
ట్రైనీ ఐపీఎస్ అధికారిమీదే లైంగిక దాడి
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారులకే రక్షణ లేకుండా పోయిందా ?
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారులకే రక్షణ లేకుండా పోయిందా ? తాజాగా వెలుగుచూసిన ఘటనతో అవుననే సమాధానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమిలో శిక్షణ పొందుతున్న ఒక లేడీ ఐపీఎస్ అధికారి, సహచర ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. కొద్దికాలంగా తనపైన సహచర ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైగింక వేధింపులకు పాల్పడుతున్నట్లు సదరు లేడీ ఐపీఎస్ అకాడమి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసింది. ఉన్నతాదికారుల సూచన మేరకు ఆదివారం అత్తాపూర్ పోలీసుస్టేషన్లో ఉదయ్ పై లైగింక వేధింపుల ఫిర్యాదు చేసింది. దాంతో ఉదయ్ పై పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
కొంతకాలంగా తనను ఉదయ్ వేధిస్తున్నట్లు ఫిర్యాదులో చెప్పింది. ఈనెల 8వ తేదీన తన మొబైల్ ఫోన్ ను సదరు ఐపీఎస్ ట్రైనీ లాక్కున్నాడని, 9వ తేదీన తనను బలవంతంగా అతని గదికి లాక్కుని వెళ్ళి గొంతునులిమేందుకు ప్రయత్నించాడని ఆమె పిర్యాదులో పేర్కొన్నది. తనకు మరో ట్రైనీ ఐపీఎస్ తో సంబంధాలున్నట్లుగా తన భర్తకు ఉదయ్ మెసేజీలు పంపాడని చెప్పింది. తనకు తెలీకుండానే తనను మొబైల్ లో ఫొటోలు, వీడియోలు తీసి బాగా ఇబ్బంది పెడుతున్నట్లు లేడీ ఐపీఎస్ ఫిర్యాదులో ఆరోపించింది. అకాడమి ఉన్నతాధికారుల సూచన ప్రకారమే తాను పోలీసుస్టేషన్లో లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినట్లు లేడీ ఐపీఎస్ తన ఫిర్యాదులో స్పష్టంగా చెప్పింది. లేడీ ట్రైనీ ఐపీఎస్ కర్నాటకకు చెందిన అధికారిగా తెలుస్తోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం ఇంకా తెలీదు.

