభుత్వం బిల్లులు బెనిఫిట్స్ మాత్రం ఎందుకు చెల్లించటంలేదు ? ఎందుకంటే వేలాది కోట్లరూపాయలు అవసరం కాబట్టే. ప్రభుత్వ ఖజనాలో డబ్బులేదు కాబట్టే ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ రేవంత్ ప్రభుత్వం పెండింగులో పెట్టేసింది. మరీ సమస్యకు పరిష్కారం ఏమిటి ? పరిష్కారం కనుచూపుమేరలో ఎక్కడా కనబడటంలేదు.
*తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే రు. 5.75 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి.
*మూసీనది బ్యూటిఫికేషన్ కోసం రు. 20 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటన
*మెట్రో ప్రాజెక్టు నిర్వహణకు ఎన్నివేల కోట్లయినా ఖర్చుచేసి ప్రభుత్వమే నిర్వహిస్తుంది..
*కోటిమంది మహిళలను ప్రభుత్వం కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది..
ఈ ప్రకటనలన్నీ ఏమిటో అనుకుంటున్నారా ? రేవంత్ మాట్లాడితే లక్షల కోట్లరూపాయలు, వేల కోట్లరూపాయలకు తగ్గటంలేదు. ‘ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీమోత’ అన్నట్లుగా ఉంది రేవంత్ ప్రభుత్వవ్యవహరం. ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులే కొండంతబలం. అలాంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్ధిక అంశాలే అస్తవ్యస్ధంగా తయారయ్యాయి. ఇపుడు విషయం ఏమిటంటే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు, పెన్షన్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం బిల్లులను మాత్రం చెల్లించటంలేదు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అందాల్సిన రకరకాల బిల్లులు, బకాయిలు సుమారు రు.12 వేలకోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈబిల్లులు క్లియర్ అవ్వాలంటే సంవత్సరాలుపట్టడం ఖాయం. మరి అప్పటివరకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పరిస్ధితి ఏమిటి ?
తమ పరిస్ధితి ఏమిటో తెలీకే లక్షలమంది ఉద్యోగులు తలలు బాదుకుంటున్నారు. ఉద్యోగులు సుమారు 3.5 లక్షలమంది రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 2.5 లక్షలమంది ఉంటారు. సుమారు 6 లక్షలమంది రకరకాల ఆర్ధిక అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పై చదువులకని, వివాహాలకని, ఆపరేఫన్లకు, ఇళ్ళ కొనుగోలు తదితర అవసరాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో నుండే ఖర్చు పెట్టాలని అనుకున్న వేలాదిమందికి ప్రస్తుత పరిస్ధితి మింగుడుపడటంలేదు. రిటైర్మెంట్ సందర్భంగా అందాల్సిన బెనిఫిట్స్ ఏవీ రాకపోవటంతో అంతకుముందు ఉద్యోగంలో ఉన్నపుడు వేసుకున్న ప్రణాళికలన్నీ తల్లకిందులైపోయాయి. మాట్లాడితే లక్షల కోట్లు, వేలాది కోట్లని చెబుతున్న రేవంత్ ప్రభుత్వానికి ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, బెనిఫిట్స్ ను క్లియర్ చేయటం తలకుమించిన భారమైపోయింది.
సమస్య ఎక్కడ మొదలైంది ?
రేవంత్ ప్రభుత్వానికి అసలు ఈ సమస్యంతా ఎక్కడ మొదలైంది ? ఎక్కడంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే మొదలైంది. ఎలాగంటే 2021 లేదా అంతకుముందు రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రూపంలో చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయలు సర్దుబాటు చేయటం కేసీఆర్ కు కష్టమైంది. అందుకని ఏమిచేశారంటే 2021లో రిటైర్ అవ్వాల్సిన ఉద్యోగుల విరమణ వయస్సును మరో 3 ఏళ్ళు పెంచారు. ఉద్యోగుల రిటైర్మెంట్ 58 ఏళ్ళ నుండి 61 ఏళ్ళకు పెరిగింది. దాంతో ప్రభుత్వానికి రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయల బెనిఫిట్స్ భారం తగ్గిపోయింది. అప్పట్లో మూడేళ్ళ రిటైర్మెంట్ సర్వీసు పెరిగిన ఉద్యోగుల్లో చాలామంది 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్ అయ్యారు. దానివల్ల ఏమయ్యిందంటే ఉద్యోగులకు చెల్లించాల్సినే వేలాది కోట్ల భారం రేవంత్ ప్రభుత్వం మీదపడింది. అప్పటికే పెండింగులో ఉన్న రకరకాల బిల్లులు, అస్తవ్యస్ధంగా తయారైన ఆర్ధిక పరిస్ధితి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించలేకపోయింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనికారణంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటి, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, జీపీఎఫ్, కమ్యుటేషన్ అన్నింటినీ పెండింగులో పెట్టేసింది.
