తమిళనాడు రాజ్ భవన్ లో విజయ్ సస్పెన్స్ థ్రిల్లర్....
x

తమిళనాడు రాజ్ భవన్ లో విజయ్ సస్పెన్స్ థ్రిల్లర్....

జోసెఫ్ విజయ్ మూడు రోజుల్లో మూడోసారి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలవడంతో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ శుక్రవారం పతాక స్థాయికి చేరింది.


తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనాగుతూ ఉంది. రాజ్ భవన్ తన అధికారాన్ని బాగా ప్రదర్శిస్తూ ఉంది తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ గత మూడు రోజుల్లో మూడు సార్లు రాజ్ భవన్ సందర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలయిన మ్యాజిక్ ఫిగర్ 118 చేరేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్ భవన్ నుంచి ఆయన కు ఆహ్వానం రావడం లేదు. శుక్రవారం నాడు సస్పెన్స్ తీవ్ర స్థాయికి చేరింది. సిపిఐ, సిపిఎం పార్టీలు బేషరతుగా శుక్రవారం నాడు ఆయన మద్దతు ప్రకటించాయి. ఆమేరకు లేఖలు అందించాయి. శుక్రవారం సాయంకాలం ఆరున్నరకు లోక్ భవన్ వెళ్లి ఈ లేఖను విజయ్ స్వయంగా గవర్నర్ ఆర్లేకర్ కు అందిచారు.

దీనితో ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన అభిమానులకు, శ్రేణులకు చివరి నిమిషంలో నిరాశే ఎదురైంది. మ్యాజిక్ ఫిగర్ విషయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు, మిత్రపక్షాల డిమాండ్లు, గవర్నర్ తీరుతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. తమిళనాడులోని చిన్న పార్టీలతో కేంద్రంలోని ఓ పెద్ద పార్టీ నాయకత్వం నాటకం ఆడిస్తున్నట్టు పలువురు ఆరోపించారు. బహుశా ఇవాళ ఈ రాజకీయానికి తెర పడుతుందని భావిస్తున్నా ఇదంతా సులువుగా కొలిక్కి వచ్చేలా లేదు.

మ్యాజిక్ ఫిగర్ దోబూచులాట!

శుక్రవారం మధ్యాహ్నం వరకు అంతా విజయ్‌కు అనుకూలంగానే సాగింది. సీపీఐ, సీపీఎంలు తమ 4 సీట్ల మద్దతు లేఖలను టీవీకేకు అందజేశాయి. సాయంత్రానికి ఐయూఎంఎల్ (IUML) కూడా 2 సీట్ల మద్దతు ప్రకటించింది. దీంతో 118 మంది ఎమ్మెల్యేల (మ్యాజిక్ ఫిగర్) మద్దతు ఉందంటూ విజయ్ రాత్రి గవర్నర్‌ను కలిశారు. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. తాము మద్దతు ఇవ్వడం లేదని ఐయూఎంఎల్ అకస్మాత్తుగా ప్రకటించడంతో బలం 116కు పడిపోయింది. సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో గవర్నర్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు.

పదవుల వేటలో మిత్రపక్షాలు

ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చేరువవుతున్న కొద్దీ మద్దతు ఇస్తున్న పార్టీల డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

కాంగ్రెస్: ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 2 మంత్రి పదవుల కోసం పట్టుబడుతోంది.

వీసీకే (VCK): డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రి పదవిని కోరుతోంది. అంతేకాకుండా, విజయ్ గెలిచిన తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని ఖాళీ చేసి, అక్కడి నుంచి తిరుమావళవన్‌ను పోటీకి దింపాలని డిమాండ్ చేస్తోంది.

లెఫ్ట్ పార్టీలు: మద్దతు టీవీకేకే అయినా, తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని సీపీఐ, సీపీఎం ప్రకటించడం గమనార్హం.

రంగంలోకి అన్నాడీఎంకే.. గవర్నర్‌కు లేఖ

మరోవైపు అన్నాడీఎంకే (AIADMK) పావులు కదుపుతోంది. టీవీకే బలాన్ని నిరూపించుకోలేకపోతే తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ గవర్నర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. తమ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న లేఖలు నకిలీవని ఆయన స్పష్టం చేశారు. పళనిసామిని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు.

రాజధానిలో నిరసనలు - కోర్టులో పిటిషన్

గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్, టీవీకే శ్రేణులు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించిన టీవీకే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో కె.ఎళిలరసి అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. అయితే దీనికి తమకు సంబంధం లేదని టీవీకే స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి ఎప్పుడు?

ప్రస్తుతానికి విజయ్ ఆశలు శనివారం వీసీకే ఇచ్చే మద్దతు లేఖపైనే ఉన్నాయి. ఒకవేళ అది కూడా అందిన తర్వాత విజయ్ మరోసారి గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే మే 10న గవర్నర్ కేరళ వెళ్తారనే వార్తల నేపథ్యంలో, తమిళనాడు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ముఖ్య అంశాలు...

టీవీకే బలం: ప్రస్తుతం 116 (మ్యాజిక్ ఫిగర్ 118).

కీలక మలుపు: ఐయూఎంఎల్ మద్దతు ఉపసంహరణ.

అన్నాడీఎంకే ఎత్తుగడ: ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత.

గవర్నర్ నిర్ణయం: పెండింగ్‌లో ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం.

తమిళనాడు రాజకీయాల్లో ఈ "అధికార పోరు" ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!

Read More
Next Story