
‘తెలంగాణ పుండుపై తేజస్వీ సూర్య కారం’
తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. బీజేపీ ఎంపీల స్పందనపై ప్రశ్నలు లేవనెత్తారు.
తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తప్పుబట్టారు. తెలంగాణ పుండుపై తేజస్వీ తన వ్యాఖ్యలతో కారం చట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ విభజకన్నా దారుణంగా తెలంగాణ విభజన జరిగిందన్న వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, ప్రాణత్యాగాలను అవహేళన చేయడమేనని మండిపడ్డారు. పార్లమెంటు సీట్లను పెంచే విషయంలో కేంద్రం దక్షిణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోందని, ఈ క్రమంలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్న అనుమానాలు, ఆందోళన సమయంలో తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అతని బాధ్యతారాహిత్యాకి ప్రతీక అని చురకలంటించారు.
దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఉందనే విమర్శలు వస్తున్న వేళ, తెలంగాణ సెంటిమెంట్‌ను దెబ్బతీయడం గర్హనీయమని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కోరాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఈ చర్య ద్వారా జరిగిన తప్పును సరిదిద్దాలని సూచించారు. ఈ విషయంపై స్పందించాల్సిన బీజేపీ నాయకులు వేరే అంశాలపై వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పాత్రపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
తాను, కేసీఆర్ తెలంగాణ కోసం పార్లమెంట్‌లోపల, బయట ఎలా పోరాటం చేశామో ఉద్యమకారులు చెబుతారని ఆమె గుర్తు చేశారు. ఈ పోరాట స్ఫూర్తినే గుర్తించి సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించారని తెలిపారు. సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఖండిస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని విజయశాంతి ప్రశ్నించారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశముంది.

