
హెరిటేజ్ అందానికి హై-రైజ్ ముప్పు... 35 అంతస్తుల భవనం.. వివాదం!
GHMC అనుమతులు నిబంధనలకు అనుగుణంగా ఇచ్చిందా?
1) హెరిటేజ్ అందానికి హై-రైజ్ ముప్పు... 35 అంతస్తుల భవనం.. వివాదం!
2) మేడిగడ్డ మళ్లీ కట్టాల్సిందే! ఏడో బ్లాక్ కూల్చివేత!
1) హెరిటేజ్ అందానికి హై-రైజ్ ముప్పు... 35 అంతస్తుల భవనం.. వివాదం!
హైదరాబాద్‌లోని చారిత్రక మొజంజాహీ మార్కెట్ సమీపంలో నిర్మిస్తున్న మీనాక్షి ఎలీసియా 35 అంతస్తుల భవనం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్మాణానికి జారీ చేసిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన నిబంధనలు పాటించకుండానే అనుమతులు ఇచ్చారని పిటిషనర్ ఆరోపించగా, సంబంధిత అధికారుల నుంచి అనుమతులు, NOCలు పొందినట్లు నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది వాదించారు.
హైదరాబాద్‌లోని అబిడ్స్–గన్‌ఫౌండ్రీ ప్రాంతంలో మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 2022 ఆగస్టు 23న నిర్మాణ అనుమతి ఇచ్చింది. ఈ అనుమతులను సవాలు చేస్తూ సొసైటీ ఫర్ క్రూసేడ్ ఎగైనెస్ట్ కరప్షన్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అవసరమైన నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇచ్చారని, నిర్మాణాన్ని నిలిపివేయాలని పిటిషనర్ కోరారు.
హైకోర్టులో వ్యక్తమైన ప్రధాన అభ్యంతరాలు
1. చారిత్రక మొజాంజాహీ మార్కెట్ సమీపంలో భారీ భవనమా? మొజాంజాహీ మార్కెట్ వంటి చారిత్రక కట్టడం సమీపంలో 35 అంతస్తుల భవనానికి అనుమతి ఎలా ఇచ్చారనే అంశంపై న్యాయమూర్తి ప్రశ్నలు లేవనెత్తారు. ఇంత భారీ నిర్మాణం ఆ ప్రాంతంపై చూపే ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
2. GHMC అనుమతులు నిబంధనలకు అనుగుణంగా ఇచ్చిందా? 2022లో నిర్మాణ అనుమతి ఇచ్చే సమయంలో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు, భవన నిర్మాణ నిబంధనలు పూర్తిగా పాటించారా అనే అంశాన్ని పిటిషనర్ ప్రశ్నించారు.
3. రోడ్డు వెడల్పు సరిపోతుందా?35 అంతస్తుల భవనానికి అవసరమైన రాకపోకల సదుపాయాలు ఉన్నాయా? భవనం వద్దకు చేరుకునే రహదారుల వెడల్పును అధికారులు సరిగ్గా పరిశీలించారా? అనే ప్రశ్నలను హైకోర్టు లేవనెత్తింది.
4. నిర్మాణం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా?భవనం నిర్మాణ స్థిరత్వం, పునాది సామర్థ్యం, పరిసర ప్రాంతాల భద్రతకు సంబంధించిన అంశాలను అనుమతులు ఇచ్చే ముందు తగిన విధంగా పరిశీలించారా అనే ప్రశ్నలు వచ్చాయి.
5. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా?ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అవసరమైన పర్యావరణ అనుమతులను GHMC పరిశీలించిందా అనే ప్రశ్నను కూడా హైకోర్టు లేవనెత్తింది.
6. నిర్మాణ సమయంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? పిటిషనర్ తరఫు న్యాయవాది నిర్మాణ సమయంలోనూ ఉల్లంఘనలు జరిగినట్లు కోర్టుకు తెలిపినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
7. నిర్మాణాన్ని నిలిపివేయాలా?పిటిషనర్ తరఫు సంస్థ నిబంధనలపై స్పష్టత వచ్చే వరకు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరింది. అదే సమయంలో, ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, నిరభ్యంతర పత్రాలు పొందినట్లు నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. నిర్మాణ సంస్థ వాదన ఏమిటి?నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు, NOCలు తీసుకున్న తర్వాతే పనులు చేపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు. కాబట్టి అనుమతులు చట్టవిరుద్ధమని తుది నిర్ణయానికి రావడానికి ముందు ఇరుపక్షాల వాదనలు, అధికారిక రికార్డులను పరిశీలించాల్సి ఉంటుంది.
విచారణలో హైకోర్టు ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి మరో పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉన్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో సంబంధిత పిటిషన్లను కలిపి విచారించేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను 2026 అక్టోబర్ 29కు వాయిదా పడింది.
హైదరాబాద్ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన "మొజాంజాహీ మార్కెట్ పక్కనే ఇంత ఎత్తైన భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చే ముందు.. ఆ ప్రాంత చారిత్రక ప్రాధాన్యాన్ని అధికారులు ఎంతవరకు పరిగణనలోకి తీసుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మొజాం జా పేరుతో నిర్మించిన ఈ మార్కెట్‌కు హైదరాబాద్ నగర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని" INTACH హైదరాబాద్ కన్వీనర్ పి. అనురాధా రెడ్డి ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు. “అభివృద్ధి పేరుతో చరిత్ర మరుగున పడకూడదు.. చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూనే నగరం ముందుకు సాగాలి!”.
1) మేడిగడ్డ మళ్లీ కట్టాల్సిందే! ఏడో బ్లాక్ కూల్చివేత!
