
తిరుమల AI ప్రయోగం సక్సెస్, భక్తులకు శీఘ్రంగా శ్రీవారి దర్శనం
భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నారాయణగిరి షెడ్ల నుండి క్యూలైన్లు బయటకు రాకుండా సమగ్ర చర్యలు
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతున్నప్పటికీ టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకపాత్ర పోషిస్తోంది.
తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహం వంటి అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
భక్తులు ఏ ప్రాంతంలో ఎక్కువసేపు వేచి ఉండకుండా క్యూ లైన్లను సమతుల్యం చేయడం, అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించడం, తాగునీరు, పాలు, అన్నప్రసాదం, వైద్య సేవలు వేగంగా అందించడం వంటి చర్యలు సమన్వయంతో కొనసాగుతున్నాయి. దీంతో దర్శన సమయ నియంత్రణలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది.
ప్రత్యేకించి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో భక్తుల రద్దీని డిజిటల్ మానిటరింగ్ ద్వారా అంచనా వేసి, దానికి అనుగుణంగా భక్తులను విడతల వారీగా ముందుకు పంపించే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల భక్తులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా దర్శనానికి చేరుకుంటున్నారు.
టీటీడీ అమలు చేస్తున్న ఆధునిక రద్దీ నిర్వహణ విధానాల వల్లే క్యూలైన్లలో భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలిచిపోయే పరిస్థితులు లేకుండా, సాంకేతిక ఆధారంగా టీటీడీ యంత్రాంగం సమన్వయంతో భక్తులను వేగంగా దర్శనానికి పంపిస్తున్నారు.
టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ భక్తులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పరిశుభ్రత, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు భక్తుల సహకారంతో తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత సాఫీగా కొనసాగుతోంది.
ప్రస్తుతం వేసవి రద్దీ నేపథ్యంలో శని, ఆదివారాల్లో దాదాపు 85 వేలమందికి పైగా భక్తులకు దర్శనం చేయించడం జరుగుతోంది. అదేవిధంగా సాధారణ రోజుల్లో దాదాపు 75వేల మంది భక్తులకు పైగా దర్శనం చేసుకునేందుకు టీటీడీ యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. మే 2వ తేదిన అత్యధికంగా 91,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం.
తేది 2024 మే 2025 మే 2026 మే
మే 1 72,510 57,863 71,008
మే 2 65,313 74,344 91,005
మే 3 62,624 84,113 83,091
మే 4 77,848 83,380 70,996
మే 5 81,927 65,095 76,240
మే 6 76,748 69,214 71,029
మే 7 65,146 71,001 70,001
మే 8 64,766 64,850 67,222
మే 9 65,508 6,821 81,512
మే 10 60,545 85,078 85,942
మే 11 76,945 80,423 78,985
మే 12 80,001 68,760 80,389
-----------------------------------------------
మొత్తం 8,49,881 8,10,942 9,27,420
-----------------------------------------------
గత మూడేళ్లలో వేసవి రద్దీ దర్శనాల వివరాలు
2024 మార్చి: 21.10 లక్షలు
ఏప్రిల్: 20.17 లక్షలు
మే: 20.73 లక్షలు
2025 మార్చి: 21.31 లక్షలు
ఏప్రిల్: 20.73 లక్షలు
మే: 22.60 లక్షలు
2026 మార్చి: 22.28 లక్షలు
ఏప్రిల్: 21.65 లక్షలు
మే: 9.27 లక్షలు (12వ తేది వరకు)

