
సీజేపీ నిరసనలపై అమెరికా ఆందోళన
భారత్‌తో చర్చించాలని రూబియోకు ఆరుగురు ఎంపీల లేఖ
సీజేపీ వెనక అమెరికా, కొంతమంది బడాబాబులు ఉన్నారని యూఎస్ పాప్ గాయకురాల చేసిన వాదనలు నిజమనే క్రమంగా అర్థమవుతోంది. దేశంలో ప్రజల మద్దతు లేకుండా ఉద్యమాలు అంటూ హడావుడి చేస్తున్న సీజేపీకి మద్దతుగా యూఎస్ లోని డెమోక్రాటిక్ సభ్యులు తమగళం విప్పారు.
నిరసనల సమయంలో భద్రతా బలగాలు అతిగా బలప్రయోగం చేశాయన్న ఆరోపణలపై భారత అధికారులతో చర్చించాలని అమెరికాకు చెందిన ఆరుగురు డెమొక్రటిక్ ఎంపీలు విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కోరారు. ఇందులో ప్రమీలా జైపాల్ తో పాటు ముస్లిం మతోన్మాద నాయకురాలు ఇల్హాన్ ఓమర్ సైతం ఉన్నారు.
ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా అక్రమ నిర్బంధాలు, అధిక బలప్రయోగం, ఇంటర్నెట్ ఆంక్షలు విధించారన్న ఆరోపణలను ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. పరీక్షల్లో అవకతవకలు, యువత నిరుద్యోగం, ఓటర్ల జాబితా నుంచి భారీ సంఖ్యలో పేర్ల తొలగింపు వంటి అంశాలపై నిరసనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సీజేపీ నిరసనలతో పాటు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ జరిగిన ఆందోళనలను కూడా వారు ప్రస్తావించారు. భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కులు భారత్, అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కీలకమైనవని అభిప్రాయపడ్డారు.
భారత్‌లో నిరసనల సందర్భంగా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరిపించాలని ఎంపీలు రూబియోను కోరారు. శాంతియుత నిరసనల్లో పాల్గొన్నందుకు చట్టవిరుద్ధంగా నిర్బంధించిన వారిని విడుదల చేసే అంశాన్ని కూడా భారత ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు.
అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, ఇతర నగరాల్లోని భారత కాన్సులేట్లు నిరసనకారులను ఫొటోలు తీసి, వారి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రయత్నించాయన్న ఆరోపణలను కూడా ఎంపీలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
అమెరికా గడ్డపై వ్యక్తులను బెదిరించడం లేదా వేధించడం నిరంతరంగా జరుగుతోందా అనే అంశాన్ని పరిశీలించాలని, అలాంటి చర్యలు నిర్ధారణ అయితే అమెరికా ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టం కింద భారత్‌కు ఆయుధ విక్రయాల అర్హతను సమీక్షించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
మార్కో రూబియో భారత పర్యటన సందర్భంగా ఈ అంశాలను భారత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలు కోరారు. ఈ లేఖలో చేసినవి ఆరోపణలు, అభ్యర్థనలు మాత్రమే. వాటిపై సంబంధిత ప్రభుత్వాల స్పందన, తదుపరి చర్యలు ఈ వ్యవహారంలో కీలకంగా మారనున్నాయి.
కాగా దేశంలో సీజేపీ అంటూ హాడావుడి చేస్తున్న అభిజిత్ దీప్కే ఇంతకుముందు అమెరికాలోనే విద్యనభ్యసించే నెపంతో బోస్టన్ కు వెళ్లాడు. అక్కడ యూఎస్ నుంచి అతనికి పూర్తి సహకారం అందిందని తేలింది. అతనికి స్కాలర్ షిప్ ఇచ్చి మరీ అమెరికాకు రప్పించుకుందని, అతని ఆడంబర జీవితమే ఇందుకు కారణమని జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ప్రజల నుంచి సీజేపీ భారీ స్థాయిలో చీత్కారం ఎదుర్కొంటోంది.
Next Story