ప్రతినెలా ఉద్యోగులు రిటైర్ అవుతునే ఉంటారు. అలాగే ఉద్యోగులు ఏవో కారణాలతో జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్ ను సరెండర్ చేసి డబ్బులు కావాలని అర్జీలు పెట్టుకుంటునే ఉంటారు. ఉద్యోగులు అర్జీలు పెట్టుకోవటమే కాని ప్రభుత్వం మాత్రం వేటినీ క్లియర్ చేయటంలేదు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాల మీదకు వచ్చినపుడు ఆసుపత్రుల్లో ముందు ఖర్చులు పెట్టుకుని తర్వాత ప్రభుత్వానికి బిల్లులను రీఎంబర్స్ చేసుకోవాల్సిందే. అలాంటి మెడికల్ రీఎంబర్స్ మెంట్ లేదా ఉద్యోగుల ఆసుపత్రుల బిల్లులను కూడా ప్రభుత్వం క్లియర్ చేయలేకపోతోంది. 2023, డిసెంబర్ నుండి 2025, డిసెంబర్ మధ్యలో రిటైర్ అయినవాళ్ళకే బెనిఫిట్స్ సమస్యలంతా.
జనవరిలో ఆందోళన తప్పదు : గుంటకళ్ళ
ఇదే విషయమై రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటకళ్ళ దామోదర్ రెడ్డి ఏమన్నారంటే 2023 డిసెంబర్ నుండి ఇప్పటివరకు సుమారు 20 వేలమంది రిటైర్ అయ్యుంటారని చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ ఉద్యోగులు 3.5 లక్షలమంది, రిటైర్డ్ ఉద్యోగులు 2.86 లక్షలు ఉన్నారు’’ అని చెప్పారు. ‘‘సమస్యంతా 2023 డిసెంబర్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకే’’ అని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు సుమారు రు. 12 వేల కోట్లు ఉంటుంది’’ అని చెప్పారు. పెండింగ్ బిల్లులు, బెనిఫిట్స్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రతినెలా రు 700 కోట్లు ఇస్తున్నాఏమాత్రం సరిపోవటంలేదు’’ అని అసంతృప్తి వ్యక్తంచేశారు.
‘‘2023 డిసెంబర్ తర్వాత సుమారు 20 వేలమంది రిటైర్ అయ్యుంటారు, జీపీఎఫ్, మెడికల్ బిల్స్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, కమ్యూటేషన్ అంతా కలిపి సుమారు రు. 12 వేల కోట్లు పెండింగులో ఉంది’’ అని అన్నారు. ‘‘బిల్లులు, బెనిఫిట్స్ క్లియర్ చేయటానికి నెలకు రు. 700 కోట్లు గడచిన ఆరుమాసాల నుండి మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది’’ అని గుర్తుచేశారు. ‘‘నెలకు రు. 700 కోట్లు ఇస్తే వేలకోట్ల రూపాయల బకాయిలు మొత్తం చెల్లించాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుందో’’ అని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘బకాయిల క్లియరెన్స్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ను మూడుసార్లు కలిసినా ఉపయోగం కనబడలేదు’’ అని చెప్పారు. ‘‘2025 మార్చికే బెనిఫిట్స్ అన్నీ క్లియర్ చేస్తానని అక్టోబర్, 2024 లో ఇచ్చిన హామీని సీఎం నిలుపుకోలేదు’’ అని అన్నారు. కలిసాము. బకాయిల క్లియరెన్స్ కోసం జనవరిలో ఆందోళనలు మొదలుపెట్టాలని అనుకుంటున్నాము’’ అని చెప్పారు.