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో మరో సంచలన నిర్ణయం! దెబ్బతిన్న ఏడో బ్లాక్‌కు మరమ్మతులు చేస్తే సరిపోదని.. ఆ బ్లాక్‌ను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో కొత్తది నిర్మించడమే మంచిదని సాంకేతిక నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
అసలు సమస్య ఏమిటంటే, 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లోని కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి. బ్యారేజీ అడుగు భాగమైన రాఫ్ట్ కూడా నదీ గర్భంలోకి కుంగిపోయింది. బ్యారేజీకి ఆధారంగా నిలిచే పిల్లర్లు దెబ్బతినడంతో నిర్మాణ భద్రతపై తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో మరమ్మతులు ఎలా చేయాలి? దెబ్బతిన్న భాగాలను బాగుచేస్తే సరిపోతుందా? లేక పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలా? అనే అంశాలను పరిశీలించేందుకు సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీలోని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేయడం కంటే.. బ్లాక్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించడమే మెరుగైన మార్గమని కమిటీ నిర్ధారణకు వచ్చింది. దీని కోసం దెబ్బతిన్న పిల్లర్లను సాధారణంగా సుత్తులతో కొట్టి తొలగించడం కాకుండా.. డైమండ్ సా అనే ప్రత్యేక కట్టింగ్ పరికరంతో కత్తిరించి తొలగించనున్నారు. ఆతర్వాత కొత్త నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సిద్ధం చేసి, నిపుణులతో పరిశీలింపజేసి ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. ఈ డిజైన్లను 15 రోజుల్లోగా సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే, ఇది మొత్తం మేడిగడ్డ బ్యారేజీని కూల్చివేయడం కాదు. ప్రధానంగా దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ను తొలగించి, తిరిగి నిర్మించాలన్నది ప్రతిపాదన.
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి రావడంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీల పునరుద్ధరణకు కలిపి సుమారు రూ.2,100 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల వరకు ఖర్చు కావచ్చని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ మొత్తాలు ప్రాథమిక అంచనాలే. తుది డిజైన్లు, అధికారిక వ్యయ అంచనాలు ఆమోదం పొందిన తర్వాతే ఖచ్చితమైన ఖర్చు తెలుస్తుంది.
ఈ డబ్బును ఎవరు భరిస్తారు? ప్రభుత్వమే ఖర్చు చేస్తుందా? లేక నిర్మాణ సంస్థల నుంచి వసూలు చేస్తారా? అనేది కూడా కీలకంగా మారింది.అన్నారం, సుందిళ్లలో ఏం చేస్తారు?కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ మాత్రమే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కూడా కీలకమే. ఈ రెండు బ్యారేజీల్లోనూ నీటి ప్రవాహం వల్ల నదీ గర్భం, పునాది ప్రాంతాలపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక నిర్మాణ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా స్టిల్లింగ్ బేసిన్‌ను విస్తరించడం, డయాఫ్రం వాల్ నిర్మించడం వంటి పనులు చేపట్టనున్నారు.
ఇక్కడ స్టిల్లింగ్ బేసిన్ అంటే ఏంటి?బ్యారేజీ గేట్ల నుంచి వేగంగా బయటకు వచ్చే నీటి శక్తిని తగ్గించి, దిగువన ఉన్న నదీ గర్భం దెబ్బతినకుండా కాపాడే ప్రత్యేక నిర్మాణం. ఆ నీటి వేగాన్ని, శక్తిని తగ్గించడానికి డ్యామ్ దిగువన నిర్మించే ఒక కాంక్రీట్ తొట్టి వంటి నిర్మాణాన్ని "స్టిల్లింగ్ బేసిన్" అంటారు. ఇది నీటి వేగాన్ని పూర్తిగా తగ్గించి, డ్యామ్ పునాది భాగం కొట్టుకుపోకుండా కాపాడుతుంది.
అలాగే డయాఫ్రం వాల్ అనేది పునాది ప్రాంతంలో నీటి ప్రవాహం, మట్టి కోత వంటి సమస్యలను నియంత్రించేందుకు నిర్మించే ప్రత్యేక అడ్డుగోడ. ఇది భూమి లోపల నిర్మించే ఒక బలమైన కాంక్రీట్ రక్షణ గోడ. డ్యామ్‌లు లేదా నది పక్కన ఇసుక పొరలు ఎక్కువగా ఉన్నప్పుడు, భూమి లోపలి నుండి నీరు లీక్ అవ్వకుండా రోధించడానికి దీనిని భూగర్భంలో నిర్మిస్తారు. డ్యామ్ లేదా బ్యారేజ్ కింద నుండి నీరు ఊటలాగా ప్రవహించి, పునాది బలహీనపడకుండా ఇది అడ్డుకుంటుంది. నిర్మాణానికి స్థిరత్వాన్ని ఇస్తుంది.
ఈ పనులు మూడు బ్యారేజీల భద్రతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను తొలగించి తిరిగి నిర్మించడానికి ఏడాది నుంచి రెండేళ్ల వరకు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే, డిజైన్ల ఆమోదం, పనుల ప్రారంభం, నిర్మాణ పురోగతి.. ఇలా అనేక అంశాలపై పూర్తి సమయం ఆధారపడి ఉంటుంది. ఈ బ్యారేజీల పునరుద్ధరణ పూర్తయితేనే వాటిని సురక్షితంగా తిరిగి వినియోగించుకునే దిశగా ముందుకు వెళ్లవచ్చు.అయితే, బ్యారేజీలు బాగుపడటం ఒక్కటే సరిపోదు. నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, విద్యుత్ ఖర్చులు, నిర్వహణ వంటి అంశాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ పనులు ఎంత ఖర్చుతో పూర్తవుతాయి? ఎవరు ఆ ఖర్చును భరిస్తారు? బ్యారేజీలు ఎప్పటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి?

