
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ లీక్ పై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సీజేపీ
నీట్ లీక్ పై ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు చేస్తున్న కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన ఈ మేరకు ఎక్స్ లో తన రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. ఈ లేఖను ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు నన్ను తీవ్రంగా బాధించాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. నీట్ లీకేజీ వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించినట్లు వివరించారు. తిరిగి నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. సంఘ విద్రోహ శక్తులకు ఆస్కారం ఇవ్వడం ఇష్టలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
స్పందించిన ప్రతిపక్షాలు..
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు స్పందించాయి. ఇది ఐక్యంగా విపక్షాలు సాధించిన విజయంగా అభివర్ణించాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థి ఉద్యమానికి, ప్రతిపక్ష ఐక్యతకు లభించిన విజయం. ఇది ప్రభుత్వ పిరికి వైఖరికి ముగింపు,. దాని నిరంకుశ పాలన అంతానికి ఇది నాంది’’ అని అన్నారు.
ప్రతిపాదిత కొత్త బిల్లు బయటకు వచ్చాక చర్చించి అవసరమైన అన్ని మెరుగులు దిద్దుతామని పేర్కొన్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. యువత చేసిన పోరాటానికి లభించిన గొప్ప విజయం ఈ రాజీనామా అని పేర్కొన్నారు. ఈ రాజీనామా ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయంగా చెప్పారు. ప్రజల గొంతు వినడానికి, వ్యవస్థలపై ప్రజలకు సన్నగిల్లుతున్న విశ్వాసాన్ని ఈ చర్య పునరుద్దరించిందని పేర్కొన్నారు.
సీజేపీ ఏమందంటే...
కేంద్రమంత్రి రాజీనామాతో అంతా అయిపోలేదని, మిగిలిన రెండు డిమాండ్లను కూడా నెరవేర్చాల్సిందే అని సీజేపీ పేర్కొంది. నిరసనకారులపై దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని, నీట్ లీకేజీలో చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇప్పించాలనే తమ డిమాండ్లను నెరవేరిస్తేనే జంతర్ మంతర్ నుంచి వెళ్లిపోతామని వారు స్పష్టం చేశారు.
Next Story

