ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
x

ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

లైంగిక వేధింపుల కేసు నమోదు, సస్పెన్షన్ తర్వాత ఎర్రగడ్డలో ఆత్మహత్యాయత్నం. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కొనసాగుతోంది.


ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం సంచలనంగా మారింది. ఎర్రగడ్డలోని మోతీనగర్‌లో ఉన్న తన సోదరుడి నివాసంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి ఆయనను ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందుతోంది. ఈ ఘటనకు ముందు ఉదయ్ కృష్ణారెడ్డిపై ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తనమీద లైంగిక ఫిర్యాదులు రావటం, అత్తాపూర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదవ్వటం, ఆరోపణలు నిజమని ప్రివిలేజ్ కమిటి నిర్ధారించటంతో ఉదయ్ మనస్ధాపానికి గురైనట్లు సమాచారం. దానికి తోడు ఎన్పీఏ ఉన్నతాధికారులు తనను తాత్కాలికంగా సస్పెండ్ చేయటంతో ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని అర్ధమైనట్లుంది. అందుకనే ఈరోజు ఉదయం శానిటైజర్లో విషం కలుపుకుని తాగాడని తెలుస్తోంది. మహిళా ఐపీఎస్ అధికారి తన

ఫిర్యాదులో, అసభ్యకర సందేశాలు పంపడం, బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి బెదిరించడం, వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఆరోపణలు చేశారు. ఈ కేసు నమోదు తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. అదే పరిస్థితిలో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఎన్‌పీఏ ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఆరోపణలకు బలం ఉందని గుర్తించిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

అలాగే ఈ వ్యవహారంపై ఎనిమిది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన అంగీకరించలేదని, తనకు ఎలాంటి తప్పు లేదని సోషల్ మీడియాలో పేర్కొన్నట్లు సమాచారం. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణం చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకు చెందిన ఆయన, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల మధ్య చదువుకుని 2013లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందారు.

అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నాలుగు ప్రయత్నాల తర్వాత ఐదోసారి 360వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఇటీవల పూర్తి స్థాయి పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టే దశలో ఉన్న ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం, ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More
Next Story