ప్రముఖ జ్యోతిష్యుడితె కవిత భేటీ..
x

ప్రముఖ జ్యోతిష్యుడితె కవిత భేటీ..

కవితను తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు పండిట్ రాధన్ వెట్రివేళ్ కలిశారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.


తమిళనాడు సీఎం విజయ్‌కు జ్యోతిష్యం చెప్పే పండిట్ రాధన్ వెట్రివేళ్ బుధవారం తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితను కలిశారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. తన రాజకీయ భవితవ్యంపై క్లారిటీ కోసం, తన వ్యూహాలకు పదును పెట్టడం కోసం తన జాతకం చెప్పించుకోవడానికే కవిత ఆయనను పిలిపించుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన రాధన్.. కవిత ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కవిత తన కుమారుడితో కలిసి రాధన్‌ను సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కవితను కలవడం చర్చకు దారితీసింది.

అయితే ఈ భేటీకి కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియలేదు. కవిత ఆహ్వానించారా? లేక రాధన్ స్వయంగా వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో కవిత తన రాజకీయ భవిష్యత్‌పై రాధన్‌ను సంప్రదించారా అనే చర్చ కూడా మొదలైంది. రాధన్ పండిట్ తమిళనాడు రాజకీయాల్లో చేసిన కొన్ని జ్యోతిష్య అంచనాలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ముందే చెప్పినట్లు ప్రచారం ఉంది. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో భిన్నమైన అంచనాలు వచ్చిన సమయంలోనూ.. విజయ్ సీఎం అవుతారని రాధన్ చెప్పినట్లు కథనాలు ఉన్నాయి.

గతంలో తమిళనాడుకు చెందిన పలువురు నేతల జాతకాలపై కూడా రాధన్ భవిష్యత్ చెప్పారు. జయలలిత మరణం గురించి ఆయన ముందే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 2021లో డీఎంకే గెలిచి స్టాలిన్ సీఎం అవుతారని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పళనిస్వామి జాతకాలపై ఆయన మాట్లాడారు. ఇదిలా ఉంటే.. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే విజయాన్ని కవిత గతంలో ప్రస్తావించారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారికి ఆ ఫలితం ఆశ కల్పించిందని ఆమె పేర్కొన్నారు.

పాత పార్టీలకు ఓటర్లు గుడ్‌బై చెప్పి కొత్త రాజకీయ శక్తికి మద్దతు ఇవ్వొచ్చని కవిత అభిప్రాయపడ్డారు. తమిళనాడులో టీవీకే, తెలంగాణలో టీఆర్ఎస్ అంటూ పోలికను కూడా ప్రస్తావించారు. విజయ్ విజయం కేవలం సినీ నటుడి ప్రజాదరణగా కాకుండా.. కొత్త రాజకీయ శక్తికి లభించిన విజయంగా చూడాలని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాధన్ పండిట్‌తో కవిత భేటీ కావడం మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఈ సమావేశంలో రాజకీయాలు లేదా కవిత భవిష్యత్‌పై ఏమైనా చర్చ జరిగిందా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

Read More
Next Story