
తొందర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని సీటి గా హైదరాబాద్
హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు.
హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర, కేంద్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘నగరాల ఆధునికీరణ, పట్టణీకరణ భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న సవాళ్ళు’ అనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు పెరుగుతున్న నగర, పట్టణాల జనాభాకు తగ్గట్లుగా మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు.
నగరంలో అండర్ పాస్ లు, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవల్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని రేవంత్ అభిప్రాయపడ్డారు. మల్టీ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని రేవంత్ గుర్తుచేశారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని మూడు విభాగాలు క్యూర్, రేర్, ప్యూర్ అని విభజించినట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు క్యూర్ ఏరియాను సర్వీసు సెక్టార్ గా నిర్ణయించినట్లు చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్ బయట, రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఏరియానంతా ప్యూర్ మాన్యుఫ్యాక్షరింగ్ సెక్టార్ గా గుర్తించామన్నారు. చివరగా రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రేర్ ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్ కు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయటంతో పాటు మన సంస్కృతికి అనుసంధానించబోతున్నట్లు వివరించారు. నగరంలో కాలుష్య నియంత్రణకు ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చుతున్నట్లు రేవంత్ చెప్పారు. ఈ సమావేశంలోనే తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవనంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