దాదాపు రు. కోటి చెల్లించాలి : మేదరమెట్ల
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, మేదరమెట్ల సుబ్బయ్య మాట్లాడుతు 2023, డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ మాత్రమే ఇచ్చింది’’ అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగులో ఉన్నవి కలుపుకుని మొత్తం ఆరు డీఏలు ప్రభుత్వం బకాయిపడింది’’ అని అన్నారు. 2024, మార్చిలో రిటైర్ అయినవాళ్ళకు గ్రాట్యుటి, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, జీపీఎఫ్, కమ్యుటేషన్ బకాయిలు పేరుకుపోయాయి’’ అని చెప్పారు. ‘‘ఒక్కో ఉద్యోగికి సుమారు 80 లక్షల నుండి రు. 1.5 కోట్లవరకు బెనిఫిట్స్ పెండింగులో ఉన్నాయి’’ అని వివరించారు. ఆరుమాసాల ముందే ఇచ్చేయాల్సిన జీపీఎఫ్, ఎర్న్ లీవ్ ను కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదు’’ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘పెన్షన్లు ప్రతినెలా రెగ్యులర్ గా వస్తోంది’’ అని చెప్పారు.
‘‘2018 పీఆర్సీ బెనిపిట్స్ 1-4-2020లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది’’ అని గుర్తుచేశారు. ‘‘1-7-2023 నుండి పీఆర్సీ వర్తింపచేయలేదు’’ అన్నారు. ‘‘2023-28కి మరో పీఆర్సీ వచ్చేస్తుంది’’ అని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే దిగిపోయింది’’ అని ఆరోపించారు. ‘‘రేవంత్ ప్రభుత్వం నెలకు రు. 700 కోట్లిస్తున్నా అదంతా మెడికల్ బిల్స్, ఎరియర్స్ చెల్లించేందుకు నెలకు రు. 350 కోట్లు సరిపోతోంది’’ అన్నారు.
జీతాలే ఇంకా అందలేదు : బాపనపల్లి
రిటైర్డ్ ఉద్యోగుల బకయిలు, ఉద్యోగుల బిల్లుల సమస్య ఇలాగుంటే కొందరు ఉద్యోగులకు అసలు జీతాలే ఇంకా అందలేదు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాపనపల్లి నరహరి, కోశాధికారి డాక్టర్ రవూఫ్ మాట్లాడుతు ‘‘సుమారు 700 మంది ఉద్యోగులకు నవంబర్ నెల జీతం ఇంకా అందలేదు’’ అన్నారు. వైద్య విధాన పరిషత్ డాక్టర్లు, పారామెడికల్ తదితర ఉద్యోగులు సుమారు 7 వేలమంది ఉన్నారు అని చెప్పారు. వీరిలో దశలవారీగా చాలామందికి నవంబర్ నెల జీతాలు అందినా ఇంకా 10 శాతంమందికి జీతాలు అందలేదు’’ అని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘టీజీవీవీపీ ఉద్యోగులకు జీతాల చెల్లింపుకోసం ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ(ఆస్కీ) నిపుణులతో కమిటి వేసింది’’ అని చెప్పారు. ఆస్కీ రిపోర్టును అములు చేయాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము’’ అని నరహరి అన్నారు.
ఏడాది క్రితమే ఆస్కీ రిపోర్టుఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం రిపోర్టును ఎందుకు అమలుచేయలేదు’’ అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర ట్రెజరీ నుండే అందరికీ జీతాలు చెల్లించాలనే ప్రయత్నంలో సమస్యలు వచ్చిన కారణంగానే జీతాలు ఆలస్యమైనట్లు మాకు సెక్రటరీ, డైరెక్టర్ చెప్పారు’’ అని తెలిపారు. జీతాల చెల్లింపు విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారంగా ఆస్కీ రిపోర్టులో చెప్పినట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ కు జీతాల ఖాతాలను మార్చాలి అని డాక్టర్ నరహరి, రవూఫ్ డిమాండ్ చేశారు.


