ఇంజినీరింగ్ సీట్లు అమ్ముడుపోవట్లేదు! అడ్మిషన్ల కోసం ఆఫర్లు..
x

ఇంజినీరింగ్ సీట్లు అమ్ముడుపోవట్లేదు! అడ్మిషన్ల కోసం ఆఫర్లు..


తెలంగాణలో ఇంజినీరింగ్ చదవాలంటే ఒకప్పుడు వేల ర్యాంకుల పోటీ. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వేల సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లు ఖాళీగా మిగిలిపోతుండగా.. విద్యార్థులను ఆకర్షించేందుకు కొన్ని ప్రైవేట్ కాలేజీలు 'బై వన్ గెట్ వన్' వంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు అడ్మిషన్ల కోసం కన్సల్టెంట్లకు భారీ కమిషన్లు ఆఫర్ చేస్తున్నాయనే సమాచారం వెలుగులోకి వచ్చింది. అసలు ఇంజినీరింగ్ అడ్మిషన్లలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

ఈ ఏడాది తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

Phase-1: జూన్ 19 ప్రారంభం – జూలై 10న తొలి విడత సీట్ల కేటాయింపు.

Phase-2: జూలై 17 ప్రారంభం – జూలై 22న రెండో విడత సీట్ల కేటాయింపు.

Final Phase: ప్రస్తుతం కొనసాగుతోంది. ఆగస్టు 5న తుది సీట్ల కేటాయింపు జరగనుంది.

రాష్ట్రంలో మొత్తం 236 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 19 ప్రభుత్వ, 217 ప్రైవేట్ కాలేజీలు. కన్వీనర్ కోటాలో 94,424 సీట్లు, మేనేజ్‌మెంట్, NRIతో కలిపి మొత్తం సుమారు 1.35 లక్షల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

రెండో విడత కౌన్సెలింగ్ ముగిసే సరికి కన్వీనర్ కోటాలోని 94,424 సీట్లలో కేవలం 71,452 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. అంటే ఇంకా 22,972 కన్వీనర్ సీట్లు ఖాళీగానే ఉన్నాయి.

ఇది కేవలం కన్వీనర్ కోటా పరిస్థితి మాత్రమే. మేనేజ్‌మెంట్ (బీ కేటగిరీ) సీట్లకు కూడా ఆశించిన డిమాండ్ కనిపించడం లేదు. ముఖ్యంగా సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లో కూడా గతంతో పోలిస్తే అడ్మిషన్లు తగ్గినట్లు తెలుస్తోంది.

సీట్లు భర్తీ కాకపోవడంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు కొత్త వ్యూహాలకు దిగుతున్నాయి.కొన్ని కాలేజీలు 'బై వన్ గెట్ వన్' ఆఫర్లతో విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు అడ్మిషన్లు తీసుకొచ్చే కన్సల్టెంట్లకు భారీ కమిషన్లు ఇస్తున్నాయి.గతంలో కన్సల్టెంట్లను కాలేజీ గేటు దాటనివ్వని యాజమాన్యాలే.. ఇప్పుడు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఐదు సీట్లు భర్తీ చేస్తే రెండు సీట్లు ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం జరుగుతుండగా, మరికొన్ని చోట్ల ఒక్కో కన్సల్టెంట్‌కు 10 నుంచి 20 మేనేజ్‌మెంట్ సీట్ల బాధ్యత అప్పగిస్తున్నట్లు సమాచారం.

ఇంజినీరింగ్‌పై విద్యార్థుల ఆసక్తి తగ్గడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇంజినీరింగ్ మాత్రమే ప్రధాన కెరీర్ ఎంపిక కాగా.. ఇప్పుడు డిగ్రీ, స్కిల్ కోర్సులు, విదేశీ విద్య, AI, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీ, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి పెరిగింది. విద్యార్థులు కాలేజీ పేరుకంటే ప్లేస్‌మెంట్లు, ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ కనెక్షన్లు, ఫీజు, రాబోయే ఉద్యోగ అవకాశాలను ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ఉద్యోగ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ కూడా అడ్మిషన్లపై ప్రభావం చూపుతోంది.

ప్రస్తుతం తుది విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఆగస్టు 5న ఫైనల్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ దశలో ఎన్ని సీట్లు భర్తీ అవుతాయి? ఇంకా ఎంత మేర ఖాళీగా మిగులుతాయి? ప్రైవేట్ కాలేజీల అడ్మిషన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి? ఇంజినీరింగ్ విద్యపై విద్యార్థుల ఆసక్తి నిజంగానే తగ్గుతోందా? లేక ఉద్యోగ మార్కెట్ మార్పుల ప్రభావమా? ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Read More
Next Story