తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు.. ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మీ
x

తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు.. ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మీ

మహిళా కమిషన్‌కు కొత్త సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఉద్యమ కుటుంబాలకు కూడా కీలక స్థానం కల్పించింది.


తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్‌ను ప్రకటించింది. కమిషన్ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జీవో విడుదల చేశారు. చైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా అసాయి షకీరాలకు మహిళా కమిషన్‌లో చోటు కల్పించారు.

బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి వీరంతా ఐదేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మను కమిషన్ సభ్యురాలిగా నియమించింది ప్రభుత్వం. అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు కూడా సభ్యురాలిగా అవకాశం ఇచ్చింది.

తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల కోసం పనిచేసిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ప్రభుత్వం ఎంపికలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహిళలపై జరిగే వేధింపులు, అన్యాయాలు, వివక్ష అంశాలపై మహిళా కమిషన్ కీలకంగా పనిచేస్తుంది.

మహిళా భద్రత, మహిళా హక్కులు, సంక్షేమ పథకాల అమలుపై కొత్త కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నియామకాలతో తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రభుత్వం మరోసారి గుర్తింపు ఇచ్చినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More
Next Story