
ఫడ్నవీస్ తో రేవంత్ భేటి సక్సెస్
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముంబయ్ పర్యటన విజయవంతమైంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించుకునేందుకు అంగీకరించాలన్న రేవంత్ విజ్ఞప్తికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సోమవారం సానుకూలంగా స్పందించారు. బ్యారేజీ ఎత్తు పెంచటంవల్ల మహారాష్ట్ర భూభాగానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేనంతవరకు ఎత్తు పెంచటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే సమయంలో ఎత్తు పెంచే విషయంతో పాటు ముంపు ప్రాంతం గురించి మహారాష్ట్ర-తెలంగాణ ఉన్నతాధికారులతో జాయింట్ సర్వే, అధ్యయనం చేయించాలన్న ఫడ్నవీస్ సూచనకు రేవంత్ అంగీకారం తెలిపారు. దాంతో రేవంత్ ముంబయ్ పర్యటన విజయవంతం అయినట్లే అనుకోవాలి. జాయింట్ సర్వే, అధ్యయనంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణంతో ఇరురాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలు, నష్టాలను చర్చించడానికి విషయంలో తొందరలోనే రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరగబోతోంది.
కమిటీతో సమగ్ర అధ్యయనం
ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు రెండురాష్ట్రాల ప్రధానకార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, దాని ఎత్తు పెంపుపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ ప్రతిపాదించిన 152 మీటర్ల ఎత్తు వల్ల కలిగే ప్రయోజనాలను తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు వివరించారు.
దీనిపై స్పందించిన ఫడ్నవీస్ ప్రాజెక్టు ప్రభావాలపై మహారాష్ట్ర ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుందని తెలిపారు. బ్యారేజీ ఎత్తు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతం ఎంత పెరుగుతుంది? ప్రాజెక్టు స్థలంలో మార్పులు, సంబంధిత అభయారణ్యం చేర్పు, నదీ గర్భం వెలుపల అవసరమయ్యే భూమి ఎంత? వంటి అంశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర అధ్యయనంలో తెలంగాణకు ఏవైనా అభ్యంతరాలు లేదా లోపాలు కనిపిస్తే, రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే నిపుణుల అభిప్రాయాలనూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫడ్నవీస్ వివరించారు.
నీటిలభ్యత, మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, పర్యావరణం, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శుల నేతృత్వంలోని కమిటీ ఈఅంశాలపై అధ్యయనం చేయనుంది. అవసరమైతే ప్రత్యామ్నాయాలనూ పరిశీలించి, తదుపరి సమావేశాలు, కాలపరిమితులు, కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు.
ఎత్తుపై ఫడ్నవీస్ సానుకూలం
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ 2016లో ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఎత్తుతో తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు 152 మీటర్ల ఎత్తు అవసరమని తెలిపారు. అంతేకాకుండా ఈ వివరాలన్నింటినీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి వివరించారు. తెలంగాణ ప్రతిపాదనపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తుది నిర్ణయానికి ముందు సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ఎప్పుడూ సిద్ధమే: ఫడ్నవీస్
పొరుగు రాష్ట్రాలతో సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవడమే మహారాష్ట్ర విధానమని ఫడ్నవీస్ తెలిపారు. తమ రాష్ట్రప్రజలకు నష్టం లేకుండా, మరో రాష్ట్రానికి ప్రయోజనం కలిగే ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. గతంలోనూ తెలంగాణ ప్రతిపాదనకు మహారాష్ట్ర సానుకూలంగా స్పందించిందని గుర్తుచేశారు. అయితే, గతంలో అంచనా వేసిన దానికంటే వాస్తవ ముంపు ప్రాంతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
అందుకే తాజా ప్రతిపాదన వల్ల కలిగే ప్రభావాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీటి పంపకాలు, చట్టబద్ధమైన అనుమతులు కేంద్ర జలసంఘం పరిధిలోకి వస్తాయని ఫడ్నవీస్ గుర్తుచేశారు. కేంద్ర జలసంఘం మహారాష్ట్ర అభిప్రాయం కోరినప్పుడు వాస్తవాల ఆధారంగా తమ వైఖరిని తెలియజేస్తామని చెప్పారు. స్వతంత్ర అధ్యయనం, సాంకేతిక చర్చల తర్వాతే ప్రాజెక్టుపై తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
తుమ్మిడిహెట్టి బ్యారేజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో కీలక భాగం. గతంలో ప్రతిపాదించిన అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రూపురేఖలు మారిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు ప్రాణహిత ప్రాజెక్టు కూడా రూపుదిద్దుకుంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం దగ్గర ప్రాణహిత నదిపై ఈ బ్యారేజీని నిర్మించనున్నారు. మహారాష్ట్రలోని వార్ధా, పెన్‌గంగ నదులు కలిసే ప్రాంతంలో ప్రాణహిత నది ఏర్పడుతుంది. అక్కడ 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపాదన జరిగింది. దీని నీటి నిల్వసామర్థ్యం 1.8 టీఎంసీలు.
ఈ ప్రాజెక్టు ద్వారా సిర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు, తాగు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచితే నీటిని గ్రావిటీ ద్వారా తరలించే అవకాశాలు మెరుగుపడతాయని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిశీలించాల్సి ఉంది.
ముంపు భూములకు పరిహారం చెల్లిస్తాం
ఈ చర్చల్లో బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యే వ్యవసాయ భూముల పరిస్థితి ప్రధాన అంశంగా మారింది. అయితే ముంపుకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, పరిహార విధానం ప్రకారం రైతులకు చెల్లింపులు చేస్తామని చెప్పారు. దీంతో ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, ప్రభావిత ప్రాంతాలు, పరిహారం వంటి అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు సమగ్రంగా పరిశీలన చేయనున్నారు. ఇరు రాష్ట్రాల అంచనాలను పోల్చి, అవసరమైన సాంకేతిక అంశాలపై నిపుణులతో చర్చించాలని ప్రతిపాదించారు.
ఆదిలాబాద్ అభివృద్ధికి కీలకం
ఈభేటీ నేపథ్యంలోనే తమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రాధాన్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఊతమిస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుతనం, గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. దశాబ్దాలుగా సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షలను వివరించారు. 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఎస్బీ చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని సమావేశంలో గుర్తుచేశారు.
ఐదు దశాబ్దాలుగా పలు ప్రతిపాదనలు వచ్చినా ఆశించిన పురోగతి సాధించలేకపోయినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం కూడా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి వివరించారు. రవాణా, ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని పెంచే అవకాశంగా చూడాలని కోరారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదన్నారు. రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా కూడా నిలుస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

