
2028కి తెలంగాణలో రెండు విమానాశ్రయాలు(వీడియో)
రెండు విమానాశ్రయాలు కూడా 2028, జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు
తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని మామనూరులో రెండు విమానాశ్రయాలు రాబోతున్నాయి. ఈ రెండు విమానాశ్రయాలు కూడా 2028, జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో మీడియాతో రేవంత్ మాట్లాడుతు విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన నిధులు, అనుమతులను వేగంగా పూర్తిచేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని కోరినట్లు చెప్పారు.
కేంద్రమంత్రితో భేటీ తర్వాత రేవంత్ మీడియాకు వివరాలు అందించారు. విమానాశ్రయాల డిజైన్లు, మౌలిక వసతుల కల్పన, నిర్మాణాలకు సంబంధించిన అన్నీ అంశాలను చర్చించినట్లు చెప్పారు. రెండు విమానాశ్రయాలు పూర్తయితే ప్రాంతీయ విమాన సేవలు మరింతగా విస్తరించినట్లు అవుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
తర్వాత మెట్రో రెండోదశ విస్తరణకు సంబంధించి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఖట్టర్, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన నిధుల విడుదల, అనుమతులు, భూసేకరణకు అనుమతులు ఇవ్వాలంటు రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. మొత్తంమీద తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి పెండింగులో ఉన్న ప్రాజెక్టులపైన పలువురు కేంద్రమంత్రులను రేవంత్ కలుస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలకు సమయంలేదని ఎన్నికలు వచ్చినపుడు రాజకీయాలు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు అనుమతులతో పాటు కేంద్రం నిధులు కూడా ఇవ్వాలని రేవంత్ విజ్ఞప్తిచేశారు.

