
రెండో రోజుకు ఆర్టీసీ సమ్మె.. విరమనపై జేఏసీ క్లారిటీ
సమ్మెతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు కష్టాలు. అద్దె బస్సులు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్న ప్రజలు.
తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం ఆర్టీసీని, తమను నిర్లక్ష్యం చేస్తోందని, తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వడం లేదని ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టే వరకు సమ్మె విరమించేది లేదంటూ మంగళవారం అర్థరాత్రి నుంచి సమ్మె స్టార్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ డిపోలకే పరిమితం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ.. అద్దెబస్సులు నడిపింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు పలికింది. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు డిమాండ్ చేశారు.
సమ్మె కారణంగా హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్ల నుంచి ఆర్టీసీ బస్సులు నడవలేదు. విషయం తెలియక వచ్చిన కొందరు ప్రయాణికులు గంటల పాటు వేచి చూసి, చివరికి ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మళ్లారు. ఎంజీబీఎస్ నుంచి మాత్రం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు నడుస్తున్నాయి. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను రోడ్డెక్కించింది. అయినప్పటికీ అవసరానికి సరిపోక, ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనదారులు ఛార్జీలు పెంచడంతో ఉద్యోగులు, విద్యార్థులు, దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
మహాధర్నాకు జేఏసీ పిలుపు
ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 5 గంటలకు అన్ని డిపోలు, వర్క్‌షాప్‌లకు చేరుకోవాలని సూచించింది. ప్రత్యేక కమిటీతో చర్చలు జరిగినప్పటికీ 32 డిమాండ్లపై ఎలాంటి పురోగతి లేదని తెలిపింది. 30 శాతం ఫిట్‌మెంట్ తగ్గకుండా 2021 వేతన సవరణ చేయాలని, ఎలక్ట్రిక్ బస్సుల రద్దు, బదిలీల రద్దు వంటి డిమాండ్లను మరోసారి ఉటంకించింది. ఇక ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని సూచించారు. చర్చలు కొనసాగుతున్న సమయంలో సమ్మె చట్టరీత్యా సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందని, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అవసరమైతే రంగంలోకి దిగుతాం: రామచందర్
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. వారి సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం సబబు కాదని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, లేదంటే ఆందోళనలో తాము కూడా పాల్గొంటామని హెచ్చరించారు.

